‘అనైతిక’ ఆరోపణలకు ఆధారాల్లేవు

5 Nov, 2019 04:32 IST|Sakshi

ఎక్సే్ఛంజీకి ఇన్ఫోసిస్‌ వెల్లడి

న్యూఢిల్లీ: కంపెనీ టాప్‌ మేనేజ్‌మెంట్‌ ’అనైతిక’ విధానాలకు పాల్పడుతోందంటూ వచ్చిన ఆరోపణలకు సంబంధించి తమకు ఇంకా ప్రాథమిక ఆధారాలేమీ లభించలేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. ‘ప్రస్తుతం ప్రాథమిక ఆధారాలేమీ లేవు. గుర్తు తెలియనివారు చేసిన ఆరోపణలపై విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సదరు ఆరోపణల విశ్వనీయత, నిజానిజాల గురించి కంపెనీ వ్యాఖ్యానించే పరిస్థితిలో లేదు‘ అని నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీకి (ఎన్‌ఎస్‌ఈ) తెలియజేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు శార్దూల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ అండ్‌ కంపెనీని నియమించుకున్నామని, అలాగే అంతర్గతంగా స్వతంత్ర ఆడిటర్‌ ఎర్న్‌స్ట్‌ అండ్‌ యంగ్‌తో కూడా చర్చలు జరుపుతున్నామని పేర్కొంది.

ఆరోపణల్లో ప్రస్తావించిన నిర్దిష్ట ప్రక్రియలను సమీక్షించాల్సిందిగా స్వతంత్ర ఆడిటర్‌ను కోరినట్లు ఇన్ఫీ వివరించింది. భారీ ఆదాయాలు చూపించడం కోసం ఇన్ఫీ సీఈవో సలిల్‌ పరీఖ్, సీఎఫ్‌వో నీలాంజన్‌ రాయ్‌ ’అనైతిక’ విధానాలకు పాల్పడుతున్నారంటూ పేరు వెల్లడించని కొందరు ఉద్యోగులు కంపెనీ బోర్డుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆధారాలు కూడా అందిస్తామని వారు పేర్కొన్నారు.  ఈ ఆరోపణలపై సత్వరం ఇన్ఫోసిస్‌ యాజమాన్యం విచారణ ప్రారంభించింది. అటు అమెరికాలో కూడా సెక్యూరిటీస్‌ ఎక్సే్ఛంజీ (ఎస్‌ఈసీ) దీనిపై విచారణ జరుపుతోంది. ఈ ఆరోపణల గురించి ముందుగానే ఎందుకు వెల్లడించలేదన్న దానిపై ఎన్‌ఎస్‌ఈ వివరణ కోరిన మీదట.. ఇన్ఫోసిస్‌ తాజా అంశాలు తెలియజేసింది.
సోమవారం ఇన్ఫోసిస్‌ షేరు 3 శాతం పెరిగి రూ. 709 వద్ద క్లోజయ్యింది.

మరిన్ని వార్తలు