అటు తిరిగి.. ఇటు తిరిగి.. మళ్లీ అమరావతి

1 Apr, 2015 01:42 IST|Sakshi

తాత్కాలిక రాజధానిగా నిర్ణయం?
సాక్షిప్రతినిధి, గుంటూరు : అమరావతి....తాత్కాలిక రాజధాని కాబోతోందని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన తరువాత అధికారికంగా ప్రకటిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరును ఖరారు చేస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతకముందు తాత్కాలిక రాజధాని ఎంపిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. మంగళగిరికి సమీపంలోని అమరావతి టౌన్‌షిప్‌లో అని, ఆ తరువాత ఒక ప్రైవేట్ కంపెనీ భూమి తీసుకుంటామని  రాష్ట్ర మంత్రి పి.నారాయణ ప్రకటించారు. తాజాగా మంగళవారం తాత్కాలిక రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసు కోనుందని సమాచారం.
 
రాజధాని పనుల పర్యవేక్షణకు అవకాశం...
రాజధాని నిర్దేశిత ప్రాంతమైన తుళ్లూరు మండలం అమరావతికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక, ఆధ్మాత్మికంగా ప్రత్యేక గుర్తింపు కలిగిఉంది. ప్రస్తుతం అమరావతిని భౌగోళికంగా పరిశీలిస్తే రాష్ట్రానికి తూర్పుదిశలోఉంది. ఉత్తర దిక్కున కృష్ణానది ప్రవహిస్తుంది. దీని వల్ల రాజధానికి తాగునీటి సమస్య ఉండదని భావిస్తున్నారు. నూతన రాజధాని పనుల అభివృద్ధిని ఎప్పటికప్పుడు దగ్గరగా ఉండి సమీక్షించుకునే వీలుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. విజయవాడ, మంగళగిరి, తెనాలి, గుంటూరు పట్టణాలకు అమరావతి సమీపంలో ఉంటుంది. 30 కిలోమీటర్ల దూరంలో విజయవాడ, గుంటూరు నగరాలు ఉన్నాయి.

గన్నవరం ఎయిర్‌పోర్టు 50 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రముఖులకు అసౌకర్యం కలిగే అవకాశం లేదు.  ప్రపంచంలో బౌద్ధమతం భాగా అభివృద్ధి చెందిన 34 దేశాల నుంచి రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సహకరించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక్కడి ప్రభుత్వ భూములను పరిశీలిస్తే వ్యవసాయశాఖ అధ్వర్యంలో స్టేట్‌సీడ్ ఫారమ్ కింద సుమారు 120 ఎకరాలు, దానికి సమీపంలోనే దేవాదాయశాఖకు చెందిన సుమారు 200 ఎకరాల భూమి ఉంది. దీనికి ఐదు కిలోమీటర్ల దూరంలో పెద మద్దూరు కొండ నుంచి కర్లపూడి వరకు సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో అటవీభూములు వేలాది ఎకరాలలో విస్తరించి ఉన్నాయి.
 
ఇది మరో వ్యూహమా... ?
తొలి నుంచి రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే అంశంపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదు. మొదట్లో నూజివీడు పరిసర ప్రాంతాల్లో రాజధాని వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు వినపడటంతో ఆ ప్రాంతంలో ఎక్కువగా భూములు కొనుగోలు చేశారు. నామమాత్రపు ధర కలిగిన భూములు లక్షలు పలికాయి. కోట్లు వెదజల్లి కొనుగోలు చేశారు. ఆ తరువాత విజయవాడ-గుంటూరు మధ్య అంటూ ఊహాగానాలు రావడంతో ఆ రెండు నగరాల్లోని భూములకు డిమాండ్ ఏర్పడింది. ఎకరా రూ.10 కోట్లకు కూడా కొనుగోలు చేశారు. చివరకు తుళ్లూరులోనే శాశ్వత రాజధాని అని ప్రకటించారు. దీంతో మొదటి రెండు ప్రాంతాల్లో  భూములు కొనుగోలు చేసిన ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.

తాత్కాలిక రాజధాని విషయంలోనూ ఇదే తరహా విధానాన్ని ప్రభుత్వం అనుసరించింది. మంగళగిరికి సమీపంలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు మొదట ప్రకటించండంతో ఆ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారు. చివరక అందరి అంచనాలకు భిన్నంగా అమరావతిని తాత్కాలిక రాజధానిగా నిర్ణయించే అవకాశాలు ఉన్నాయని  వార్తలు వెలువడటంతో అక్కడి భూములకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ తరహా ప్రకటనల వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని, వారు భూములు కొనుగోలు చేసిన ప్రాంతంలోనే రాజధాని, తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.

మరిన్ని వార్తలు