శభాష్‌.. సచివాలయ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ప్రశంసలు

9 Sep, 2019 03:56 IST|Sakshi

ముగిసిన రాత పరీక్షలు

యూపీఎస్‌సీ స్థాయిలో పరీక్షల ఏర్పాట్లు

ఆరు రోజుల పాటు జరిగిన పరీక్షలకు దాదాపు 20 లక్షల మంది హాజరు

లీకు లేకుండా, తప్పులు దొర్లకుండా పకడ్బందీగా నిర్వహణ

45 రోజుల సమయంలోనే అంతా.. లక్షన్నర ఉద్యోగాల్లో.. ఏదైనా రికార్డే

ప్రతి విషయంలో స్పష్టంగా కనిపించిన ప్రభుత్వ చిత్తశుద్ధి

అక్టోబరు 2కు నియామకాలు పూర్తి

సాక్షి, అమరావతి : ప్రతిపక్షాల ప్రచారం నమ్మి ‘సచివాలయ’ ఉద్యోగాలంటే ఏవేవో అనుమానాలు వ్యక్తం చేసిన అభ్యర్థులు సైతం రాత పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని చూసి శభాష్‌ అంటున్నారు. ఒక రాష్ట్రంలో 1,34,524 ఉద్యోగాలకు ఏకంగా 19,49,218 మంది హాజరవ్వడం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించడం రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే రికార్డు అని అధికారులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆదివారంతో ఉద్యోగాల రాత పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. ఈ నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య ఆరు రోజుల పాటు జరిగిన పరీక్షలకు ఏకంగా 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రశ్నాపత్రం రూపకల్పన, పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లు సివిల్స్‌ రాతపరీక్షలు నిర్వహించే యూపీఎస్‌సీ స్థాయిలో ఉన్నాయని అటు పరీక్ష రాసిన అభ్యర్థులు, ఇటు మేధావులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎగతాళి చేశారు..
రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశంలోని మరే రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఒకే విడత 1,34,524 ఉద్యోగాలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం జూలై నెలలో నోటిఫికేషన్లు జారీ చేసింది. పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖలు కలిపి 1,26,728 ఉద్యోగాలకు, విద్యుత్‌ సంస్థలు మరో 7,796 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. స్వాతంత్య్రం వచ్చాక గత 72 ఏళ్లలో జరిగిన నియామకాల ద్వారా రాష్ట్రంలో ఇప్పుడున్న మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 4.61 లక్షలుగా ఉంది. ఆ సంఖ్యలో దాదాపు మూడో వంతు ప్రభుత్వ ఉద్యోగాలను ఒకే విడతలో భర్తీ చేసేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున వైఎస్‌ జగన్‌ లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేస్తే.. అవన్నీ వాళ్ల పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుంటారులే అంటూ ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసేందుకు 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తే 21,69,589 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిపక్షాలు చేసే ప్రచారం నమ్మి దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ఈ ఉద్యోగాలు మెరిట్‌ ఆధారంగా జరగుతాయా లేదా అని అనుమానం వ్యక్తం చేశారు. అలా అనుమానం వ్యక్తం చేసిన వారు సైతం రాత పరీక్షలు ముగిశాక ప్రభుత్వ చిత్తశుద్ధిని కొనియాడుతున్నారు. 

అతి తక్కువ సమయంలో నిర్వహణ
రాష్ట్రంలో ఇదివరకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడ్డాక భర్తీ ప్రక్రియ పూర్తవ్వడానికి ఏడాదో, రెండేళ్లో, కొన్ని సార్లు మూడు నాలుగేళ్లు పట్టిన ఉదంతాలున్నాయి. కానీ ‘సచివాలయ’ ఉద్యోగ నియామకాల ప్రక్రియ అంతా రెండున్నర నెలల్లోనే ముగియనుంది. 1,26,728 ఉద్యోగాలకు జూలై 26న నోటిఫికేషన్‌ విడుదల అయింది. సెప్టెంబర్‌ 8వ తేదీ నాటికి అన్ని ఉద్యోగాలకు రాత పరీక్షలు మగిశాయి. జవాబు పత్రాల స్కానింగ్‌ ప్రక్రియ కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తయినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.   అక్టోబర్‌ 2వ తేదీ నాటికి నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు ఉద్యోగ నియామకాల పత్రాలు అందజేసి, వారు విధుల్లో కూడా చేరిపోతారని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 125 రోజుల్లో.. నోటిఫికేషన్‌ జారీ చేశాక కేవలం 65 – 70 రోజుల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని అధికారులు కంకణం కట్టుకొని పని చేస్తున్నారు. 

