ఎమ్మెల్యే అయితే..?

17 Dec, 2018 13:38 IST|Sakshi
కేశవరాజుకుంటలో బాధితులతో మాట్లాడుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి

ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలకు ఇష్టమొచ్చినట్టు భూములు పంచుతారా..

భూముల పట్టాలే దొంగవైనప్పుడు పోలీసులు కాపలా కాయడమేంటి

అక్రమార్కులను అడ్డుకున్న వారిపై పోలీస్‌ కేసులు పెట్టి వేధిస్తారా..

కేశవరాజుకుంటలో వివాదాస్పద ఎన్‌ఎస్‌పీ భూములను పరిశీలించిన బాలినేని

అధైర్యపడవద్దు.. అండగా ఉంటానని పేదలకు భరోసా

ఒంగోలు: ‘‘ఎమ్మెల్యే అయితే పేదలకు కాకుండా ఆయన అనుచరులకు, కార్యకర్తలకు భూములు పంచుతారా? ఆ విధంగా పట్టాలు ఇచ్చే అధికారం ఎమ్మెల్యేకు ఎవరిచ్చారు? అలా ఇవ్వవచ్చని చట్టంలో ఎక్కడైనా ఉందా?’’ అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. ఒంగోలు కేశవరాజుకుంటలో గత పది రోజులుగా వివాదాస్పంగా ఉన్న ఎన్‌ఎస్‌పీ భూములను ఆదివారం ఉదయం బాలినేని పరిశీలించారు. ఈ సందర్భంగా కేవవరాజుకుంట, చినమల్లేశ్వర కాలనీ వాసులు పెద్ద ఎత్తున వచ్చి బాలినేని వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. వాసన్నా...అన్యాయంగా వ్యవహరిస్తున్నారంటూ వాపోయారు.

అక్రమాలను అడ్డుకుంటున్న తమ కాలనీ వాసులపై తప్పుడు కేసులు పెడుతున్నారని, పోలీసుల సమక్షంలోనే నిర్మాణాలు జరుగుతున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను భూముల వద్దకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నన్న పోలీసులు.. ఎమ్మెల్యే అనుచరులకు మాత్రం దగ్గరుండిసహకరిస్తున్నారని ఆరోపించారు. తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు మహిళలతో వ్యవహరిస్తున్న తీరు, ఆయన వాడుతున్న పదజాలం తీవ్ర అభ్యంతరకరంగా ఉందంటూ పలువురు మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. అసభ్య పదజాలంతో మాట్లాడటాన్ని తట్టుకోలేక తాము పోలీస్‌ జీపును ఆపితే కేసులు నమోదు చేసి వేధింపులకు దిగారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ తీరుపై ఇప్పటికే ఒంగోలు డీఎస్పీ, ఎస్పీ, ఐజీతోపాటు జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశామని మాల మహానాడు అధ్యక్షుడు బిళ్లా వసంతరావు బాలినేని దృష్టికి తెచ్చారు. దీంతో కేసుల విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడతానని, భయపడాల్సిన అవసరం లేదంటూ బాలినేని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

కబ్జాలు చేయడం టీడీపీ నేతలకు ఆనవాయితీగా మారింది
పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే దౌర్జన్యంగా వ్యవహరిస్తుండడం దారుణమని బాలినేని విమర్శించారు. ప్రభుత్వ స్థలాలను కబ్జాచేయడం అధికార పార్టీ నాయకులకు ఆనవాయితీగా మారిందని, దీనిని అడ్డుకుంటామన్నారు. ఎన్‌ఎస్‌పీ స్థలంలో తహసీల్దార్‌ పట్టాలు ఎలా కేటాయిస్తారని, అలా ఇచ్చేందుకు ఆయనకు హక్కు ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. కొన్ని పట్టాలపై సంతకాలు లేవని, మరికొన్నిటిపై సంతకాలు చేశారని.. అవి అధికారులు పెట్టినవేనని అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆయన అనుచరులు, కార్యకర్తలకు పట్టాలు ఇవ్వచ్చని చట్టంలో ఎక్కడైనా ఉందా అని నిలదీశారు. ఎన్‌ఎస్‌పీ నుంచి భూమి కన్వర్షన్‌ కాకుండా పట్టాలు ఇచ్చేందుకు అవకాశమే లేదని, ఆ స్థలం ఆక్రమణకు గురికాకుండా అడ్డుకుంటామన్నారు. దొంగ పట్టాలు సృష్టించిన వారికి పోలీసులు కాపలా కాయడం సరికాదని హితవు పలికారు. బాధితులపై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని, భూముల పట్టాలపై సంతకాలు ఎవరు చేశారో విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాలినేని వెంట వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కఠారి శంకర్, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ జలీల్, రాష్ట్ర అదనపు కార్యదర్శి వేమూరి సూర్యనారాయణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూళిపూడి ప్రసాద్‌నాయుడు, ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షులు పంది రత్నరాజు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు