విశాఖ వీధుల్లో మోనో రైలు

13 Jul, 2019 07:14 IST|Sakshi
మోనోరైల్‌ 

బడ్జెట్‌లో గ్రీన్‌ సిగ్నల్‌

బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావన

వీసీఐసీడీపీ కి రూ.200 కోట్లు

స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి బాటలు

సాక్షి, విశాఖపట్నం: విశాఖ వీధుల్లో మోనో రైలు చక్కర్లు కొట్టనుంది. ఆర్థిక రాజధానిగా భాసిల్లుతున్న  నగరాన్ని ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇన్నాళ్లూ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్లకే పరిమితమైన విశాఖ మెట్రో ప్రాజెక్టును మోనో ప్రాజెక్టుగా మారుస్తూ ఏర్పాటు చేసి తీరుతామని బడ్జెట్‌ ప్రసంగంలో బుగ్గన స్పష్టం చేశారు. దీంతో పాటు నగరాభివృద్ధికి కీలకమైన కేటాయింపులు చేస్తూ  నవ శకానికి నాంది పలికారు. విశాఖలో మోనో రైలు ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది.

చైనా, రష్యా, ఇజ్రాయిల్, జర్మనీ, వియత్నాం వంటి 30కి పైగా దేశాల్లో విజయవంతంగా నడుపుతున్న మోనో రైలు ప్రాజెక్టుని నగరంలో ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తొలిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మొదటి వరుసలోనే ప్రకటించడం చూస్తే ఈ ప్రాజెక్టుపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించారని స్పష్టమవుతోంది. అత్యాధునిక ఫ్యాబ్రికేటెడ్‌ సింగిల్‌బీమ్‌ ద్వారా నడిచే మోనోరైలు నగర వీధుల్లో తిరగాడనుందని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా రవాణాకు పెద్ద పీట వేసిన నేపథ్యంలో ప్రభుత్వం మోనో రైల్‌ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. గతంలో మెట్రో ప్రాజెక్టు ఏర్పాటు సమయంలో నగరంలో సుమారు 40 మెట్రో స్టేషన్లు నిర్మించి  99 రైళ్లు తిరిగేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఇందులో మార్పులుండే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు.
 
విశాఖ–చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు..
విశాఖపట్నం– చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కూ ప్రభుత్వ భారీగానే కేటాయింపులు చేసింది. ఏపీ ట్రాన్స్‌కో కాంపోనెంట్‌లో భాగంగా నిర్మిస్తున్న భూగర్భ కేబుల్‌ నిర్మాణ ప్రాజెక్టుకి రూ.200 కోట్లు కేటాయించింది. స్మార్ట్‌ సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేయూతనిచ్చింది. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.180 కోట్లను ఇవ్వకుండా ఎన్నికల తాయిలాల కోసం వినియోగించుకోగా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం మాత్రం తమ వాటాగా ఇవ్వాల్సిన రూ.50 కోట్లు కేటాయించింది.   కార్పొరేషన్‌లో మౌలిక సదుపాయాలు, పెండింగ్‌ పనులు పూర్తి చేసేందుకు ఏర్పాటు చేసిన సిప్‌ పథకంలో భాగంగా జీవీఎంసీకి రూ.కోటి  కేటాయించారు. కాగా ఘన వ్యర్థాల నిర్వహణకు జీవీఎంసీకి రూ.8.49 కోట్లు బడ్జెట్‌లో ఇచ్చారు.

మరిన్ని వార్తలు