యూపీఎస్‌సీ పరీక్షల స్థాయిలో ఏర్పాట్లు
ఉద్యోగ నియామక ప్రక్రియలో కీలకమైన రాత పరీక్షల నిర్వహణ కూడా జాతీయ స్థాయి పోటీ పరీక్షలను నిర్వహించే యూపీఎస్‌సీ స్థాయికి ఏ మాత్రం తక్కువగా లేదని పరీక్ష రాసిన అభ్యర్థులు చెబుతున్నారు. ఒకేసారి దరఖాస్తు చేసుకున్న 21.69 లక్షల మంది అభ్యర్థులకు సాధ్యమైనంత మేర అతి తక్కువ దూరంలో పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నెల 1వ తేదీ ఉదయం జరిగిన రాత పరీక్షకు ఒక్కదానికే 12.54 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడంతో రాష్ట్రంలోని మారు మూల మండల కేంద్రాల్లో సైతం కేంద్రాలను ఏర్పాటు చేసింది. 4,465 కేంద్రాల్లో పరీక్షలు జరపడంతో ఆ పరీక్షకు ఏకంగా 92.77 శాతం మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రంలో ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక గది కేటాయించారు. సమగ్ర పర్యవేక్షణకు ఒక పరీక్షా కేంద్రంలో పది గదులు మించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు మంచి నీటి పేరుతో తమ సీటు నుంచి కదలకుండా కూర్చున్న చోటుకే అందజేసేలా ముందుస్తు ఏర్పాటు చేశారు. మెటీరియల్‌ తరలింపులో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకండా పట్టణాల్లో ప్రత్యేక ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. పరీక్షా కేంద్రాల పరిధిలో వంద మీటర్ల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్‌ సెంటర్లు ముందస్తుగా మూసి వేశారు. ఏర్పాట్ల విషయంలో ప్రతి చోటా యూపీఎస్‌సీ ప్రమాణాలను పాటించినట్టు అభ్యర్థులు చెబుతున్నారు. 

పొరపాట్లకు తావేలేదు
ప్రశ్నాపత్రాలు లీకు చేస్తారని ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే వారు కొందరు సోషల్‌ మీడియాలో పనిగట్టుకొని ప్రచారం చేశారు. ఆరు రోజుల పాటు 5,314 పరీక్షా కేంద్రాల్లో.. తొలిరోజు మూరుమూల మండల కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినా ప్రశ్నాపత్రాల భద్రత విషయంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మూరు మూల ప్రాంతంలో ఉండే పరీక్షా కేంద్రానికి చేరాల్సిన ప్రశ్నాపత్రాలను ఒక్క రోజు ముందు దానికి దగ్గరలోని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి వాటిని పర్యవేక్షించారు. ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న జాగత్రలతో ఆరు రోజుల పాటు ఎక్కడా చిన్న పొరపాటు చోటు చేసుకోలేదు. ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఉన్న ఏపీపీఎస్‌సీ ద్వారా జరిగే పరీక్షలో ప్రశ్నాపత్రాల్లో పెద్ద ఎత్తున తప్పులు దొర్లడం అనేది పోటీ పరీక్ష రాసే అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏపీపీఎస్‌సీ ద్వారా కాకుండా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించినప్పటికీ, ప్రశ్నాపత్రాల రూపకల్పన సైతం అభ్యర్థులను మెప్పించింది. ప్రశ్నపత్రాలలో నామమాత్రపు పొరపాట్లు కూడా జరగలేదని అభ్యర్థులు చెబుతున్నారు. పరీక్ష జరిగిన రోజు ప్రాథమిక ‘కీ’ని అధికారికంగా విడుదల చేశారు. నాలుగు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తుది ‘కీ’ విడుదల చేశారు. ఇంత పకడ్బందీ ప్రణాళిక ఇటీవల కాలంలో ఏ పోటీ పరీక్షలలోనూ చూడలేదని అభ్యర్థులు వ్యాఖ్యానించారు. 

