పసిప్రాయం ఎగ‘తాళి’!

5 Nov, 2019 04:32 IST|Sakshi

బాల్య వివాహాల్లో దేశంలో ఏపీది రెండవ స్థానం

అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండకముందే పెళ్లిళ్లు

రాష్ట్రంలోని గ్రామాల్లో 35.5 శాతం, పట్టణాల్లో 26.3 శాతం మంది బాలికలకు వివాహాలు

బాలురలో ఇది గ్రామాల్లో 13.2 శాతం, పట్టణాల్లో 8.8 శాతం 

చిన్న వయస్సులోనే పెళ్లిళ్లతో అమ్మాయిలు అనారోగ్యంపాలు

చట్టాలున్నా ఆగని దురాచారం.. 

వారిలో ఆలోచన శక్తి, సమస్యలను అధిగమించే పరిస్థితి ఉండదు. దీంతో గృహహింస, లైంగిక వేధింపులు, సామాజికంగా విడిపోవడం వంటి పరిస్థితులకు గురవుతారు. త్వరగా వృద్ధాప్యం వచ్చి వ్యాధి నిరోధక శక్తి లోపిస్తుంది. రక్తహీనత ఏర్పడుతుంది.

కారణాలు
పేదరికం, అక్షరాస్యతలో బాలికల శాతం తక్కువగా ఉండడం. వారికి తక్కువ హోదా కల్పించడం, ఆర్థిక భారంగా భావించడం.. సాంఘికాచారాలు, సంప్రదాయాలు బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి.

దుష్పరిణామాలు 
బాల్య వివాహాలవల్ల చిన్న వయస్సులోనే బాలికలు గర్భం దాలిస్తే కాన్పు కష్టం కావటం, ప్రసూతి మరణాలు, శిశు మరణాలు అధికంగా ఉంటాయి. 

సాక్షి, అమరావతి : వివాహ భారంతో పసిప్రాయం నలిగిపోతోంది. మూడుముళ్ల బంధం పేరుతో బాలికల మెడలో పడుతున్న తాళి వారి జీవితానికి గుదిబండగా మారుతోంది. అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండక ముందే పెళ్లిళ్లు చేస్తే నేరమని చట్టాలు చెబుతున్నా మైనర్‌ వివాహాలు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 అమలులోకి వచ్చినప్పటికీ పెళ్లీడు రాక ముందే జరుగుతున్న వివాహాలకు అడ్డుకట్ట పడట్లేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ఇటీవల చేసిన సర్వేలు సైతం దేశంలోను, రాష్ట్రంలోను జరుగుతున్న బాల్య వివాహాలపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్‌ ఎమర్జెన్సీ ఫండ్‌ (యూనెసెఫ్‌) లెక్కల ప్రకారం.. 40 శాతం కంటే ఎక్కువ బాల్య వివాహాలతో భారతదేశం ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. అలాగే, దేశంలో పరిశీలిస్తే మధ్యప్రదేశ్‌లో 73 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 71, రాజస్థాన్‌లో 68, బీహార్‌లో 67, ఉత్తరప్రదేశ్‌లో 64 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రానికి వస్తే.. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు వరుస స్థానాల్లో ఉన్నాయి. 

ఏపీలో బాలికలే ఎక్కువ..
బాల్య వివాహాల్లో ఎక్కువగా బాలికలే ఉండటం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015–2016 లెక్కల ప్రకారం దేశంలోని బాల్య వివాహాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో జరుగుతున్న 45 శాతం పెళ్లిళ్లలో 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహాలు జరగడం గమనార్హం. ఇది గ్రామాల్లో 35.5 శాతం, పట్టణాల్లో 26.3 శాతంగా ఉంది. పురుషుల విషయానికొస్తే.. 21 ఏళ్లు నిండని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 13.2 శాతం, పట్టణాల్లో 8.8 శాతం మందికి వివాహాలు జరుగుతున్నాయి. అలాగే, ఏపీకి సంబంధించి చైల్డ్‌లైన్‌–1098కు 2017–18 కాలంలో వచ్చిన ఫిర్యాదుల్లో 1,700.. 2018–19లో 1,900 బాల్య వివాహాలు జరిగాయి. అయితే, ఇలా వెలుగు చూడనివి మరెన్నో ఉన్నాయి. 

బాల్య వివాహాలకు బీజం ఇలా..
ఫ్రెంచి, పోర్చుగీసు, డచ్, బ్రిటీషు వాళ్లు భారతదేశాన్ని పాలించే కాలంలో కొంతమంది విదేశీ అధికారులు భారతీయ కన్యలను బల వంతంగా వివాహమాడటం, బలాత్కరించడం జరిగేది. వివాహితుల జోలికి రారనే ఉద్దేశ్యంతో తమ ఆడబిడ్డలను కాపాడుకునేందుకు భారతీ యులు తమ పిల్లలకు బాల్యంలోనే పెళ్లిళ్లు చేసే వారనే ప్రచారం ఉంది. రానురాను కుటుంబాల మధ్య సంబంధాలను పటిష్ఠ పరచుకోవడానికి ఆడపిల్ల పుట్టగానే తమ బంధువర్గంలో ఫలానా వాడికి భార్య పుట్టిందని ఇరువర్గాల వారు నిర్ణయించుకుని మొదట బొమ్మల పెళ్లిచేసి పెద్దయ్యాక వివాహం చేసేవారు. తాము చనిపోయే లోపు తమ వారసుల పెళ్లిళ్లు చూడాలనే వృద్ధుల కోరికను తీర్చడానికి కూడా పురుషుడి వయస్సు ఎక్కువైనా జరిపించే వారు. అనం తరం కాలంలో.. రాజా రామ్మోహన్‌ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘ సంస్కర్తల కారణంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. అయినా ఇవి జరుగుతూనే ఉన్నాయి.

నిరోధించే చట్టాలు
బ్రిటిష్‌ పాలకులు 1929లో చైల్డ్‌ మ్యారేజ్‌ రిస్ట్రిక్ట్‌ యాక్ట్‌ తెచ్చారు. అనంతరం.. భారత ప్రభుత్వం బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ చైల్డ్‌ మ్యారేజెస్‌ యాక్ట్‌) 2007 జనవరి 10న ఆమోదం పొంది, 2007 నవంబర్‌ 1 నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం 18 ఏళ్లలోపు ఆడపిల్లలు, 21 ఏళ్ల లోపు మగపిల్లలు బాలల కిందకే వస్తారు. ఈ వయస్సులోపు వారికి పెళ్లి చేస్తే జిల్లా కలెక్టర్, ఫస్ట్‌క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్, మెట్రోపాలి టన్‌ మేజిస్ట్రేట్, పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారులు, వీఆర్‌ఓ, వీఆర్‌ఏలకు ఫిర్యాదు చేయవచ్చు. వివాహ నమోదు చట్టంతో కూడా వీటికి చెక్‌ పెట్టవచ్చు. అలాగే, బాల్యవివాహం చేసిన వారెవరైనా నేరస్థులే. పెళ్లికి హాజరవ డమూ నేరమే. వీరికి రెండేళ్ల వరకు కఠిన కారా గార శిక్ష.. రూ.లక్ష వరకు జరిమానా విధించ వచ్చు. ఈ నేరాలకు బెయిల్‌ కూడా ఉండదు.

బాల్య వివాహం సామాజిక దురాచారం
తగిన వయసు రాకుండానే పెళ్లి చేయడంవల్ల బాలికలు సమస్యల సుడిగుండంలో కూరుకుపోతున్నారు. శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను కుంగదీసే ఈ వివాహాలు సమర్థనీయం కాదు. సామాజిక దురాచారంగా ఉన్న ఈ వ్యవస్థను నిరోధించేలా కఠిన చర్యలు తీసుకోవాలి. 
– మణెమ్మ, సామాజిక కార్యకర్త

నిరోధానికి కఠిన చర్యలు చేపట్టాలి
బాల్య వివాహాల నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలి. దురదృష్టం ఏమిటంటే రాష్ట్రంలో గతం నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బాల్య వివాహాలపై స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేస్తే వాటిని నిలుపుదల చేయిస్తున్నారు. కానీ, కేసులు పెట్టి చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. 
– ఎన్‌. రామ్మోహన్, హెల్ప్‌ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి

మరిన్ని వార్తలు