రబీకి సై..

1 Dec, 2019 11:09 IST|Sakshi

డెల్టాలో నేడు ఆరంభం

నేటి నుంచి కాలువలకు నీటి విడుదల పెంపు

షెడ్యూలు ప్రకారం సాగు పూర్తి చేయాలంటున్న అధికారులు   

అమలాపురం: చిన్నచిన్న ఇబ్బందులు మినహా.. ఖరీఫ్‌ సాగు దాదాపు ఆశాజనకంగానే ముగియడంతో.. రైతులు ఇక రబీ సాగు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే అన్నపూర్ణగా పేరొందిన గోదావరి డెల్టాలో రబీ సాగు ఆదివారం ఆరంభం కానుంది. ఈ ఏడాది సమృద్ధిగా సాగు నీరు ఉంటుందని అధికారులు ప్రకటించడంతో రైతులు సాగుపై ఆశలు పెంచుకున్నారు. ప్రస్తుతం గోదావరిలో సహజ జలాలు తగ్గడం అధికారులకు కాస్త ఆందోళన కలిగిస్తున్నా.. సీలేరు జలాలు కూడా తోడు కానుండడంతో రబీ సాగుకు ఢోకా ఉండదనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రబీ సాగుకు వీలుగా అధికారులు గోదావరి డెల్టా కాలువలకు ఆదివారం నుంచి నీటి విడుదల పెంచనున్నారు. తూర్పు డెల్టాకు ఎక్కువగా, మధ్య డెల్టాలో కోతలు పూర్తి కానందున వారం రోజుల పాటు తక్కువగా నీరందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తూర్పు డెల్టాలో ఇప్పటికే బోర్ల మీద కొంతమంది రైతులు రబీ నారుమడులు పోసుకున్నారు.

ఇక్కడ వెదజల్లు సాగుకు అనుగుణంగా ఎక్కువ మంది రైతులు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ రెండు డెల్టాలతో పాటు పిఠాపురం బ్రాంచ్‌ కెనాల్‌ (పీబీసీ) పరిధిలో మొత్తం 4,36,533 ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. మొత్తం సాగు కాలంలో కనీసం 90 టీఎంసీల నీరు అవసరమన్నది అధికారుల అంచనా. ఇందులో సీలేరు పవర్‌ జనరేషన్, బైపాస్‌ పద్ధతిలో 47 టీఎంసీలు, సహజ జలాలు 46 టీఎంసీలు వస్తాయని లెక్కలు కట్టారు. మొత్తం 93 టీఎంసీల నీరు వస్తున్నందున సాగుకు ఢోకా ఉండదని భావించారు. ఈ ఉద్దేశంతోనే రబీ మొత్తం ఆయకట్టుకు గత నెల 7న కాకినాడలో జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఖరీఫ్‌లో మంచి దిగుబడులు పొందిన రైతులు.. రబీలో కూడా అదే ఫలితాన్ని సాధిస్తే ఈ ఏడాది వ్యవసాయంలో లాభాలు చూసే అవకాశముంటుందన్న ఆశతో ఉన్నారు.

డెల్టాలో రబీసాగుకు సిద్ధమవుతున్న సమయంలో గోదావరిలో సహజ జలాల తగ్గుదల రైతులను, అధికారులను ఆలోచనలో పడవేస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం ఉదయం ఆరు గంటల సమయానికి ఇన్‌ఫ్లో 8,221 క్యూసెక్కులు మాత్రమే. ఇదే సమయంలో పట్టిసీమ 12 పంపుల ద్వారా కృష్ణా డెల్టాకు 4,250 క్యూసెక్కుల నీటిని తోడారు. అంటే మొత్తం ఇన్‌ఫ్లో 12,471 క్యూసెక్కులన్న మాట. ఇందులో సీలేరు పవర్‌ జనరేషన్‌ ద్వారా 3,384 క్యూసెక్కులు వస్తోంది. దీనిని మినహాయిస్తే 9,087 క్యూసెక్కులు మాత్రమే గోదావరి సహజ జలాలు రావడం గమనార్హం. వచ్చిన నీటిలో ప్రస్తుతం తూర్పు డెల్టాకు 400, మధ్య డెల్టాకు 800, పశ్చిమ డెల్టాకు 2,500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 4,573 క్యూసెక్కుల మిగులు జలాలు వదులుతున్నారు. గోదావరి సహజ జలాలు 10 వేల క్యూసెక్కుల కన్నా తక్కువగా ఉండడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాదితో పోల్చుకుంటే వీటి రాక రెట్టింపు ఉంది. గత ఏడాది డిసెంబర్‌ రెండు, మూడు తేదీల్లో సహజ జలాలు 4,167 క్యూసెక్కులు మాత్రమే కావడం గమనార్హం. ఇది డిసెంబర్‌ 8 నాటికి సున్నాకు పడిపోయింది. తరువాత కొంతమేర పెరిగినా ఆశించిన స్థాయిలో సహజ జలాలు రాలేదు. అప్పటితో పోల్చుకుంటే ఈ ఏడాది నీటి రాక ఆశాజనకంగా ఉండడం అధికారుల్లో ధీమాను పెంచుతోంది. అయితే రైతులు నిర్ణీత షెడ్యూలు ప్రకారం సాగు పూర్తి చేస్తే మంచిదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్‌ మొదటి వారానికి పూర్తి చేయాలని కోరుతున్నారు.

ముందస్తు సాగు చేయాలి..
సహజ జలాలు తగ్గుతున్నా సాగుకు పూర్తిగా నీరు ఇవ్వడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. కానీ రైతులు ముందుగా సాగు చేసుకోవడం అన్నివిధాలుగా మంచిది. మధ్య డెల్టాలో కోతలు ఆలస్యమయ్యే అవకాశమున్నందున మరో వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో నీటి విడుదల చేయలేం. ఇక్కడ ఖరీఫ్‌ ఆలస్యమైనా రబీకి రైతులు సన్నాహాలు చేసుకోవాలి. డిసెంబర్‌ నెలాఖరుకు నాట్లు పూర్తి చేసుకోవాలి.
– ఎన్‌.కృష్ణారావు, ఎస్‌ఈ, గోదావరి ఇరిగేషన్‌ సర్కిల్, ధవళేశ్వరం 

మరిన్ని వార్తలు