తల్లిదండ్రుల దీవెనలతో..

18 Dec, 2014 04:08 IST|Sakshi

కన్నవారు ఎదురొచ్చాకే ప్రమాణ
స్వీకారానికి బయలుదేరిన సాంబశివరావు
భక్తురాలి తొలి ఫిర్యాదుపై స్పందించిన కొత్త ఈవో


తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నూతన ఈవోగా డాక్టర్ దొండపాటి సాంబశివరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రమాణస్వీకారం కోసం కుటుంబ సభ్యులందరూ తిరుమలకు వచ్చారు. ప్రమాణ స్వీకారం కోసం బయలుదేరేందుకు సాంబశివరావు, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజుతో కలసి కారులో సిద్ధంగా కూర్చుకున్నారు. వీరి కారుకు సాంబశివరావు తల్లిదండ్రులు దొండపాటి కృష్ణమూర్తి, దుర్గాంబ ఎదురొచ్చారు. ఆ తర్వాతే కారు బయలుదేరింది. తర్వాత తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులతో కలసి ఆయన భూ వరాహస్వామిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని ప్రమాణ స్వీకారం చేశారు. ఈవోగా బాధ్యతలు చేపట్టాక ఆలయం వెలుపలకు వచ్చిన ఈవో తొలిసారిగా మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ‘‘నా పూర్వజన్మసుకృతంతో పాటు నా తల్లిదండ్రుల పుణ్యఫలం వల్లే ధార్మిక సంస్థలో స్వామికి, భక్తులకు సేవ చేసే భాగ్యం కలిగింది’’ అని చెప్పటం చూస్తే తన తలిదండ్రుల పట్ల సాంబశివరావుకు భక్తి ప్రపత్తులు, బాధ్యతను గుర్తు చేసిందని చెప్పక తప్పుదు.

ఆ తర్వాత  ఆలయం వెలుపల పెద్దజీయర్‌మఠంలో జీయర్ల ఆశీస్సులు అందుకున్నారు. తర్వాత బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. కొత్త ఈవోగా బాధ్యతలు స్వీకరించాక సాంబశివరావును జేఈవోలు కేఎస్.శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, ఎస్టేట్ ఆఫీసర్ వీ.దేవేంద్రరెడ్డి, డెప్యూటీ ఈవోలు  ఈవో వెంకటయ్య, ఓఎస్‌డీ దామోదరం, పేష్కార్లు సెల్వం,   రామూర్తిరెడ్డి, కేశవరాజు, వీఎస్‌వో విమలకుమారి, ఏవీఎస్‌వోలు సాయిగిరిధర్, కోటిబాబు, మల్లికార్జున్ అభినందనలు తెలిపారు.

తొలి ఫిర్యాదును పరిష్కరించిన కొత్త ఈవో

టీటీడీ ఈవోగా సాంబశివరావు బాధ్యతలు స్వీకరించాక జీయర్ మఠంలో పెద్ద జీయర్, చిన్న జీయర్ల ఆశీస్సులు అందుకున్నారు. వెలుపలకు రాగానే ఓ మహిళ తనకు లడ్డూలు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. వెంటనే సాంబశివరావు స్పందించారు. ఆమెకు లడ్డూలు ఇవ్వాలని డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ద్వారా సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. నిమిషాల్లోనే ఆ భక్తురాలికి లడ్డూలు అందటంతో ఆమె ఆనందానికి అవుధుల్లేకుండా పోయింది.

నిజాయితి, నిక్కచ్చి అధికారిగా గుర్తింపు
 
సాంబశివరావు సొంతూరు కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి. 1986 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సాంశివరావు రాష్ట్ర, కేంద్ర సర్వీసుల్లో అనేక హోదాల్లో పనిచేశారు. సమర్థవంతమైన అధికారిగా పేరుంది. నిజాయితీ అధికారిగాను, ఏ విషయంలోనూ నాన్చుడు ధోరణి కాకుండా ముక్కుసూటితనంతో వ్యవహరించే అధికారిగా గుర్తింపు ఉంది. టీటీడీ ఈవో పోస్టు విషయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులెందరో ప్రయత్నాలు చేసినా సీఎం చంద్రబాబునాయుడు మాత్రం సాంబశివరావు వైపే మొగ్గు చూపారు.
 
 

మరిన్ని వార్తలు