జగన్‌పై బురద చల్లడమే కాంగ్రెస్, టీడీపీ పని: అంబటి రాంబాబు | Sakshi
Sakshi News home page

జగన్‌పై బురద చల్లడమే కాంగ్రెస్, టీడీపీ పని: అంబటి రాంబాబు

Published Thu, Oct 10 2013 3:04 AM

జగన్‌పై బురద చల్లడమే కాంగ్రెస్, టీడీపీ పని: అంబటి రాంబాబు - Sakshi

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
 సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణను తగ్గించేందుకు కాంగ్రెస్, టీడీపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని, అందులో భాగంగానే దిగ్విజయ్ బురద చల్లే వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. జగన్ తనకు కుమారుడులాంటి వారని అంటు న్న దిగ్విజయ్‌కు, అన్యాయంగా, అక్రమంగా 16 నెలలు జైల్లో ఉంచినప్పుడు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. ఎలాంటి తప్పూ చేయకపోయినా తప్పుడు కేసులతో జగన్‌ను అనేక ఇబ్బందులపాలు చేస్తున్నప్పుడు గుర్తులేదా? అని ప్రశ్నించారు.
 
 రాజశేఖరరెడ్డి తనకు మిత్రుడంటున్న దిగ్విజయ్‌సింగ్.. ఆ మహానేత మరణాన్ని తట్టుకోలేక మృతిచెందినవారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న జగన్‌కు అడ్డుచెప్పిన సోనియాను ఎందుకు వారించలేదని ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలంగా వైఎస్సార్‌సీపీ లేఖ ఇచ్చిందని దిగ్విజయ్ చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్, టీడీపీ కలిసి రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించి.. ఆ నెపాన్ని తమ పార్టీపై మోపడం తగదన్నారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ లేఖ ఇచ్చిన చంద్రబాబుతో తమ అధినేత జగన్‌ను ఒకే గాటన కట్టి రాష్ట్ర విభజనను త్వరితగతిన పూర్తి చేయాలనే దిగ్విజయ్ ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
Advertisement