జిల్లాకు అశోక్‌ ఏం చేశారు!

25 Jan, 2019 08:54 IST|Sakshi
మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ

నాలుగేళ్లు ప్రత్యేక హోదా కోసం ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించలేదు

భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్‌ ఎందుకు రద్దు చేయించారు

ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో అశోక్‌ దోపిడీ బయటపెడతా...

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స ధ్వజం  

విజయనగరం, నెల్లిమర్ల: కేంద్ర మంత్రిగా అశోక్‌ గజపతిరాజు జిల్లాకు ఏం చేశారని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. నెల్లిమర్ల–విజయనగరం రహదారిలో సారిపల్లి జంక్షన్‌లో ఉన్న జగన్నాధ ఫంక్షన్‌ హాలులో గురువారం నిర్వహించిన నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాల వైఎస్సార్‌ సీపీ బూత్‌ కన్వీనర్లు, కమిటీ సభ్యులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో  బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ నాలుగేళ్ల పాటు కేంద్ర క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగిన ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఎందుకు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు. ప్యాకేజీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మొదట్నుంచీ వత్తాసు పలికిన అశోక్‌ నాలుగేళ్లలో జిల్లాకు కేవలం రూ.50కోట్లు మాత్రమే తెప్పించగలిగారని ఆరోపించారు. ఆ విధంగా వచ్చిన నిధుల్లో రూ.22కోట్లు తన కోట చుట్టూ కందకం తవ్వించడానికే వినియోగించారని ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ సంస్థను కాదని ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించడం వెనుక అశోక్‌తో పాటు టీడీపీ నేతల స్వార్ధం ఉందన్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారికి కాంట్రాక్టును అప్పగించేందుకే టెండర్లను రద్దు చేసిందని ఆరోపించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు ఖాయమని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు అశోక్‌ దోపిడీని బయటపెడతానని బొత్స స్పష్టం చేశారు.

రామతీర్ధ సాగర్‌ సంగతేంటి!
నెల్లిమర్ల నియోజకవర్గానికి సాగునీరందించే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన రామతీర్ధ సాగర్‌ ప్రాజెక్టును టీడీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి నాయుడు ఎందుకు గత నాలుగున్నరేళ్లలో పూర్తి చేయలేకపోయారని బొత్స ప్రశ్నించారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనత కలిగిన పతివాడ ప్రాజెక్టు నిర్మాణంపై ఎందుకు శ్రద్ధ చూపించలేదన్నారు. టీడీపీ ప్రభుత్వంచే కనీసం పిడికెడు మట్టి కూడా వేయించలేదన్నారు. కాంట్రాక్టర్లను మార్చినప్పుడల్లా కమీషన్లు వస్తాయనే కక్కుర్తితోనే ఈ విధంగా ఎమ్మెల్యే పతివాడ చేస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలోని పరిశ్రమలన్నీ మూతబడ్డాయని, తాజాగా నెల్లిమర్ల జ్యూట్‌మిల్లు కూడా మూతబడిందని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. అయినా టీడీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

ఓటమి భయంతోనే ఓట్ల తొలగింపు
త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందనే భయంతోనే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తోందని బొత్స ఆరోపించారు. సర్వేల పేరుతో ఇంటింటికీ పంపించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పేవారి ఓట్లను ఆధార్‌ సాయంతో తొలగిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో బూత్‌ కన్వీనర్లు, కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని బొత్స సూచించారు. వారి పరిధిలోని ఓట్లను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలని, ఈ నెలాఖరులోగా దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు. నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ విజయనగరం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్స సాంబశివరాజు, కార్యదర్శి డాక్టర్‌ పెనుమత్స సురేష్‌బాబు, నియోజకవర్గ నాలుగు మండలాల పార్టీ అధ్యక్షుడు చెనమల్లు వెంకటరమణ, పతివాడ అప్పలనాయుడు, ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, బంటుపల్లి వాసుదేవరావు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు