అక్రమాల అడ్డాగా ఆటోనగర్‌

13 Jun, 2019 11:27 IST|Sakshi
టీడీపీ అరాచకాలను వెల్లడిస్తున్న ఆటోనగర్‌ మెకానిక్‌ సంఘ ప్రతినిధులు

అధికారం అండతో  దోచుకున్న టీడీపీ నేతలు

సాక్షి, పిడుగురాళ్ల(గుంటూరు) : అధికారం చేతిలో ఉందని రెచ్చిపోయారు. అందినకాడికి దండుకునేందుకు ఆటోనగర్‌ను అడ్డాగా మార్చేశారు. యూనియన్లపైనా పెత్తనం చెలాయించారు. ఆటోనగర్‌లో ప్లాట్లు ఇస్తామంటూ మెకానిక్‌ల వద్ద నుంచి అక్షరాలా అరకోటి వసూలు చేశారు. తీరా చూస్తే టీడీపీ జెండా పట్టుకున్న వారికే ప్లాట్లంటూ మెలిపెట్టారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేశారు. ఐదేళ్లు గడిచినా ఒక్క ప్లాటూ కేటాయించకుండానే కాలయాపన చేశారు. ఆశతో చెల్లించిన సొమ్ము ఆవిరి చేసేశారంటూ మెకానిక్‌లు లబోదిబోమంటున్నారు.

పిడుగురాళ్ల పట్టణంలోని కొండమోడు సమీపంలో సుమారు 11.83 ఎకరాల్లో ఆటోనగర్‌ ఏర్పాటు చేసేందుకు 2007లో మోటారు ఫీల్డ్‌ ఆటోనగర్‌ వర్కర్స్‌ సంక్షేమ సంఘాన్ని రిజిస్ట్రేషన్‌ చేసి స్థాపించారు. టీడీపీ నేతలు రంగంలోకి దిగి ఆటోనగర్‌పై పెత్తనం చెలాయించారు. అప్పుడు అధ్యక్షుడిగా వ్యవహరించిన టీడీపీకి చెందిన వ్యక్తితో పాటు కొందరు సభ్యులు ఆటోనగర్‌ను అభివృద్ధి చేస్తామంటూ నమ్మబలికారు. సంఘంలో ఉన్న మెకానిక్‌ల వద్ద సుమారు రూ.20 లక్షలు వసూలు చేశారు. ఎంతకీ ఆటోనగర్‌ అభివృద్ధికి చర్యలు తీసుకోకపోవడంతో ప్రశ్నించిన వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన వైఎస్సార్‌ సీపీ కి చెందిన కరిముల్లాను తొలగించేందుకు అతని పేరుతో ఫోర్జరీ సంతకం పెట్టి యూనియన్‌ రద్దు చేసేశారు. పాత యూనియన్‌ను రద్దు చేసి తిరిగి నూతన అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు.

మరో రూ.50 లక్షలు వసూలు చేసినటీడీపీ నేతలు
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ బడా నాయకుల కన్ను ఆటోనగర్‌పై పడింది. పార్టీకి చెందిన కొందరు మెకానిక్‌లను రంగంలోకి దించి ఆటోనగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎవరు ప్రశ్నిస్తే వారిపై దాడులు చేశారు. టీడీపీ నాయకులు పిడుగురాళ్ల మోటారు ఫీల్డ్‌ వర్కర్స్‌ సంక్షేమ సంఘం అనే పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించారు. మెకానిక్‌లకు ప్లాట్లను కేటాయిస్తామంటూ ప్రచారం చేశారు. ఆటోనగర్‌లో మొత్తం 185 ప్లాట్లు మాత్రమే ఉండగా.. టీడీపీ నేతలు ఏకంగా 250 మంది నుంచి విడతల వారీగా డబ్బులు వసూలు చేసేశారు. మొదటగా రూ.150, రూ.500, రూ.2500, రూ.6 వేలు, రూ.11 వేలు.. ఇలా ఒక్కొక్కరి నుంచి మొత్తం రూ.20,150 చొప్పున మొత్తం రూ.50,37,500 వసూలు చేశారు.

