సిమ్స్ లో సాధారణ వైద్య సేవలు బంద్

10 Oct, 2013 03:08 IST|Sakshi
పుట్టపర్తి అర్బన్/ అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ :  విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా పుట్టపర్తిలోని సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (సిమ్స్)లో సాధారణ వైద్య సేవలన్నీ బంద్ అయ్యాయి. లక్షలాది మంది నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి మూడు రోజులుగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో సాధారణ సేవలన్నీ నిలిపేసి.. అత్యవసర సేవలను మాత్రం జనరేటర్ సాయంతో కొనసాగిస్తున్నారు. ‘విద్యుత్ సరఫరాలో నిరవధిక అంతరాయం వల్ల ఆస్పత్రిని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసివేయడమైనది’ అనే నోటీసును రెండు ప్రధాన ద్వారాల వద్ద అతికించారు.
 
సత్యసాయి సేవాదళ్ సిబ్బంది కూడా ఎమర్జెన్సీ రోగులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ ఆస్పత్రిని 22 ఏళ్లలో ఏ ఒక్క రోజూ బంద్ చేయలేదు. అలాంటిది మూడు రోజులుగా మూసి వేయడంతో వేలాది మంది రోగులు అవస్థ పడుతున్నారు. ఇక్కడ ఖరీదైన వైద్య సేవలు సైతం ఉచితంగా అందిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి రోగులు వస్తుంటారు. నెలల తరబడి ఇక్కడే ఉంటూ వైద్యం చేయించుకుంటుంటారు. ప్రస్తుతం ఆస్పత్రిని మూసివేయడం వల్ల సుదూర ప్రాంత రోగులు  ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.
 
సర్వజనాస్పత్రిలోనూ కరెంటు కష్టాలు
అనంతపురం నగరంలోని సర్వజనాస్పత్రిలోనూ కరెంటు కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు వైద్యులు, సిబ్బంది ‘సమైక్య’ సమ్మెలో భాగంగా ఓపీ సేవలకు దూరంగా ఉండడం, మరో వైపు విద్యుత్ సమ్మెతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బుధవారం ఉదయం ఏడు గంటలకు పోయిన కరెంటు సాయంత్రం 6 గంటలకు వచ్చింది. విద్యుత్ లేని సమయంలో జనరేటర్ వేసే ఎలక్ట్రీషియన్ అందుబాటులో లేడు. దీంతో అత్యవసర సేవలు, చిన్నారుల ఐసీఐసీయూ, ఐసీయూ, ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ విభాగాల్లో రోగులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అనంతపురం రూరల్‌కు చెందిన ఓ గర్భిణీకి సిజేరియన్ చేయాల్సిన సమయంలో కరెంటు సరఫరా ఆగిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 
 
చిన్నపిల్లల వార్డులో పిల్లలకు ఏమైనా జరుగుతుందేమోనని తల్లిదండ్రులు భయపడ్డారు. విద్యుత్ సమ్మె ప్రభావం ఆపరేషన్లపైనా పడుతోంది. నిత్యం 60 ఆపరేషన్‌లు జరిగే సర్వజనాస్పత్రిలో ప్రస్తుతం పది కూడా దాటడం లేదు. సాధారణ ఆపరేషన్ థియేటర్‌ను తాత్కాలికంగా మూసేశారు. ఎమర్జెన్సీ ఓటీలో మాత్రమే జరుగుతున్నాయి. ఈ నెల 6న మూడు, 7,8 తేదీల్లో పది చొప్పున, బుధవారం11 ఆపరేషన్‌లు జరిగాయి. వీటిలోనూ ఎక్కువ శాతం సిజేరియన్లే. ఆరోగ్యశ్రీ కేసులు సైతం ఆలస్యమవుతున్నాయి. కరెంటు లేక అప్రూవల్ కోసం పంపలేకపోతున్నామని ఆరోగ్యశ్రీ సిబ్బంది చెబుతున్నారు. జనరేటర్ వాడాలంటే గంటకు 20 లీటర్ల డీజిల్ అవసరమని, ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రవాణా లేకపోవడం, బంకులు కూడా బంద్ చేస్తుండడంతో ఇబ్బంది కలుగుతోందని ఇన్‌చార్జ్ ఆర్‌ఎంఓ డాక్టర్ వైవీ రావు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు