అసాంఘిక కార్యక్రమాల సూత్రధారి బాబే

21 Nov, 2018 07:10 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి

విజయనగరం,ప్రజా సంకల్పయాత్ర బృందం: రాష్ట్రంలో జరిగే ప్రతీ అసాంఘిక కార్యక్రమానికీ, అవినీతికీ, దోపిడీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. మంగళవారం విజయనగరం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం సీమనాయుడుపేటలో జరిగిన ప్రజా సంకల్పయాత్రలో పా ల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని భూముల్లో చెరకు తోటలు కాల్చివేసినప్పటి నుంచి తునిలో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను తగలపెట్టడంలో బాబు పాత్ర ఉందని ఆరోపించారు. కానీ ఆ ఘటనలన్నింటినీ వైఎస్సార్‌సీపీపై నెట్టేసి రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. వీటిపై విచా రణ చేపట్టిన పోలీసులు చెరకు తోటలను ఆహుతి చేసిన వారి వెనుక టీడీపీ నాయకులే ఉన్నారన్న విషయం తేలటంతో దిక్కుతోచక కొందరు అమాయక రైతులపై కేసులు పెట్టించే దుర్మార్గపు చర్యకు ఒడిగట్టారని మండిపడ్డారు.

ఇప్పుడు ఆ రైతులు నిర్దోషులుగా పోలీసులు తేల్చటంతో పాటు ఘటన వెనుక టీడీపీ నాయకులే ఉన్నారన్న నిర్ధారణ కావటంతో కేసులు మూసివేసే చర్యలు చేపడుతున్నారన్నారు. చంద్రబాబునాయుడు తన స్వార్థం కోసం ఎంతటివారిపైనైనా సంఘ విద్రోహులుగా ముద్ర వేసేయగలరని ఆరోపించారు. తుని వద్ద రైలు తగలబడిన ఘటనలో రాయలసీమకు చెందిన గూండాలు ఉన్నారంటూ ప్రజలను మభ్యపెట్టి మూడేళ్లు కావస్తున్నా సీబీఐ, సీఐడీ సంస్థలతో విచారణ జరిపించినా ఇంత వరకు ఒక్క దోషినీ పట్టుకోలేకపోయారన్నారు. ఈ ఘటన వెనుక ప్రధాన దోషి కూడా చంద్రబాబేనని పేర్కొన్నారు. ఈ విషయం పోలీసుల విచారణలో తేలినా కిమ్మనడం లేదన్నారు. తిత్లీ తుఫాన్‌ సమయంలో కూడా సహాయం కోసం ప్రశ్నించిన బా«ధితులను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుగా ముద్ర వేసి కేసులు పెట్టిన సంఘటనలను గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.  

వైఎస్సార్‌ సీపీలో చేరికలు
ప్రజా సంకల్పయాత్ర బృందం: రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ, ప్రభుత్వ అక్రమాలను ఎండగడుతోన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కురుపాం నియోజకవర్గంలోని జియ్యమ్మవలస మండలం సీమనాయుడువలసలో పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్వతీపురం పట్టణానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి జననేత పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు ఆధ్వర్యంలో జరిగిన చేరికల్లో పట్టణానికి చెందిన పారిశ్రామిక వేత్త ప్రభాకరరెడ్డి, హరికృష్ణరాజు, జయదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు