అధిక ధరలకు టికెట్లమ్మితే భారీ జరిమానా

6 Oct, 2019 05:10 IST|Sakshi

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులకు రవాణా శాఖ హెచ్చరిక

నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.25 వేల అపరాధ రుసుం

సాక్షి, అమరావతి: దసరా పండగ దృష్ట్యా ప్రయాణికుల అవసరాలను క్యాష్‌ చేసుకునే ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు ముకుతాడు వేసేందుకు రవాణా శాఖ రంగంలోకి దిగింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రవాణశాఖ అధికారులు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించారు. టికెట్ల రేటు పెంచినా.. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక జారీ చేశారు. పండగ వేళల్లో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ గతంలోనూ అధికంగా రేట్లు పెంచి ప్రయాణికుల నుంచి భారీగా దండుకున్నాయి. టీఎస్‌ఆరీ్టసీ సమ్మె దృష్ట్యా హైదరాబాద్, తెలంగాణలో ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికులను ట్రావెల్స్‌ నిర్వాహకులు ఇబ్బందులు పెడతారనే సమాచారంతో రవాణా శాఖ అప్రమత్తమైంది.

టికెట్ల ధర ఎంత వసూలు చేస్తే..అంతకు రశీదులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పండగ సీజన్‌లో పది రోజుల పాటు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా నిరంతర తనిఖీలతో అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలందాయి. ఎక్కడైనా ట్రావెల్స్‌ నిర్వాహకులు టికెట్ల ధర భారీగా వసూలు, ఒకే పరి్మట్‌తో రెండు వైపులా బస్సుల్ని తిప్పితే.. ఒకసారికి రూ.25 వేల జరిమానా, రెండోసారి పట్టుబడితే మొదటి జరిమానాకు ఐదు రెట్లు అధికంగా జరిమానా విధించేలా ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలందాయి.

వాట్సాప్‌ నంబరుకు ఫిర్యాదులు..
ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అక్రమాలుకు, నిబంధనల ఉల్లంఘనలపై సమాచారం ఇవ్వాలంటే వాట్సాప్‌ నంబరు 9542800800కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రయాణికులకు సూచించారు.  

మరిన్ని వార్తలు