వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి

15 Feb, 2019 04:17 IST|Sakshi
టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణ.

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో టీడీపీ అరాచకం 

విచక్షణారహితంగా దాడి చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అనుచరులు!

ఎనిమిది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు ఒకరి పరిస్థితి విషమం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడి ఇలాకాలోనే ప్రజలకు రక్షణ కరువైంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రోజురోజుకు ప్రజాదరణ పెరగడాన్ని ఓర్వలేక దాడులకు తెగబడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై గురువారం ఉదయం వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. కార్యాలయంలోని పార్టీ ప్రచారపత్రాల్ని చించి కుర్చీలు విరగ్గొట్టారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి బోయిన నాగేశ్వరరావు, కార్యకర్తలు నేతింటి నాగేశ్, మెండ తాతయ్య, అన్నెపు రామారావు, తోట వెంకటరమణ, కాళ్ల ఆదినారాయణ, దుబ్బ వెంకటరావు, పిల్లల లక్ష్మణ్‌లు గాయపడ్డారు. వీరిని టెక్కలిలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. తోట వెంకటరమణ పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించారు. 

ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు 

అచ్చెన్నాయుడి హస్తం ఉందని ఫిర్యాదు
వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై దాడి వెనుక మంత్రి అచ్చెన్నాయుడి హస్తం ఉందని, కోటబొమ్మాళిలో బుధవారం ఆయన పర్యటన సమయంలో కుట్రకు బీజం పడిందని వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌లు ఆరోపించారు. దాడిని నిరసిస్తూ వారిద్దరి నేతృత్వంలో కోటబొమ్మాళిలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు. పార్టీ కార్యాలయం నుంచి స్థానిక పోలీసుస్టేషన్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. అక్కడ బైఠాయించి మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి అచ్చెన్నతో పాటు మండల టీడీపీ అధ్యక్షుడు బోయిన రమేష్, మరో 30 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేయాలని డిమాండు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాల్ని రప్పించారు. ఫిర్యాదు పత్రంలోని వారందరిపై ఐపీసీ 307, అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళన విరమించాయి. అయితే మంత్రి మినహా మిగతావారిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. 

జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు, రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ఏజెంట్లు లేకుండా బూత్‌లు ఆక్రమించడానికి ఇప్పటినుంచే టీడీపీ నేతలు దాడులకు పథక రచన చేశారని వైఎస్సార్‌సీపీ నాయకులు జిల్లా ఎస్పీ ఎ.వెంకటరత్నంకు ఫిర్యాదు చేశారు. కోటబొమ్మాళి తరహా దాడులు పునరావృతమైతే తాము కూడా ఆత్మరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎస్పీని కలిసినవారిలో వైఎస్సార్‌సీపీ నాయకులు తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్‌ తదితరులు ఉన్నారు. కోటబొమ్మాళిలో ఘటనను పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు ఖండించారు. ఓటమి భయంతోనే వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులను మంత్రి అచ్చెన్నాయుడు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. టీడీపీ అరాచకానికి నిరసనగా శుక్రవారం కోటబొమ్మాళిలో బంద్‌కు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది.

మరిన్ని వార్తలు