అంతర్ రాష్ట్ర ఏటీఎం దొంగ అరెస్ట్

4 Dec, 2015 17:57 IST|Sakshi

గుత్తి (కర్నూలు) : గత ఏడాది కాలంగా కర్నూల్,అనంతపురం జిల్లాల వాసులను భయభ్రాంతులకు గురిచేసిన అంతర్ రాష్ట్ర ఏటిఎం దొంగను గుత్తి పోలీసులు శుక్రవారం చాకచక్యంగా పట్టుకున్నారు.ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సీఐ మధుసూదన్‌గౌడ్ తన చాంబర్‌లో విలేఖరులకు వివరించారు. కర్నూల్ జిల్లా వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన సిద్ధేశ్ చదువును మధ్యలోనే మానుకున్నాడు.గత ఏడాది కాలంగా అల్లరి చిల్లరిగా తిరిగేవాడు.ఈ క్రమంలో ఏటీఎంలపై కన్నుపడింది.ఏటీఎంల వద్ద కాపు కాచేవాడు.ఎవరైనా చదువుకోనివారు డబ్బులు డ్రా చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే వారికి సహాయం చేసేవాడిగా నటిస్తూ ఏటీఎంలలో డబ్బు డ్రా చేసుకునేవాడు.

కస్టమర్ల ఏటీఎం కార్డు తీసుకుని డబ్బు డ్రా చేస్తానని నమ్మబలుకుతాడు. బ్యాలెన్స్ చూసి సీక్రెట్ నంబరు గుర్తు పెట్టుకుంటాడు. వెంటనే కస్టమర్ ఏటీఎంను జేబులో వేసుకుని డూప్లికేట్ ఏటీఎం కార్డును వారికి ఇచ్చేవాడు.వారు అక్కడి నుంచి వెళ్లాక ఏటీఎం సెంటర్‌కు వెళ్లి డబ్బు డ్రా చేసుకునేవాడు.ఈ క్రమంలో కర్నూల్ నగరంలో నాలుగు ఏటీఎంలలో,అదేవిధంగా గుత్తిలో రెండు, గుంతకల్‌లో ఒక ఏటీఎంలో అమాయకుల ఏటీఎం సీక్రెట్ నంబర్లు తెలుసుకుని డబ్బు డ్రా చేసుకుంటూ జల్సాలు చేశాడు. గత నెలలో గుత్తి ఎస్‌బిఐ ఏటీఎంలో ఎస్‌ఎస్‌పల్లికి చెందిన సుమంగళమ్మ, బసినేపల్లి తాండాకు చెందిన తిరుపాల్‌నాయక్, గుంతకల్‌కి చెందిన కుమార్ అనే కస్టమర్ల ఏటీఎం కార్డులు కాజేసి రూ.60 వేలు డ్రా చేసుకున్నాడు.

బాధితుల ఫిర్యాదు మేరకు ఏటీఎం దొంగ ఆచూకీ కోసం గత వారం రోజులుగా అన్ని ఏటీఎంల వద్ద నిఘా వేశామన్నారు.ఈ నేపథ్యంలో గుత్తి పట్టణంలోని జయలక్ష్మి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఎస్‌బిఐ ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న సిద్ధేశ్ అనే యువకుడిని పట్టుకుని విచారించామన్నారు.విచారణలో గత ఏడాది కాలంగా కర్నూల్,అనంతపురం జిల్లాల్లో ఏటీఎంల నుంచి అక్రమంగా డబ్బును కాజేస్తున్న దొంగ అతనేని తేలిందన్నారు.దీంతో అతన్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.24 వేలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితున్ని కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు చాంద్‌బాషా, రామాంజనేయులు, ఎఎస్‌ఐలు ప్రకాష్, ప్రభుదాస్,శివారెడ్డి,హెడ్‌కానిస్టేబుళ్లు నరసింహులు, శ్రీశైలం, పలువురు పీసీలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు