గుంటూరుకు మరో గండం!

30 May, 2018 11:52 IST|Sakshi
సంప్‌ను పగలగొట్టి గేదెలను బయటకు తీస్తున్న సిబ్బంది , సంప్‌లో చనిపోయిన గేదెలు

గుంటూరు పైప్‌లైన్‌లో గల్లంతైన 7 గేదెలు

5 గేదెలను రక్షించిన గ్రామస్తులు

సంపుల్లో ఇరుక్కుపోయిన 2 గేదెలు మృతి

సంపులు పగులగొట్టి కళేబరాలు వెలికితీత

గేదెల ఖరీదు సుమారు రూ.2.40 లక్షలు

మంగళగిరిటౌన్‌: గుంటూరు పట్టణానికి మరో గండం పొంచి ఉంది. విజయవాడ నుంచి తాగునీటిని అందించే పైప్‌లైన్లకు సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో జంతువులు సంపుల్లో పడి మృత్యువాత పడుతున్నాయి.  తాజాగా కాలువ గట్టున పచ్చగడ్డికోసం వెళ్లిన గేదెలు గుంటూరు చానల్‌లోకి దిగి మంగళవారం ప్రమాదవశాత్తు మృతి చెందాయి. సేకరించిన వివరాల ప్రకారం..  విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి గుంటూరు నగరానికి తాగునీరు అందించడానికి గుంటూరు చానల్‌ను ఉపయోగిస్తున్నారు. గుంటూరు చానల్‌ ద్వారా 2 రకాలుగా నీటిని గుంటూరు పట్టణానికి అందిస్తున్నారు. కాలువ ద్వారా నీటిని వర్షాకాలంలో గుంటూరు పట్టణానికి అందిస్తే, వేసవి కాలంలో గుంటూరు చానల్‌ వెంట అంతర్గతంగా భూమిలో ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌ ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇక్కడ అంతర్గతంగా వేసిన పైప్‌లైన్లలో పేరుకుపోయిన సిల్ట్, చెత్త, వ్యర్థపదార్థాలను తీసేందుకు కొంత దూరంలో సంప్‌లను ఏర్పాటు చేశారు.

ఈ సంపుల్లో పైన  ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా గుంటూరు మున్సిపల్‌ అధికారులు వదిలేశారు. అంతర్గత పైప్‌లైన్లు ప్రారంభంలో లాకులకు గ్రిల్స్‌ కాని, ఇనుప చువ్వలు కానీ ఏర్పాటు చేయకుండా పైప్‌లైన్‌లు ఏర్పాటు చేశారు. మంగళవారం జరిగిన ప్రమాదంలో  మంగళగిరి పట్టణం ద్వారకానగర్‌ నివాసి దేవరాల నారాయణకు చెందిన 7 గేదెలు తాగునీటికోసం గుంటూరు చానల్‌ వద్దకు వచ్చాయి.  ఎటువంటి రక్షణ చర్యలు లేకపోవడంతో అధికవేగంతో ప్రవహిస్తున్న కాలువలో పడి తూము ద్వారా సంప్‌లోకి వచ్చి ఇరుక్కుపోయాయి. ఈ సంఘటనను గమనించిన పశుకాపరులు, స్థానికులు హుటాహుటిన వచ్చి 7 గేదెల్లో 5 గేదెలను పక్కనే నిర్మాణం జరుగుతున్న సంస్థ క్రేన్‌ సహాయంతో బెల్టులు కట్టి ఒడ్డుకు చేర్చారు.

రెండు మాత్రం సంప్‌ నుంచి నేరుగా ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌లో ఇరుక్కుపోయి నీటి ప్రవాహానికి అర కిలోమీటరు దూరంలో ఉన్న సంప్‌లలో ఒక్కొక్కటి వేరువేరుగా నీటిపై తేలియాడుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంగళగిరి తహసీల్దార్‌ వసంతబాబు ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుంటూరు మున్సిపల్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి, జరిగిన నష్టం గురించి, రక్షణచర్యల గురించి మాట్లాడకుండా, పశుకాపర్ల మీద కోప్పడటం గమనార్హం. ఈ సంప్‌ నుంచి గేదెలను తీయాలంటే సంప్‌లను పగలగొట్టి చనిపోయిన గేదెలను తీయాల్సిందే. సాయంత్రానికి  గుంటూరు మున్సిపాలిటీ యంత్రాంగం వచ్చి సంపులను పగులగొట్టి మృతిచెందిన గేదెలను వెలికి తీశారు.   సుమారు రూ. 2.40 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు పశువుల కాపరి ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు