టీడీపీలో పదవుల కుంపటి

18 May, 2015 02:59 IST|Sakshi

తెల్లవార్లూ ఎడతెగని చర్చలు
ఆమోదం కోసం ఆన్‌లైన్లో జాబితాను పంపిన నేతలు
బుధవారం కమిటీని ప్రకటించే అవకాశం

 
 ముందు వచ్చిన చెవులకంటే వెనుక వచ్చిన కొమ్ముల వాడి అనే చందంగా తయారైంది జిల్లా టీడీపీలో పదవుల పందేరం పరిస్థితి. పదేళ్ల తరువాత పార్టీ అధికారంలోకి రావడంతో నాయకులు, కార్యకర్తలు పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీరా పదవులన్నీ  కొత్తగా వచ్చిన తమ్ముళ్లకు దక్కడంతో సీనియర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పార్టీలో కీలక నేతల మధ్ సమన్వయం కొరవడడంతో ఏర్పడిన ఈ పరిస్థితులు ఏ పరిణామాలకు దారితీస్తాయోనని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 నెల్లూరు (రవాణా) : టీడీపీ అధికారంలో ఉన్నా జిల్లాలో ఆ పార్టీ నేతలు మూడు వర్గాలు ఆరు గ్రూపులగా విడిపోయారు. దీంతో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పార్టీలో చిచ్చు రేపుతోంది. పదవుల పందారంపై శనివారం ఉదయం మొదలైన చర్చలు ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా సాగాయి. చివరకు కొన్ని పేర్లు ప్రతిపాదించి, ఆమోదం కోసం ఆన్‌లైన్లో అధిష్టానానికి పంపినట్లు తెలిసింది.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం పార్టీ అనుబంధసంఘాలు పదవులకు కొంతమందిని ప్రకటించారు. తెలుగుయువత జిల్లా అధ్యక్షుడిగా శింగంశెట్టి రవిచంద్ర, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలిగా పొత్తూరు శైలజ, ఎస్సీసెల్ అధ్యక్షుడిగా సునీల్, ఎస్టీసెల్ అధ్యక్షుడిగా రంగారావు, మైనార్టీసెల్ అధ్యక్షుడిగా రఫీ, టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా తిరుమలనాయుడును ఎంపిక చేశారు. ఉపాధ్యాయ సంఘం విభేదాలు తీవ్రస్థాయిలో ఉండటం, పార్టీ ఆన్‌లైన్లో ప్రకటించకపోవడంతో ప్రస్తుతానికి ప్రకటించలేదు.

 సీనియర్లకు మొండిచేయి
 జిల్లా కమిటీలో సీనియర్లకు మొండిచేయి చూపారు. పార్టీ కష్టకాలంలో పదేళ్లు పనిచేసిన వారిని వదిలి కొత్తవారిని ఎంపికచేయడంపై సీనియర్లు మండిపడుతున్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జిలు పట్టుబట్టి మరీ కొత్తవారికి పదవులు ఇప్పించారనే ప్రచారం సాగుతోంది. కొంతమందికి పదవుల రాక అసంతృప్తితో ఉంటే మరికొంతమంది పదవులు చేతిదాకా వచ్చి పోవడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తెలుగుయువత అధ్యక్షుడిగా శింగంశెట్టి రవిచంద్ర ఎంపికపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు.

ఎన్నోఏళ్లుగా పార్టీకోసం పనిచేసిన సంపత్‌రాజు, బాలకృష్ణచౌదరి, జలదంకి సుధాకర్‌ను కాదని శింగంశెట్టిని ఎంపికచేయడంపై ఆగ్రహంతో ఉన్నారు. శింగంశెట్టికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్టుబట్టి పదవి ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. తెలుగుమహిళ అధ్యక్ష పదవిని ఇటీవల పార్టీలోకి వచ్చిన శైలజకు ఇవ్వడంపై మహిళలు రగిలోపోతున్నారు. ప్రస్తుతం తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఉన్న అంచెలవాణి ఆశించినా మంత్రి నారాయణ వద్దని చెప్పడంతో మిన్నకుండిపోయారు.

ఎస్సీసెల్ అధ్యక్షుడిగా ఎన్నికైన సునీల్‌కు ప్రస్తుతం పార్టీలో సభ్యత్వం కూడాలేదు. ఈయన ఆదాల అనుచరుడిగా ఉన్నారు. ఈయన ఎంపికపై సీనియర్లు మండిపడుతున్నారు. ఎస్టీసెల్ అధ్యక్షుడిగా ఇందుకూరుపేట ప్రాంతానికి చెందిన రంగారావును ఎంపిక చేశారు. ఈయన ఎంపికపై కూడా సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడిగా ఉదయగిరి ప్రాంతానికి చెందిన షేక్ రియాజ్‌ను ఎంపిక చేశారు. నగర మేయర్ అజీజ్ రియాజ్‌ను ఆయన ఎంపికను వ్యతిరేరించారు.

నగరానికి చెందిన వ్యక్తికి పదవి ఇస్తే అధిక సంఖ్యలో మైనార్టీల మద్దతు ఉంటుందని చెప్పారు. అయితే అజీజ్‌ను విభేదించి ఉదయగిరి ప్రాంతానికి చెందిన రియాజ్‌కు పదవి ఇచ్చారు. ఈ విషయంలో మేయర్‌అజీజ్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అదే విధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి చేతిదాకా వచ్చి పోవడంపై పట్టాభిరామిరెడ్డి మండిపడుతున్నారు. ఈయనకు పదవి ఇవ్వడంపై కోవూరు నియోజకవర్గ నాయకులు వ్యతిరేకించడంతో మంత్రి నారాయణ కూడా మద్దతు తెలిపారు.

 బయటపడనున్న విభేదాలు
 ఆయా కమిటీల ఎంపికలో మంత్రి నారాయణ, సీనియర్‌నేత సోమిరెడ్డి అనుచరులకు పదవులు ఇవ్వకపోవడంపై పలువురు రగిలిపోతున్నారు. బుధవారం జిల్లా కమిటీతోపాటు అనుబంధ సంఘాల కమిటీలను ప్రకటిం చనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ జిల్లా నాయకుల్లో విభేదాలు బట్టబయలు కానున్నాయి.

>
మరిన్ని వార్తలు