శిశు సంక్షేమ శాఖ అధికారులకు పసికందు అప్పగింత

20 Dec, 2018 13:00 IST|Sakshi
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు పసికందును అప్పగిస్తున్న తల్లి లక్ష్మి

తూర్పుగోదావరి, తాడితోట(రాజమహేంద్రవరం): మూడు రోజుల పసికందును శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించిన సంఘటన ఇది. కూనవరం మండలం, కూటూరు పంచాయతీ పరిధిలోని పులుసుమామిడిగొంది గ్రామానికి చెందిన 20 ఏళ్ల కొండ్ల లక్ష్మిని ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేశాడు. ఈనెల 17న కూనవరం పొలాల్లో ఉన్న పాకలో గర్భిణిగా ఉన్న లక్ష్మి తనకు తానుగా పురుడు పోసుకొని బిడ్డను పాకలో వదిలి వెళ్లిపోయింది. సమీపంలో పొలంలో పనులు చేసుకుంటున్న కూలీలు గుర్తించి ఆ శిశువును కూటూరు ఆసుపత్రికి తరలించి వైద్యులకు అప్పగించారు. వైద్యులు ఆ పాపకు చికిత్స అందించారు.

స్థానికులు పూరిపాక సమీపంలో మరో పాకలో శిశువుకు జన్మనిచ్చిన తల్లి లక్ష్మిని గుర్తించారు. తల్లి బిడ్డలను ఇప్పటి వరకూ అంగన్‌ వాడీ సంరక్షణలో ఉంచారు. తల్లి బిడ్డను పోషించుకునే స్థితిలో లేకపోవడంతో గురువారం  బాలల సంక్షేమ సమితి, జిల్లా చైల్డ్‌ లైన్‌ 1098 ఆధ్వర్యంలో స్త్రీ , శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. తల్లి లక్ష్మిని రాజమహేంద్రవరం రూరల్, బొమ్మూరు లో ఉన్న స్వధార హోమ్‌లో చేర్చారు. కార్యక్రమంలో సీడబ్ల్యూఎస్సీ చైర్‌పర్సన్‌ బి. పద్మావతి, కె.ఎల్‌.తాయారు, టి.పద్మజ, టి.ఆదిలక్ష్మి, చైల్డ్‌ లైన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ బి. శ్రీనివాసరావు, డీసీపీయూ కె.శ్రీనివాస్, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పద్మశ్రీ, పోలీస్‌ కానిస్టేబుల్‌ సుష్మలత, ఏఎన్‌ఎం పి.లలిత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు