ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

9 Jun, 2015 23:46 IST|Sakshi

 విజయనగరం కంటోన్మెంట్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను   జేసీ, రిటర్నింగ్ అధికారి  రామారావు మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా  తన చాంబర్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో  ఆయన  మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ను పక్కాగా అమలు చేయడానికి చర్యలు   తీసుకుంటామన్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన విధివిధానాల గూర్చి  డివిజన్, మండల స్థాయిల్లో ప్రతి ఒక్కరికీ తెలిసేలా అవగాహన కల్పిస్తామని, ఎన్నికల అధికారులకు అప్పగించిన బాధ్యతలపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. నామినేషన్లు ప్రారంభం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకూ ప్రతీ అంశం ఎన్నికల సంఘం సూచనల ప్రకారం జరుగుతుందన్నారు.
 
  సమస్యలు ఉత్పన్నమైతే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.  16వ తేదీ వరకూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. జూన్ 17న నామినేషన్ల పరిశీలన, 19న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల   ఉపసంహరణ ఉంటుందని చెప్పారు.    జూలై 3వ తేదీ   ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్  నిర్వహిస్తామని చెప్పారు. ఏడవ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. పదో తేదీ నాటికి ఎన్నికల విధులు పూర్తవుతాయని ఆయన చెప్పారు. మొత్తం జిల్లాలో 719 ఓటర్లు ఉన్నారన్నారు. ఎన్నికల కోడ్ అమలు బాధ్యతను జెడ్పీ సీఈఓ జిల్లా వ్యాప్తంగా చేపడతారన్నారు. మండలాల్లో ఎంపీడీఓలు, డివిజన్లలో ఆర్డీఓలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు ఎన్నికల కోడ్ అమలు  బాధ్యత వహిస్తారన్నారు. సహాయ రిటర్నింగ్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి  వ్యవహరిస్తారన్నారు.
 

మరిన్ని వార్తలు