ధాన్యం కొనుగోలుకు వేళాయె..!

12 Dec, 2019 08:54 IST|Sakshi
కోతలు పూర్తిచేసిన తర్వాత రైతులు వేసిన వరికుప్పలు

జిల్లాలో 55 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

మేలు రకం మద్దతు ధర రూ.1,835

ముతక రకం ధాన్యం ధర రూ.1,815

పీపీసీకి తేవాల్సిన బాధ్యత రైతులదే

ఖరీఫ్‌ (సార్వా) పంట రైతుల చేతికొచ్చింది. అనుకూల వర్షాలతో జిల్లాలో ఈసారి ధాన్యం దిగుబడి ఆశాజనంగానే ఉంది. చాలాచోట్ల ఇప్పటికే వరికోతలు పూర్తయ్యాయి. మిగతాచోట్ల ముమ్మరంగా కోత పనులు సాగుతున్నాయి. ప్రభుత్వం కూడా ధాన్యం మద్దతుధరలనూ ప్రకటించింది. ఈ ప్రకారం కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. అధికారులు అందుకతగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో వరి సాగుకు అనుకూలమైన భూమి విస్తీర్ణం 1,07,428 హెక్టార్లు. దీనిలో సాధారణంగా సాగు అయ్యే విస్తీర్ణం 1,02,312 హెక్టార్లు. ఈ ఏడాది ఖరీఫ్‌లో దాదాపు 97,251 హెక్టార్లలో వరి సాగు అయ్యింది. వర్షాలు అనుకూలించడంతో దిగుబడి పెరిగిందని రైతులు ఆనందంలో ఉన్నారు. దాదాపు 3,68,752 మెట్రిక్‌ టన్నుల వరకూ ఉంటుందని అంచనా. దీనిలో రైతులు సొంత వినియోగానికి 1,08,657 మెట్రిక్‌ టన్నుల వరకూ మినహాయించుకున్నా, మిగతా 2,60,095 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌లోకి రావాల్సి ఉంది. జిల్లాలో 34 రైస్‌మిల్లులు ఉన్నాయి.

ఈ దృష్ట్యా జిల్లావ్యాప్తంగా 55 ధాన్యం కొనుగోలు కేంద్రాల (పీపీసీ)ను పౌర సరఫరాల సంస్థ ఏర్పాటు చేసింది. వీటిలో ఐదు వెలుగు (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. చోడవరం వ్యవసాయ మార్కె ట్‌ యార్డు, యలమంచిలి మండల సమాఖ్య (లైన్‌ కొత్తూరు), నాతవరం మండల సమాఖ్య, నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్‌ యార్డు, పద్మనాభం మండల సమాఖ్య ఆవరణల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిగతా 50 పీపీసీలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్‌)ల్లో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు వీటిని తెరుస్తారు. ఇవన్నీ మార్చి నెల వరకూ పనిచేస్తాయి.

దళారీలకు అడ్డుకట్ట...
రైతుల వద్ద తక్కువ ధరకు ముందుగానే ధాన్యాన్ని కొనేసి లబ్ధి పొందుతున్న దళారీలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులు తాము సాగు చేసిన పంటను ధాన్యం రకాలతో సహా ఈ–క్రాప్‌లో విధిగా నమోదు చేయించుకోవాలి. ఇందుకోసం సంబంధిత మండల వ్యవసాయాధికారిని లేదా వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించాలి. గ్రామ సచివాలయంలోని గ్రామ వ్యవసాయ సహాకుల సలహా, సహకారాలు తీసుకోవచ్చు. కౌలురైతులు రుణ అర్హతపత్రం లేదా సాగు ధ్రువీకరణ పత్రం సంబంధిత కార్యాలయం నుంచి పొందాలి. ధాన్యం కొనుగోలు సమయంలో వెబ్‌ల్యాండ్‌/ఈ–క్రాప్‌లో నమోదైన వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. దళారీలకు అడ్డుకట్ట వేసి నిజమైన రైతులకు న్యాయం చేయడానికి ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే నాలుగైదేళ్లుగా తమ మండల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరు నమోదుచేసుకోని రైతులు ఎవ్వరైనా ఉంటే తక్షణమే ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఇందుకోసం ఆధార్‌కార్డు, పాసుపోర్టు సైజ్‌ ఫొటోతో పాటు బ్యాంకు ఖాతా, పట్టాదారు పాసుపుస్తకం కాపీలను తీసుకెళ్లాలి. అంతకన్నా ముందు అసలు బ్యాంకు ఖాతా మనుగడలో ఉన్నదీ లేనిదీ సరిచూసుకోవాలి. పనిచేయని ఖాతా నంబరు ఇస్తే ధాన్యం ధర చెల్లింపు విషయంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే రైతులు తాము ఏ రోజు పీపీసీకి తీసుకొచ్చేదీ ముందుగానే అక్కడి సిబ్బందికి తెలియజేయాలి. అందుకోసం టోకెన్‌ తీసుకోవాలి.

నాణ్యత ప్రమాణాల ప్రకారమే ధర...
ధాన్యానికి కనీస మద్ధతు ధరలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకారం సాధారణ రకం క్వింటాల్‌కు రూ.1,815 చొప్పున, ఏ గ్రేడు రకం ధాన్యానికి రూ.1,835 చొప్పున ధర రైతులకు చెల్లించాల్సి ఉంది. అలాగే ఈ ధాన్యం సేకరణలో పాటించాలి్సన నాణ్యత ప్రమాణాల వివరాలను కొనుగోలు కేంద్రాల వద్ద ప్రదర్శిస్తున్నారు. ధాన్యంలో మట్టిరాళ్లు, ఇసుక తదితర వ్యర్థాలు, గడ్డి, చెత్తతాలు, పొట్టు 1 శాతం వరకూ ఉండవచ్చు. చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగు తొలచిన ధాన్యపు గింజలు 4 శాతానికి మించకూడదు. పరిపక్వంకాని, ముడుచుకుపోయిన, వంకర తిరిగిన గింజలు 3 శాతం వరకూ ఉండవచ్చు. ఏ గ్రేడు ధాన్యంలో కేళీలు 6 శాతం మించి ఉండకూడదు. ఏ గ్రేడు, సాధారణ రకాలైన సరే తేమ 17 శాతం వరకే ఉండాలి. 

సమీప కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలి.. 
రైతులు తాము పండించిన ధాన్యాన్ని సమీప కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి లబ్ధి పొందాలి. తక్కువ ధరలకు దళారీల చేతుల్లో పెట్టకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందండి. నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని సొంత ఖర్చుతోనే కేంద్రానికి తీసుకెళ్లాలి. ధాన్యం కొనుగోళ్లకు అన్ని పీపీసీల్లోనూ ఏర్పాట్లు చేశాం. ఇక్కడ నాణ్యత పరిశీలనలో ఆమోదం పొందిన ధాన్యాన్ని గోనెసంచుల్లో నింపడం, కాటా వేయడం, బస్తాలు కుట్టడం, మార్కింగ్‌ వేసి లారీలకు లోడు చేయడం తదితర పనులకు అయ్యే ఖర్చు అంతా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ భరిస్తుంది. 
– వి.వినయ్‌చంద్, జిల్లా కలెక్టరు

ధాన్యం రకాలన్నీ కలిపేయవద్దు.. 
నూర్పుడి సమయంలోనే ధాన్యం కలిపేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఏ రకానికి ఆ రకమే ప్రత్యేకంగా నూర్పిడి చేయాలి. వాటిని ప్రత్యేక సంచుల్లో నింపాలి. తేమ శాతం 17 శాతం మించకుండా కళ్లాల్లో బాగా ఆరబెట్టిన తర్వాత రైతులు ఆ ధాన్యాన్ని పీపీసీకి తీసుకెళ్లాలి. అక్కడి సిబ్బందికి అప్పగించి వారి నుంచి తగు రసీదు పొందాలి. ధాన్యం విలువను నిర్ధారించిన తర్వాత ఎఫ్‌టీవోను తప్పకుండా అడిగి మరీ తీసుకోవాలి. 
– పి.వెంకటరమణ, జిల్లా మేనేజరు, జిల్లా పౌరసరఫరాల సంస్థ
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా