ఏడుగురు బైక్‌ దొంగల అరెస్టు

15 Jun, 2018 12:25 IST|Sakshi
నిందితులను మీడియాకు చూపుతున్న ఏడీసీపీ షరీన్‌ బేగం తదితరులు

13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

విజయవాడ : నగరంలోని పలు ప్రాంతాల్లో బైక్‌ దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను గురువారం సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.86 లక్షల విలువ గల 13 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. గవర్నర్‌పేట పోలీసు స్టేషన్‌లో సీసీఎస్‌ ఏడీసీపీ షరీన్‌ బేగం విలేకరులకు వివరాలను వెల్ల డించారు. విజయవాడ అలంకార్‌ థియేటర్‌ సెంటర్, మధురానగర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద, చుట్టుగుంట సెంటర్, వన్‌ టౌన్‌ వినాయక టెంపుల్, టూ టౌన్‌ ఏరియా, నెహ్రూ బొమ్మ సెంటర్, చిట్టినగర్‌ సెంటర్, గవర్నర్‌పేట ఏరియాలో మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుల్లో నలుగురు జువైనల్స్‌ (మైనర్లు) ఉన్నారు. వీరు వేర్వేరు ప్రాంతాల్లో బైక్‌లు అపహరించారు. సూర్యారావుపేటకు చెందిన రాయపాటి ధనరాజ్, దుర్గాఅగ్రహారానికి చెందిన పూసపాటి దేవరాజు, కలతోటి పవన్‌తో కలిపి నలుగురు జువైనల్స్‌ను అరెస్టు చేశారు. 

ఇద్దరు చైన్‌ స్నాచర్లు..
నగరంలో గొలుసు దొంగతనానికి పాల్పడిన కేసుల్లో ఇద్దరు నిందితులను సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు సీసీఎస్‌ ఏడీసీపీ షరీన్‌ బేగం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గవర్నర్‌పేట రాజగోపాలాచారి వీధిలో ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతుండగా సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 32 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మాచవరానికి చెందిన కలతోటి పవన్, కండవల్లి నవీన్‌ స్నేహితులుగా ఉంటూ గొలుసు దొంగతనాలకు అలవాటుపడ్డారు. విచారణలో ఇద్దరు నిందితులు ఈనెల 10వ తేదీన బైక్‌పై వెళుతూ టూ టౌన్‌ ఏరియాలో ఓ మహిళ మెడలో బంగారు నాంతాడును తెంచుకుని పరారైనట్లు వెల్లడైంది. సీసీఎస్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. 

పర్సు దొంగతనం కేసులో ఇద్దరు..
పర్సు దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 12 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్‌ ఏడీసీపీ షరీన్‌ బేగం గురువారం విలేకరులకు వెల్ల డించారు. నిందితులిద్దరూ వన్‌ టౌన్‌ శివాలయం వీధిలో దొంగిలించిన వస్తువులను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా తమ సిబ్బంది పట్టుకుని విచారించారని తెలిపారు. నిందితులు విజయవాడ డోర్నకల్‌ రోడ్డుకు చెందిన గడ్డమనుగు నరసింహారావు (75), సింగ్‌నగర్‌కు చెందిన గంటా వెంకటమ్మ (46)గా గుర్తించారు. నరసింహారావు టైలర్‌గా పని చేస్తుండగా, వెంకటమ్మ తోపుడు బండిపై సిగరెట్లు విక్రయిస్తుంటుంది. గత మార్చి 23వ తేదీన బీసెంట్‌ రోడ్డులోని పెద్దిబొట్ల వారి వీధిలో ఓ మహిళ తన చేతి పర్సులో బంగారు వస్తువులు పెట్టి దాన్ని జారవిడుచుకుంది. వీరిద్దరు నిందితులు ఆ పర్సును అపహరించారు. ఆ పర్సులో సుమారు 12 కాసుల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటిని నిందితులిద్దరూ అపహరించి, విక్రయిచేందుకు ప్రయత్నిస్తుండగా సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు