పర్యాటకుల స్వర్గధామం కోనసీమ, ఆతిథ్యం నుంచి ఆత్మీయత వరకు..

27 Sep, 2023 12:23 IST|Sakshi

కోనసీమ అందాల సీమ. బంగాళాఖాతం తీరాన్ని ఆనుకుని.. సప్త నదీపాయల మధ్య కొలువైన సీమ. పచ్చని తివాచీ పరిచినట్టు ఉండే చేలు, కొబ్బరితోపులు, గోదావరి నదీపాయలు, వంపులు తిరుగుతూ పారే పంట కాలువలు, తెరచాప పడవలు, ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, మడ అడవులు, గోదావరి మధ్య లంక గ్రామాలు, మండువా లోగిళ్లు, రైతుల మకాంలు.. వీటన్నింటికీ మించి ఆత్మీయత, మమకారంతో కలిసిన ఆతిథ్యం ఇలా చెప్పుకుంటూ పోతే కోనసీమ పర్యాటకులకు స్వర్గధామం.

రైతులు, కూలీలు, మత్స్యకారులు, మహిళల జీవనం విధానం, కట్టూబొట్టూ, పండగలు, పబ్బాలు, జాతరలు.. ఇలా ఇక్కడ అన్నింటా ఒక ప్రత్యేక ముద్ర. ఇటీవల కాలంలో గోదావరి, సముద్ర తీరంలో వెలుస్తున్న రిసార్ట్స్‌, రైతుల పొలాల వద్ద ఫామ్‌ హౌస్‌లు, పర్యాటక రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం వంటి చర్యల కారణంగా కోనసీమకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ‘సప్త’వర్ణాల కోనసీమ.. పర్యాటకంగా కూడా ‘సప్త’రకాలుగా ఆకట్టుకుంటోంది. సెప్టెంబరు 27 ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా కథనం.


 

ఆధ్యాత్మికంగా..
ఆధ్యాత్మిక రంగంలో కోనసీమ జిల్లాకు ప్రముఖ స్థానం ఉంది. లెక్కలేనన్ని ఆలయాలు, పురాణ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు కోనసీమ సొంతం. వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక విమానాలలో భక్తులు వస్తున్నారు. వీటితోపాటు అంతర్వేది లక్ష్మీ నర్శింహస్వామి, మందపల్లి శనీశ్వర స్వామి, అయినవిల్లి శ్రీ విఘేశ్వరస్వామి, అప్పనపల్లి బాలబాలాజీ, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వచ్చే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది.

బౌద్ధులు.. రాజుల చారిత్రక ఆనవాళ్లు
చారిత్రాత్మక ప్రదేశాలలో పర్యాటకానికి వస్తే రామచంద్రపురంలో 17వ శతాబ్ధం నాటి కోట ఉంది. మామిడికుదురు మండలం ఆదుర్రులో క్రీస్తు పూర్వం రెండవ శతాబ్ధం నాటి పురాతన బౌద్ధ స్థూపాలున్నాయి. కపిలేశ్వరపురం జమీందార్ల పురాతన భవనాలు, రాజుల కోటలను తలపించే మండువా లోగిళ్ల ఇళ్లు పర్యాటకులకు ముచ్చటగొల్పుతాయి.

అగ్రి టూరిజం
పర్యాటకంలో ఇటీవల కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది అగ్రి టూరిజానికే. దేశంలో కేరళలో మొదలైన ఈ పర్యాటకం విస్తరిస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని ఐటీ వంటి రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు చేసేవారు ఒత్తిడి నుంచి బయటపడేందుకు అగ్రి టూరిజం బాట పడుతున్నారు. ఇటువంటి వారికి కోనసీమ అగ్రి టూరిజం ఒక అద్భుతం. పచ్చని తివాచీ పరచినట్టు ఉండే వరిచేలు, కొబ్బరి, అరటి తోటలు, లంక గ్రామాల్లో పలు రకాల పంటలు, పాడి, ఆక్వా చెరువులు, తోటల్లోని రైతుల మకాం (వ్యవసాయ శాలలు) విశేషంగా ఆకర్షిస్తాయి.

గోదావరి హొయలు
గోదావరి నదీ అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. నది మధ్యలో లంక గ్రామాలు, వాటిలో సాగయ్యే పంటలు, ఇసుక తిన్నెలు, చెంగుచెంగున ఎగిరే కృష్ణ జింకలు,
తెరచాప పడవలు, పంటులు, హౌస్‌బోట్లపై సాగే ప్రయాణం, నదీపాయలపై వంతెనలు.. గోదావరి కాలువలకు లాకులు,ఇలా చెప్పుకుంటూ పోతే గోదావరి హొయలు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

మైమరపించే మడ అడవులు
ఐ.పోలవరం మండలం భైరవపాలెం నుంచి అంతర్వేది సముద్ర తీరం వరకు నదీపాయలతోపాటు, మురుగునీటి కాలువలు సముద్రంలో కలిసే ప్రాంతాలలో ఉన్న మడ అడవులలో పర్యాటకం అద్భుతమనే చెప్పాలి. నదీ, కాలువ పాయల మధ్య మడ అడవులు మీదుగా సాగే ప్రయాణం మధురానుభూతిని పంచుతుంది.

ఆతిథ్యం అద్భుతం
అతిథి మర్యాదంటేనే గోదావరి జిల్లాలు. మరీ ముఖ్యంగా కోనసీమ ఆహారం.. అతిథ్యానికి ఫిదా అవ్వాల్సిందే. పర్యాటకుల జిహ్వ చాపల్యాన్ని తీర్చే రకరకాల స్వీట్లు, హాట్‌లు, టిఫిన్లు, బిర్యానీలు, మాంసహార కూరలు ఎన్నో.. ఎన్నెన్నో. ఆత్రేయపురం పూతరేకులు.. అవిడి పాలకోవా, మినప రొట్టి, చెరుకుపానకం, పెసరెట్టు ఉప్మా, పనస పొట్టు కూర, ముద్దపప్పు.. గుమ్మడి పులుసు, ఉల్లి గారెలు... నాటు కోడి కూర, చుక్కపీత ఇగురు.. పులసల పులుసు ఇలా ఎన్నో రకాల వంటకాలు పర్యాటకులను లోట్టలు వేయిస్తాయి.

మరిన్ని వార్తలు