సమాధానం చెప్పకుండా ఉలికిపాటెందుకు?

9 Mar, 2017 01:55 IST|Sakshi
సమాధానం చెప్పకుండా ఉలికిపాటెందుకు?

ఆర్థిక మంత్రి యనమలపై వైఎస్సార్‌సీఎల్పీ ధ్వజం
జగన్‌ ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేరా?


సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వృద్ధి రేటు గొప్పగా పెరిగితే ఆ మేర రాష్ట్రానికొచ్చే పన్నుల ఆదాయం పెరగాలి కదా అని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జవాబు చెప్పకుండా ఏదేదో మాట్లాడారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్షం ధ్వజమెత్తింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బుధవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘కేంద్ర స్థూల ఉత్పత్తి 7.3 శాతం పెరిగితేనే కేంద్రానికి 24 శాతం పన్నుల రాబడి పెరిగిందని, రాష్ట్రంలో వృద్ధి రేటు 11 శాతం పెరిగితే రాష్ట్ర పన్నుల ఆదాయంలో పెరుగుదల 8 శాతానికే పరిమితం కావడానికి కారణం ఏమిటని అసెంబ్లీలో గవర్నర్‌ సందేశం తర్వాత ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా అడిగారు.

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అనవసరమైనవన్నీ మాట్లాడారు’ అని దుయ్యబట్టారు.   వైఎస్‌ జగన్‌ సభలో మాట్లాడిన అంశాలపై చర్చ ఇంకా పూర్తి కాకపోయినా, హడావుడిగా ఆర్థిక మంత్రి మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని బుగ్గన ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి సభలో సరిగా జవాబు చెప్పలేరని ఉలిక్కిపడ్డారా? అని నిలదీశారు.

జగన్‌ చదువు గురించి మాట్లాడేవారు చదివిందేందో..
ప్రతి దానికి హేళన చేయడం యనమల వయసుకు సరికాదని బుగ్గన హితవు పలికారు. ‘జగన్‌మోహన్‌రెడ్డి చదువు గురించి యనమల ఏదో మాట్లాడతారు. ఇంతకూ యనమల లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదివారా? ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదవారా? ఆయన ఉండే ప్రాంతం పక్కనే ఆం«ధ్రా యూనివర్సిటీ ఉన్నా చదివింది మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ యూనివర్సిటీలో. మేం చదువుకున్న స్కూళ్లు, మా తల్లిదండ్రులు మాకు సంస్కారం నేర్పారు. హేళన చేయడం మాకు నేర్పలేదు. ఎదుటి వ్యక్తిని గౌరవించడం నేర్పారు. మీ పద్ధతి ఏంది? ఆర్థిక మంత్రిగా రోశయ్య మంచి పేరు సంపాదించుకున్నారు, రోశయ్య ఏం చదివారో మీకు తెలియదా?’ అని ధ్వజమెత్తారు. సమావేశంలో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు