‘టీటీడీని చెప్పుచేతుల్లో పెట్టుకుంటోంది’

21 May, 2018 12:28 IST|Sakshi

సాక్షి, విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్ధానంను తన చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం చూస్తోందని బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక ఆరోపించింది. బ్రాహ్మణ ఐక్య వేదిక ఆద్వర్యంలో స్థానిక గాయత్రి కన్వెన్షన్‌లో బ్రాహ్మణ సంఘాలు భేటీ అయ్యాయి. బ్రాహ్మణ సామాజిక వర్గం, అర్చకవృత్తి పై జరుగుతున్న కుట్రకు నిరసనగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఐక్య వేదిక నేతలు మాట్లాడుతూ.. అర్చకుల విషయంలో ప్రభుత్వ వైఖరి దారుణమన్నారు. ఇప్పటివరకు గుర్తుకురాని వయోపరిమితి హఠాత్తుగా ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు.

కేవలం క్షక్ష సాధింపులకే తమకు అనుకూలంగా ప్రభుత్వం నిబంధలను ప్రభుత్వం మార్చుకుంటోందని విమర్శించారు. తెలుగుదేశం మేనిఫెస్టోలో 500 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారని, కానీ ఎన్నికోట్లు కేటాయించారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. అర్చకుడికి రిటైర్‌మెంట్ లేదని టీడీపీ తన మేనిఫేస్టోలో ప్రకటించిందని గుర్తు చేశారు. మరి 72 ఏళ్ళ రమణదీక్షితులును ఎలా తొలగించారని నేతలు ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో నాలుగేళ్ళ పాటు పనిచేసిన తరువాత, ఇప్పుడు ఆయన వయసు గుర్తుకువచ్చిందా అన్నారు.

ప్రభుత్వ వైఖరి చూస్తే హిందూ వ్యతిరేకత కనిపిస్తోందని తెలిపారు. ఈ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఐ​క్యవేదిక నేతలు డాక్టర్ పార్థసారధి, డాక్టర్‌ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌, ద్రోణం రాజు రవికుమార్‌లతో పాటు గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సత్యానంద భారతీ స్వామి, వైఎస్సార్‌సీపీ నేతలు ఎమ్మెల్యే కోన రఘుపతి, మల్లాది విష్ణు, బ్రాహ్మణ సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.


(విజయవాడలో జరిగిన బ్రాహ్మణ ఐక్య వేదిక సమావేశం)


బ్రాహ్మణ ఐక్య వేదిక తీర్మానాలు

సత్యనారాయణ పురంలోని సీతారామ కళ్యాణ మంటపంను బ్రాహ్మణ సంఘాలకు అప్పగించాలి

రమణ దీక్షితులుకు వంశపారంపర్యంగా వచ్చిన తన హక్కును కల్పించాలి

సదావర్తికి భూములను ఇచ్చిన దాతల స్పూర్తిని కొనసాగించాలి

ఐవైఆర్ పట్ల చూపిన అనుచిత వైఖరికి క్షమాపణ చెప్పాలి

దుర్గగుడి లో తాంత్రిక పూజలపై నివేదికను బహిర్గతం చేయాలి


 

మరిన్ని వార్తలు