‘మాటలు చెప్తూ కాలం గడిపే ప్రభుత్వం కాదు’

21 Nov, 2019 16:15 IST|Sakshi

మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి

మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, విజయనగరం : సముద్రాన్నే నమ్ముకొని చేపలవేట వృత్తిగా సాగిస్తున్న మత్స్యకారులకు ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించిందని పట్టణాభివృద్ధి, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, అన్ని వర్గాల వారికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. గురువారం జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పడూ లేని విధంగా మత్స్యకారులకు రూ. 500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడానికి 10 వేల రూపాయలు ఇస్తుందని, జిల్లాలో 2645 మత్స్యకార కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. డీజిల్ సబ్సిడీని 6 రూపాయల 3 పైసలు నుంచి 9 రూపాయలకి పెంచామని.. మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే గతంలో రూ.5 లక్షల ఇచ్చేవారని.. దానిని తమ ప్రభుత్వం ఇప్పుడు రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం హర్షనీయమన్నారు.

గత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది
గత టీడీపీ ప్రభుత్వం మాదిరి మాటల చెప్తూ కాలం గడిపే ప్రభుత్వం తమది కాదని బొత్స విమర్శించారు. చింతపల్లిలో మినీ జెట్టేకి సీఎం జగన్‌ స్వయంగా శంకుస్థాపన చేస్తారని, దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, వాళ్ళు ఈ రోజు వచ్చి మాట్లాడుతుంటే విడ్డురంగా ఉందన్నారు. ఇంగ్లీష్ మీడియం పెట్టడం పిల్లలందరికీ ఓ గొప్ప అవకాశమన్నారు. విమర్శలు చేసే వాళ్ళ పిల్లలందరు ఎక్కడ చదువుతున్నారో ఒక్కసారి అత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవడమే తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర సంపద ఏ ఒక్కరిదో కాదని.. ప్రతి ఒక్కరిదని వ్యాఖ్యానించారు.

మీ సంక్షేమ కోసం పాటుపడతాం
విజయనగరం జిల్లా ఏర్పడిన నాటి నుంచి కొంతమంది నాయకులు అభివృద్ధికి సహకరించలేదని, ఇక నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని జిల్లాను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తామని బొత్స హామీ ఇచ్చారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తమ సమస్యగా స్వీకరించి దాని పరిస్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లా ప్రజల ఆదరణ ఉన్నంత వరకూ వారి సంక్షేమం కోసం పాటుపడతానని మంత్రి తెలిపారు. ‘దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా స్థానికులకు 70 శాతం ఉద్యోగ కల్పనకి చట్టం చేశాం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. పారిశ్రామిక వేత్తలు కూడా ప్రభుత్వ చట్టాలను అమల్లోకి తీసుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, అవినీతికి తావు లేకుండా సచివాలయ ఉద్యోగాలను చేపట్టాం. ప్రతిపక్షాలు ఎన్ని భయబ్రాంతులకు గురి చేసినా  బెదిరిపోయే నాయకుడు కాదు సీఎం వైఎస్‌ జగన్‌’ అని బొత్స స్పష్టం చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా