హోదా.. మన హక్కు!

24 Jul, 2018 07:51 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: ఆంధ్రప్రదేశ్‌ అన్నివిధాలా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా అవసరమని ఆర్థిక నిపుణులు, 10శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాతో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉందని సాగునీటి నిపుణులు, వివిధ రాయితీల నేపథ్యంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు అయ్యే అవకాశముందని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఏపీ రీ–ఆర్గనైజేషన్‌ యాక్టు నేపథ్యంలో ప్రత్యేక హోదా–ఏపీ హక్కుగా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. హోదా సాధనే లక్ష్యంగా, కేంద్రప్రభుత్వం కళ్లు తెరిపించాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన బంద్‌ పిలుపునకు అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. తమ ఆకాంక్ష హోదా అంటూ నినదించేందుకు జిల్లావాసులు సిద్ధమవుతున్నారు.

ముక్తకంఠంతో మద్దతు
ఆంధ్రప్రదేశ్‌ 13 జిల్లాలకు గాను 8 జిల్లాలు వెనుకబడ్డ ప్రాంతాలు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకంజలో ఉన్నాయి. కేవలం ఐదు జిల్లాలే తలసరి ఆదాయంలో కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఈనేపథ్యంలో ప్రత్యేక హోదా ప్రకటిస్తే పన్ను రాయితీల కారణంగా పరిశ్రమలు భారీగా తరలివస్తాయి. ఆ మేరకే యావత్తు ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కావాలని ముక్త కంఠంతో కోరుతోంది. ప్రజల ఆకాంక్షను గౌరవించాల్సిన కేంద్ర ప్రభుత్వం బాధ్యతను విస్మరిస్తోంది. హోదా ఇవ్వలేమంటూ కుంటిసాకులు చెప్పుకొస్తుంది.

ప్యాకేజీ మాత్రమే ఇస్తామని కేంద్ర మంత్రి మండలి ప్రకటిస్తే అందుకు సీఎం స్వాగతం చెబుతూ వంతపాడారు. అదే విషయాన్ని తాజాగా పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. ప్రజల ఆకాంక్షను గౌరవించాల్సిన కేంద్ర ప్రభుత్వం హోదా ఇవ్వలేమంటూ తెగేసి చెప్పింది. ఈ పరిణామం ఏపీ ప్రజానీకానికి ఏమాత్రం రుచించడం లేదు. ఎన్నికల ముందు ఏపీకి 10 ఏళ్లు హోదా అవసరమని ఒకరంటే, కాదు కూడదు 15ఏళ్లు అవసరమని మరొక పార్టీ వెల్లడించింది. అధికారం చేజెక్కించుకున్న తర్వాత అటు బీజేపీ, ఇటు టీడీపీ నేతలు ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించారు. వైఎస్సార్‌సీపీ ప్రత్యక్ష ఆందోళన చేపట్టినా అవహేళన చేస్తూ కాలం వెల్లిబుచ్చారని పలువురు వివరిస్తున్నారు.

ఎందుకు కావాలంటే....
తలాతోక లేని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదానే శరణ్యమని నిపుణులు వివరిస్తున్నారు. అందుకు అవసరమైన భౌగోళిక, మౌలిక వసతలు ఏపీలో ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. తద్వారా పారిశ్రామికంగా వృద్ధి చెందే అవకాశం ఉందని, నిరుద్యోగ సమస్య తీరడంతోపాటు, లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి సాధ్యం కానుందని విశ్లేషకులు వివరిస్తున్నారు. మరీ ముఖ్యంగా వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల ఉన్నతికి ప్రత్యేక హోదా సంజీవని కానుందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆశలు పెంచుకున్న ప్రజానీకంపై కేంద్రప్రభుత్వం నీళ్లు చల్లిందని ప్రజానీకం వాపోతుంది.

వైఎస్సార్‌ జిల్లాలాంటి విరివిగా ఖనిజాలు ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక హోదాతో ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడితే, ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వలసలు వెళ్లే దౌర్జాగ్యపు పరిస్థితికి దూరంగా ఉండే అవకాశం ఉందని పలువురు వివరిస్తున్నారు. ఇప్పటికే విభజన బిల్లులో ఉన్న కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ మరోమారు తేల్చి చెప్పడంపై ప్రజలు రగిలిపోతున్నారు.

హోదా కోసం పదవులను త్యజించిన ఎంపీలు
రాష్ట్ర ప్రయోజనాల రీత్యా వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి పోరాటమార్గం ఎంచుకుంది. నాడు సమైక్యాంధ్రప్రదేశ్‌ కోసం పరితపించిన ఆ పార్టీ, నేడు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నతికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌పై మొదటి నుంచి పోరాడుతూనే ఉంది. ఈక్రమంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక ఉద్యమాలు చేపట్టారు. రాష్ట్ర బంద్‌లు తలపెట్టారు. యువభేరి కొనసాగించారు. పార్లమెంట్‌లో ఎంపీలతో అవిశ్వాసం నోటీసులు ఇప్పించారు. దాదాపు 14 మార్లు నోటీసులు జారీ చేసినా చర్చకు అవకాశం ఇవ్వకపోవడంతో వారితో పదవులకు రాజీనామా చేయించారు.

ఆపై ఎంపీలతో ఆమరణదీక్షలు చేయించారు. ఈక్రమంలోనే జిల్లాలో కడప, రాజంపేట ఎంపీలు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలు పదవులకు రాజీనామా చేశారు. ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలనే దిశగా అడుగులు వేస్తూ వచ్చారు. టీడీపీ ఎంపీలు సైతం పదవులు త్యజించి ప్రాంతం కోసం పోరాటం చేయాలని డిమాండ్‌ చేశారు. అయినా స్పందన లేకపోయింది. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్రకటించడంతో మరోమారు మంగళవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఆమేరకు బంద్‌ చేపట్టేందుకు వైఎస్సార్‌సీపీ సన్నాహాలు చేపట్టింది. రాష్ట్ర బంద్‌ను జిల్లావ్యాప్తంగా స్వచ్ఛందంగా చేపట్టేందుకు ప్రజానీకం సైతం ఆసక్తి ప్రదర్శిస్తుండడం విశేషం. 

నాడు వంతపాడి.. నేడు యూటర్న్‌
కేంద్రప్రభుత్వం ప్రత్యేకహోదా స్థానంలో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ప్రకటించగానే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతిస్తున్నామని ప్రకటించారు. అప్పట్లోనే ప్రజల ఆకాంక్ష రాష్ట్ర స్థితిగతుల నేపథ్యంలో ప్రత్యేకహోదా డిమాండ్‌ చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం సవరించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. నాలుగున్నరేళ్లు కాలం కలిసిమెలిసి అధికారాన్ని పంచుకున్న టీడీపీ తాజాగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ యూటర్న్‌ తీసుకుంది. ఆమేరకు పార్లమెంటులో కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించింది. మొదటి నుంచి అదే వైఖరిని ప్రకటించి ఉంటే కేంద్రం హోదాకు మొగ్గుచూపాల్సి వచ్చేదని పలువురు వివరిస్తుండడం విశేషం. 

మరిన్ని వార్తలు