బాడుగకు పిలిచి దౌర్జన్యమా..?

25 Mar, 2019 13:57 IST|Sakshi
ఆటోలను బలవంతంగా పంపిస్తున్న పోలీసులు

చంద్రబాబు కార్యక్రమానికి 250 ఆటోలను

సమీకరించిన టీడీపీ నాయకులు

కార్యక్రమం రద్దు కావడంతో ఆటో బాడుగలకు కోత

ఇదేంటని ప్రశ్నించిన ఆటోడ్రైవర్లపై దౌర్జన్యం

నిరసనకు సిద్ధమైన ఆటోడ్రైవర్లు

పోలీసుల జోక్యంతో సద్దుమణగిన వివాదం

చిత్తూరు, చంద్రగిరి: టీడీపీ నాయకులు ప్రచారానికి మనుషులను తోలేందుకు ఆటోలను బాడుగకు పిలిచి.. కార్యక్రమం రద్దయిందనే నెపంతో బాడుగలో కోత విధించారు. ఇస్తామన్న డబ్బులు ఇవ్వండని అడిగినందుకు ఆటోడ్రైవర్లపైనే దౌర్జన్యం చేశారు. ఈ ఘటన ఆదివారం చంద్రగిరిలో చోటుచేసుకుంది. వివరాలిలా.. చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు చంద్రగిరికి రానున్నారని టీడీపీ నాయకులకు సమాచారం అందింది. దీంతో టీడీపీ నాయకులు కార్యకర్తలను తరలించేందుకు చంద్రగిరి, ఐతేపల్లి, శ్రీనివాసమంగాపురం, ఏ.రంగంపేట, చెర్లోపల్లికి చెందిన సుమారు 250 ఆటోలను, ఒక్కో ఆటో రూ.1000 బాడుగకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

దీంతో ఉదయం నుంచి ఆటోలను పార్టీ కార్యాలయం వద్ద పెట్టించుకున్నారు. తీరా మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు కార్యక్రమం రద్దయినట్లు సమాచారం అందింది. దీంతో ఆటోకు రూ.100లే చెల్లిస్తామంటూ నాయకులు డ్రైవర్లకు తెలిపారు. అదేంటి రూ.1000లు ఇస్తామని చెప్పి, ఉదయం నుంచి ఆటోలను ఇక్కడే పెట్టుకున్నారు కదా.. ఇప్పుడు రూ.100లు ఇస్తామంటే ఎలా అని ఆటోడ్రైవర్లు ప్రశ్నించారు. ఆగ్రహించిన టీడీపీ నాయకులు ఆటో డ్రైవర్లపై దౌర్జన్యానికి యత్నించారు. కొంతమంది డ్రైవర్లపై దాడి చేశారు. దీంతో ఆగ్రహించిన డ్రైవర్లు రహదారిపై ధర్నాకు యత్నించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటోలను పార్టీ కార్యాలయం వద్ద ఉంచుకుని, ఇప్పుడు తమకు బాడుగ ఇవ్వకపోవడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఖాళీ చేయాలని పోలీసులు వారికి చెప్పారు.

ఉదయం నుంచి కనిపించలేదా..
చంద్రబాబు కార్యక్రమం కోసం ఉదయం నుంచే టీడీపీ నాయకులు వారి పార్టీ కార్యాలయం వద్ద వందల కొద్దీ ఆటోలను నిలుపుకుంటే పోలీసులు ప్రశ్నించలేదని, మా బాడుగల కోసం నిరసనకు దిగితే పోలీసులు తరిమేస్తారా అని ఆటోడ్రైవర్లు వాపోయారు. ఉదయం నుంచి ఉన్న ఆటోలు పోలీసులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. గతంలో తిరుపతికి వెళ్తున్న ప్యాసింజరు ఆటోలు తిరుపతికి వెళ్లనీయకుండా టీడీపీ నాయకుడు నాని తమ కడుపుకొట్టాడని, ఇప్పుడు బాడుగకు పిలిచి, డబ్బులు ఇవ్వకుండా దాడులు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అనంతరం పోలీసులు వారికి సర్దిచెప్పి, అక్కడి నుంచి వాహనాలను పంపించేశారు.

మరిన్ని వార్తలు