చావులోనూ వీడని బంధం

27 Jul, 2014 01:23 IST|Sakshi
చావులోనూ వీడని బంధం
  • విద్యుత్ షాక్‌కు భార్యాభర్తల బలి
  •  వల్లూరుపాలెంలో ఘటన
  •  వైఎస్సార్‌సీపీ నేతల నివాళి
  •  గ్రామంలో విషాదఛాయలు
  • తోట్లవల్లూరు :  బలంగావీచిన ఈదురుగాలులకు  తెగిపడిన  విద్యుత్ తీగ  దంపతుల జీవితాలను అనంతవాయువుల్లో కలిపేసింది. విద్యుత్‌షాక్ కారణంగా  వల్లూరుపాలెంలో భార్యా, భర్తలు దుర్మరణం చెందిన ఘటన పలువరిని కంట తడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే...మండలంలోని వల్లూరుపాలెం ఊరి చివర బస్‌షెల్టర్  ఎదురుగా మరీదు విఘ్నేశ్వరావు(45) కుటుంబం నివాసం ఉంటోంది. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో నిద్రలేచి పనులకు ఉపక్రమించాడు.

    పశువుల పాకలో శుభ్రం చేసి, పశువులను కడిగేందుకు నీళ్లు పట్టే  క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కొబ్బరిమట్టలతో ఉన్న  దడి పక్కనే విద్యుత్ మెయిన్‌లైన్  తీగపడి  ఉంది. దీనిని గమనించని విఘ్నేశ్వరావు దడిపై చేయి వేయటంతో విద్యుత్‌షాక్ బలంగా కొట్టింది. భర్త కేకలు వేస్తూ పడిపోవటాన్ని గమనించిన  భార్య వెంకటేశ్వరమ్మ(40) ఏం జరిగిందో అర్థం కాక, అతనిని లేపే ప్రయత్నం చేసింది. దీంతో ఆమెకు  కూడా విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే  కుప్పకూలిపోయింది. వీరిద్దరినీ తప్పించేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు కూడా స్వల్పషాక్‌కు గురయ్యారు.

    విద్యుత్‌షాక్ తీవ్రతకు విఘ్నేశ్వరావు, భార్య వెంకటేశ్వరమ్మ క్షణాల వ్యవధిలో మృత్యువాత పడ్డారు.  భార్యా, భర్తలు మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున తరలివచ్చి మృతుల కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. మృతులకు కుమారుడు జీవన్‌బాబు, కుమార్తె దీప్తి ఉన్నారు.
     
    నేతల పరామర్శ....


    సమాచారం తెలుసుకున్న  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ   బందరు నియోజకవర్గం ఇన్‌చార్జి, మాజీ మంత్రి కె.పార్థసారథి,  పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన,తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి,  జెడ్పీ ఫ్లార్ లీడర్ తాతినేని పద్మావతి, ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీ మాజీ సభ్యులు మోర్ల రామచంద్రరావు,  సర్పంచి మాదల రంగారావు,  చింతలపూడి గవాస్కర్‌రాజు,  దేవరపల్లి చంద్రశేఖర్‌లు మృతదేహాలను సందర్శించి, నివాళులు అర్పించారు.

    ట్రాన్స్‌కో డిఈఈ మురళీమోహన్,  ఏడిఏ గోవిందరాజులు, తహ సీల్దార్ జి.భద్రుతో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉయ్యూరు సీఐ మురళీరామకృష్ణ, ఎస్‌ఐ డి.సురేష్ బందోబస్తు నిర్వహించారు.
     

>
మరిన్ని వార్తలు