వెల్లువెత్తిన వినతులు

12 Dec, 2018 08:09 IST|Sakshi
ఆమదాలవలస బ్రిడ్జిరోడ్డు జంక్షన్‌లో ఏర్పాటు చేసిన ప్రజా సంకల్పయాత్ర కటౌట్‌

అన్ని అర్హతలు ఉన్నా సంక్షేమ పథకాలు అందడం లేదంటూ బాధితులంతా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయారు. ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకుంటున్నా టీడీపీ సర్కారు కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమదాలవలస నియోజకవర్గంలో మంగళవారం జరిగిన ప్రజా  సంకల్ప యాత్రలో భాగంగాజగనన్నను కలిసి సమస్యలు విన్నవించుకున్నారు.– ప్రజాసంకల్ప యాత్ర బృందం

 సాగునీటి కష్టాలు తీర్చాలి
వ్యవసాయాధారిత మండలమైన బూర్జలో సాగునీరు అందక వేలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొరుగునే ఉన్న పాలకొండ మండలానికి తోటపల్లి ప్రాజెక్టు ద్వారా, ఆమదాలవలస మండలానికి వంశధార ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతోంది. బూర్జ మండలానికి కనీసం ఒక్క చుక్క నీరు కూడా అందడం లేదు.  మండలంలో 27 పంచాయతీల్లో 10వేల ఎకరాల పంటభూములన్నీ వర్షాధారంపైనే ఆధారపడి పంటలు సాగుచేస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు కృషి చేయాలన్నా..– వావిలపల్లి గోవిందరావు, రైతు, కొండపేట, బూర్జ మండలం.

దివ్యాంగుడిపై దయలేదు..
అయ్యా.. రోడ్డు ప్రమాదంలో నా కాలి వేళ్లు పూర్తిగా పోగొట్టుకున్నాను. ప్రస్తుతం నడవ లేని పరిస్థితి. దివ్యాంగ పింఛన్‌ కోసం దరఖాస్తు  చేసుకున్నా మంజూరు చేయడం లేదు. ఇప్పటికే గ్రామసభల్లో దరఖాస్తులు పెట్టినా సదరం సర్టిఫికెట్‌ అడుగుతున్నారు. వైద్యులు సదరం సర్టిఫికేట్‌ అందజేయకపోవడంతో పింఛన్‌రావడం  లేదు. మీరైనా స్పందించి న్యాయం చేయాలయ్యా..
– హనుమంతు ధనుంజయరావు,చింతాడ, శ్రీకాకుళం

చెరుకు రైతులను ఆదుకోండి
ఆమదాలవలసలోని చక్కెర కర్మాగారం మూసివేయడంతో రైతులంతా ఇబ్బందులు పడుతున్నాం. గతంలో సాగునీరు సక్రమంగా అందేది కాదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దయవల్ల సాగునీరు సక్రమంగా అందుతున్నా చక్కెర కర్మాగారం అందుబాటులో లేదు. దీంతో చెరుకు సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధర దొరకడం లేదు. రైతుల సమస్యలపై దృష్టి సారించి ఆమదాలవలసలోని చక్కెర కర్మాగారం తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలి.–కూన అప్పారావు, మంగయ్యపేట, శ్రీకాకుళం

దరఖాస్తులే మిగిలాయి..
ప్రస్తుత ప్రభుత్వ పాలనలో అర్హులకు ఇల్లు, స్థలాలు మంజూరు చేయడం లేదు. జన్మభూమి –మాఊరు గ్రామసభల్లో దరఖాస్తులు చేసుకోవడం తప్ప ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికార పార్టీ వారికే ఇళ్లు, పింఛన్లు మంజూరు చేస్తున్నారు. నా భర్తకు 65 ఏళ్లు. అనారోగ్యంతో మంచానపడ్డారు. పింఛన్‌ మంజూరు చేయాలని దరఖాస్తులు చేసుకున్నా స్పందించడంలేదు.  ఈ ప్రభుత్వ హయాంలో పేదవారికి న్యాయం జరగడం లేదు. మీ పాలనలో మాకు న్యాయం చేయాలి.– కండేల కృష్ణ్ణవేణి, చింతాడ, శ్రీకాకుళం

మరిన్ని వార్తలు