పాలనకు ఆఖరి రోజు

1 Aug, 2018 10:09 IST|Sakshi

ఒంగోలు టూటౌన్‌ (ప్రకాశం):  గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు నేటితో పూర్తి కానుంది. ఆగస్టు 1వ తేదీతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో నూతల పాలకవర్గాలు పదవీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కానీ, దీనిపై ప్రభుత్వం నోరు మెదపకపోవడంతో సర్పంచులలో ఆందోళన నెలకొంది. ఇక ఎన్నికలు లేవని తేల్చుకున్న సర్పంచులు కనీసం పర్సన్‌ ఇన్‌చార్జులుగానైనా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు సోమవారం (జూలై 30వ తేదీ)న తమ తీర్పును వెలువరించింది. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించలేకపోయిన సందర్భంగా పర్సన్‌ ఇన్‌చార్జులుగా సర్పంచులను నియమించడంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందని సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వీరభద్రాచారి తెలిపారు. కాని ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో స్థానిక సంస్థలలో ఉత్కంఠ నెలకొంది.

అన్నీ ఉన్నా కాలయాపన
జిల్లాలో 56 మండలాలు ఉండగా కందుకూరు, మార్కాపురం, ఒంగోలు డివిజన్‌లుగా ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 1028 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 10,396 వార్డులు ఉన్నాయి. వీటికి సకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రావాల్సి ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకుంటుంది. ఇటీవల జిల్లాలోని గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితా ప్రచురణకు ఎన్నికల కమిషన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన సర్క్యులర్‌ కూడా జారీ చేసి గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు చర్యలు తీసుకుంది. వార్డుల వారీగా ఫొటోలతో ఉన్న ఓటర్ల జాబితాను ప్రచురించారు. మొత్తం జిల్లాలో 10,00,365 పురుషులు, స్త్రీలు 10,00,741 స్త్రీల ఓటర్లు ఉన్నట్లు జిల్లా పంచాయతీ అధికారుల తేల్చారు. కందుకూరు డివిజన్లో అత్యధిక ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. వీరితో పాటు థర్డ్‌ జండర్‌ ఓటర్లు మరో 59 వరకు ఉన్నాయి.

ఒంగోలు డివిజన్‌లో పురుష ఓటర్లు 3,84,041 మంది ఉండగా మహిళా ఓటర్లు 3,95,243 మంది ఉన్నారు. థర్డ్‌ జండర్‌ ఓటర్లు 30 మంది ఉన్నారు. కందుకూరు డివిజన్‌లో 8,13,500 మంది ఓటర్లు ఉండగా  అందులో మహిళా ఓటర్లు 4,02,325 మంది మహిళా ఓటర్లు ఉన్నా రు. దర్డ్‌ జండర్‌ ఓటర్లు 29 మంది ఉన్నారు. మార్కాపురం డివిజన్లో పురుష ఓటర్లు 2,05,554 మంది ఉండగా మహిళా ఓటర్లు 2,02,797 మంది ఉన్నారు. ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాను జిల్లా అధికారులు సిద్ధం చేశారు. రెండు నెలల క్రితం కర్ణాటక నుంచి బ్యాలెట్‌ బాక్స్‌లు జిల్లాకు తెప్పించడం జరిగింది. అన్ని సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసింది. చివరకు నేడొక్క రోజే గడువు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయం కోసం స్థానిక సంస్థల ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు.

 
ఓటమి భయంతోనే..
స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేకపోవడం జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామనే భయంతోనే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణను వాయిదా వేసుకుందని పలువురు సర్పంచులు విమర్శిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న భయంతోనే వెనకడుగు వేసిందని సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు తెలిపారు. ప్రజావ్యతిరేక విధానాలు అవంభిస్తే ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. అయినా ఇప్పటికైనా ప్రభుత్వం ప్రస్తుతం పాలకవర్గానే పర్సన్‌ ఇన్‌చార్జులుగా కొనసాగించి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు