బోయకొండలో భద్రత కరువు

16 Nov, 2013 04:32 IST|Sakshi

=ఆలయంలో మూడోసారీ చోరీయత్నం
 =సిబ్బంది పనేనన్న అనుమానాలు
 =ఆందోళనలో భక్తులు

 
 జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా బోయకొండ విరాజిల్లుతోంది. ఇక్కడి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. అయితే ఆలయంలో చోరీకి యత్నాలు జరుగుతుండడం భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు బోయకొండలో మూడు చోరీ యత్నాలు జరిగాయి. అయినా అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 చౌడేపల్లె, : పుణ్యక్షేత్రమైన బోయకొండకు భద్రత కరువవుతోంది. ప్రధాన ఆలయంలో 2012లో రెండు సార్లు చోరీ యత్నాలు జరిగాయి. తాజాగా గురువారం రాత్రి ప్రధాన ఆలయానికి ముందున్న రణభేరి గంగమ్మ ఆలయంలో చోరీ యత్నం జరిగింది. ఆలయ భద్రత కోసం ఏడుగురు సెక్యూరిటీ సిబ్బంది, ఇద్దరు పోలీసులు ఉన్నారు. అయినా చోరీ యత్నాలు వెలుగు చూస్తుండడం ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది పనితీరు చె ప్పకనే చెబుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బంది సక్రమంగా విధులకు హాజరుకాకపోవడమే ఇందుకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు.
 
అన్నీ అనుమానాలే

బోయకొండ గంగమ్మ దర్శనార్థం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. గంగమ్మ దర్శనం అనంతరం రణభేరి గంగమ్మ ఆలయంలో పూజలు చేసి తిరుగు పయనమవుతారు. ఈ ఆలయంలో గురువారం రాత్రి చోరీ యత్నం జరిగింది. ఆలయానికున్న గేట్ల తాళాలు పగులకొట్టి లోపలకు ప్రవేశించిన తీరును చూస్తే అన్నీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన చోరీ యత్నాల్లో దుండగులు ఏ వస్తువులనూ తీసుకెళ్లలేదు. గడ్డపారలతో హుండీలను పగులకొట్టడం, వస్తువులను చిందర వందరగా పడేసి వెళ్లడం చోటు చేసుకుంది.
 
అధికారులను ఇబ్బంది పెట్టడానికేనా

ఆలయంలో పనిచేస్తున్న ఉన్నతస్థాయి అధికారులను ఇబ్బంది పెట్టడానికే ఎవరో పనిగట్టుకుని ఇదంతా చేస్తున్నారనే చర్చ సిబ్బంది మధ్య సాగుతోంది. ఆలయ ఈవోగా కస్తూరి ఉన్న సమయంలో (2012 ఆగస్టు 12)లో దుండగలు రెండు చోరీ యత్నాలు చేశారు. తర్వాత ఆమె బదిలీపై బుగ్గమఠం వెళ్లడం, బోయకొండ ఈవోగా హెచ్.జి.వెంకటేష్ బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. రాజకీయ, ఇతర కారణాలతో వెంకటేష్ సెలవుపై వెళ్లారు. ప్రస్తుతం ఇన్‌చార్జి ఈవోగా కస్తూరి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మరోమారు చోరీ యత్నం జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా కొంతమంది ఆలయ సిబ్బందే పనిగట్టుకుని చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
వెలుగులోకి నిఘా వైఫల్యం

 ఆలయంలో భద్రత కోసం నియమించిన సెక్యూరిటీ సిబ్బంది, పోలీసుల నిఘా డొల్లతనం మరోమారు బయటపడింది. ఆలయ భద్రత కోసం ఏడుగురు సెక్యూరిటీ ఉన్నారు. మంగళ, గురు, ఆదివారాల్లో ఏడుగురు విధులకు హాజరవుతారు. మిగిలిన రోజుల్లో నలుగురు ఉంటారు. వీరికి తోడుగా ఇద్దరు పోలీసులు ఉండాలి. అయితే గురువారం రాత్రి సెక్యూరిటీ సిబ్బంది శ్రీనాథరెడ్డి, రమణ, భాస్కర్ మాత్రమే విధులకు వచ్చారు. పోలీసులు రోజూ రాత్రి సమయాల్లో బోయకొండ ఔట్ పోస్టు నుంచి బోయకొండపై ఉన్న ఆలయం వరకూ వచ్చి వెళ్లిపోతారని తెలిసింది. ఈ విషయమై ఇన్‌చార్జి ఈవో కస్తూరిని విచారించగా విధులకు హాజరుకాని సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నామన్నారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు బోయకొండలో చోటు చేసుకుంటోన్న చోరీ యత్నాలు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు