కర్ణిసేన చీఫ్ గోగామేడి హత్య కేసులో నిందితులు వీరే..!

6 Dec, 2023 15:28 IST|Sakshi

జైపూర్‌: రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడిని హతమార్చిన కేసులో ఇద్దరు ముష్కరులను రాజస్థాన్ పోలీసులు గుర్తించారు. జైపూర్‌లోని మంగళవారం తన ఇంట్లో టీ తాగుతున్న సమయంలో  గోగామేడిని నిందితులు కాల్చి చంపారు. నిందితుల కోసం పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. సమాచారం అందిస్తే ఒక్కొక్కరికి రూ.5 లక్షల నజరానాను కూడా ప్రకటించారు. 

కర్ణిసేన చీఫ్ హత్య రాజస్థాన్‌లో ఉద్రిక్తతలకు దారితీసింది. ఆయన మద్దతుదారులు ఈరోజు రాజస్థాన్ బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రహదారులను దిగ్బంధించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జైపూర్‌తో పాటు చురు, ఉదయ్‌పూర్, అల్వార్, జోధ్‌పూర్ జిల్లాల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ హత్యపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమేష్ మిశ్రా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.  

సుఖ్‌దేవ్ సింగ్ హత్యకు బాధ్యత వహిస్తూ గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లతో దగ్గరి సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా ఫేస్‌బుక్ పోస్టు చేశాడు. రోహిత్ గోదార గతంలో సుఖ్‌దేవ్ గోదారాను బెదిరించాడు. రోహిత్ గొదారాపై సుఖ్‌దేవ్ సింగ్ ఫిర్యాదు కూడా చేశారని పోలీసులు తెలిపారు.

కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాంటెడ్ క్రిమినల్ జాబితాలో కూడా ఉన్నాడు. పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు.

ఇదీ చదవండి: Karni Sena Chief Murder Case: రాజస్థాన్‌ బంద్‌.. నాలుగు జిల్లాల్లో హైఅలర్ట్‌

>
మరిన్ని వార్తలు