ఇంటర్వ్యూ రద్దుతో దళారులకూ చెక్‌
పకడ్బందీ పరీక్ష నిర్వహణే కాదు.. పారదర్శకంగా ఈ ప్రక్రియ ఉండాలని అధికారులు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో దళారుల వ్యవస్థకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ఇంటర్వ్యూ అన్నది లేకుండా ఉండాలని, కేవలం రాత పరీక్షల్లో అభ్యర్థులకు వచ్చే మార్కుల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. పారదర్శకతగా పరీక్షలు నిర్వహిస్తూనే.. పోటీ పడుతున్న అభ్యర్థులు దళారులను నమ్మవద్దని ప్రభుత్వం విస్త్ర్‌తతంగా ప్రచారం చేసింది. ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల మేరకు కొన్ని జిల్లాల్లో దళారులపై కేసులు నమోదు చేయడం గమనార్హం. 

అధికారుల పాత్ర కీలకం..
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రత్యేక వ్యవస్థ ఉన్న ఏపీపీఎస్‌సీనే ఒకే విడతలో 1,26,728 ఉద్యోగాలను నిర్ణీత సమయంలో ఎప్పుడూ భర్తీ చేయలేదు. ఈ పరిస్థితుల్లో జిల్లా సెలక్షన్‌ కమిటీల ద్వారా ఉద్యోగ భర్తీ ప్రక్రియను చేపట్టారు. ఈ పోస్టుల భర్తీని చాలా పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గట్టి పట్టుదలతో ఎప్పటికప్పుడు మంత్రులకు, సంబంధిత అధికారులకు సూచనలతో పాటు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎంవో కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్, పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్, మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్‌ కమిషనర్‌ విజయకుమార్‌లు ఒక జట్టుగా ఏర్పడి సంబంధిత అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ఈ నియామక ప్రక్రియలో కీలకమై పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించారు. పరీక్షల రాష్ట్ర కమిటీ కన్వీనర్‌గా గిరిజా శంకర్‌ ప్రతి అంశం దగ్గర ఉండి పర్యవేక్షించారు. దీంతో పాటు జిల్లా కలెక్టరు, ఎస్పీలు, జిల్లా అధికార యంత్రాంగం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్‌ శాఖ సిబ్బంది పరీక్షల నిర్వహణలో చిత్తశుద్ధితో పని చేశారు.  

చరిత్రాత్మకం
మొత్తం 19 రకాల ఉద్యోగాలకు 21.69 లక్షల మంది పరీక్షలు రాశారు. తప్పన్నదానికి తావులేకుండా పరీక్షలు నిర్వహించాం. ఇదొ చరిత్రాత్మక ఘటన. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయి నియామకాలు, ఇన్ని లక్షల మందికి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం జరగలేదు. పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించిన పంచాయతీరాజ్‌ కమిషనర్, రాష్ట్ర స్థాయి సిబ్బంది, జిల్లా కలెక్టర్లు, సిబ్బందికి అభినందనలు.
– గోపాలకృష్ణ ద్వివేది, పరీక్ష నిర్వహణ కమిటీ చైర్మన్, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి.

అందరికీ అభినందనలు
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఉద్యోగ నియామకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ మేరకు ఆయన అధికారులందరినీ అప్రమత్తం చేశారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా అందరం పనిచేశాం. ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల మేరకు జిల్లాల్లో పరీక్షల నిర్వహణను విజయవంతం చేసిన జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర, జిల్లా స్థాయి సిబ్బందికి అభినందనలు.    
– గిరిజా శంకర్, పంచాయతీరాజ్‌ కమిషనర్, రాష్ట్ర స్థాయి పరీక్షల కమిటీ కన్వీనర్‌

సీఎం అరుదైన అవకాశం ఇచ్చారు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికార యంత్రాంగానికి అరుదైన అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని  పారదర్శకంగా, ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించి ప్రభుత్వం çపట్ల తమ చిత్తశుద్ధిని ప్రదర్శించింది. జిల్లా కలెక్టర్లు, అధికారులు పరీక్షల నిర్వహణకు రేయింబవళ్లు పనిచేశారు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. చిన్నపాటి విమర్శలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించేందుకు సహకరించిన అన్ని వర్గాల వారికి కృతజ్ఞతలు.
    – విజయకుమార్, మున్సిపల్‌ శాఖ కమిషనర్, డైరెక్టర్‌   

మరిన్ని వార్తలు