మెకానిక్‌ల పేరుతో ప్లాట్లు స్వాహా
ఇంత మొత్తంలో వసూలు చేసినా.. టీడీపీ నేతలకు మాత్రం ఆటోనగర్‌ స్థలంపై కన్ను పడింది. పార్టీకి చెందిన కొంతమంది నాయకులు మెకానిక్‌లుగా మారిపోయారు. వారి పేరు మీద రెండు మూడు ప్లాట్లు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఇలా దాదాపు 15 నుంచి 20 ప్లాట్లు కొట్టేసేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. వాస్తవానికి సాధారణంగా లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్లను కేటాయిస్తారు. కానీ టీడీపీ నేతలు మాత్రం రహదారి పక్కనే ఉన్న వాటిని తమ ఖాతాలో వేసేసుకున్నారు. చాకలికుంట ప్రాంతాన్ని ఏకంగా వాటర్‌ ట్యాంక్‌ ఏరియాగా మార్చి తప్పుడు లేఅవుట్లను సిద్ధం చేసిన సదరు పచ్చనేతలు తమని మోసం చేసి డబ్బులు దండుకున్నారని మెకానిక్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  టీడీపీ జెండాలు కడితేనే ఆటోనగర్‌లో ప్లాట్లు ఇస్తామంటూ వైఎస్సార్‌ సీపీ మెకానిక్‌లకు బెదిరింపులకు గురిచేశారు. కొంతమందిపై బహిరంగంగానే చేయిచేసుకున్నారు. కానీ.. ఇంతవరకూ అసలైన మెకానిక్‌కు మాత్రం ఒక్క ప్లాట్‌ కూడా కేటాయించలేదు.

ప్రక్షాళన దిశగా ఎమ్మెల్యే కాసు అడుగులు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఆటోనగర్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. టీడీపీ నేతలు చేసిన అక్రమాలని తవ్వి తీసి.. అర్హులైన ప్రతి మెకానిక్‌కు ఆటోనగర్‌లో స్థానం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆటోనగర్‌ నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లను వేగంగా నిర్వహిస్తున్నారు. మెకానిక్‌ల కలను నిజం చేసేందుకు ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఆటోనగర్‌ రూపురేఖలు త్వరలోనే మారనున్నాయని మెకానిక్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అడ్డంగా దోచుకున్నారు
టీడీపీ హయాంలో ఆటోనగర్‌ మెకానిక్‌లను టీడీపీ నాయకులు అడ్డంగా దోచుకున్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే అర్హులందరికీ స్థానం కల్పిస్తానని చెప్పిన ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి మా కలను నిజం చేయబోతున్నారు. అందుకే ఇప్పుడు నూతనంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆటోనగర్‌ వర్కర్స్‌ సంక్షేమ సంఘం పిడుగురాళ్ల పేరు మీద ఆటోనగర్‌ను రిజిస్ట్రేషన్‌ చేయించాము. త్వరలోనే మా కల నెరవేరబోతుంది. 
– షేక్‌ కరిముల్లా మేస్త్రి, పిడుగురాళ్ల

ప్లాట్ల పేరుతో మోసం చేశారు
పట్టణంలో లారీలకు పని చేయాలంటే స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఆటోనగర్‌ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాం. టీడీపీ హయాంలో వేలకు వేలు వసూలు చేసి మమ్మల్ని మోసం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మాకు ఆటోనగర్‌ రాబోతున్నందుకు సంతోషిస్తున్నాం. 
– షేక్‌ షరీఫ్, లారీ కమాన్‌కట్ట మేస్త్రి, పిడుగురాళ్ల

అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నాం
ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఆటోనగర్‌ నిర్మాణం చేపట్టాం. ప్రస్తుతం రోడ్ల నిర్మాణ పనులు, డ్రైనేజీ పనులు నిర్వహిస్తున్నాం. త్వరలోనే అర్హులైన మెకానిక్‌ల జాబితాను సిద్ధం చేసి వారికి ప్లాట్లను కేటాయిస్తాం. నూతన ప్రభుత్వంలో ఆటోనగర్‌ నిర్మాణం జరుగుతుంది.
- పీవీ రావు, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్, గుంటూరు

>
మరిన్ని వార్తలు