చైన్‌స్నాచింగ్ ముఠా అరెస్ట్

20 Oct, 2014 03:11 IST|Sakshi

మదనపల్లెక్రైం: మదనపల్లె, వాల్మీకిపురంలో హల్‌చల్ చేస్తున్న చైన్‌స్నాచింగ్ ముఠాను ప్రత్యేక ఐడీ పార్టీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.7.2 లక్షల విలువైన 263 గ్రాముల బంగారు, 200 గ్రాముల వెండి ఆభరణాలను రికవరీ చేశారు. ఆదివారం ఉదయం స్థానిక రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ముఠా అరెస్ట్ చూపారు.

డీఎస్పీ కే.రాఘవరెడ్డి, సీఐ గంగయ్య చెప్పిన వివరాల మేరకు.. వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటి మండలం పోడలపల్లెకు చెందిన వెంకటరమణ కుమారుడు శంకారపు వెంకటేష్ (30), గాలివీడు మండలం బలిజపల్లె పంచాయతీ తూముకుంటకు చెందిన గంగరాజు విశ్వనాథ్ అలియాస్ విశ్వ(32), కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా కఠారుముద్దలపల్లెకు చెందిన మామకుంట్ల మంజునాథ్ అలియాస్ మంజు(34) కొన్నేళ్ల క్రితం నీరుగట్టువారిపల్లెలో కొంతకాలంగా మగ్గాలు నేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి మరో ముగ్గురు స్నేహితులు తోడయ్యారు. జల్సాలకు అలవాటుపడి డబ్బు కోసం చైన్ స్నాచింగ్‌లకు దిగారు.

మదనపల్లె, వాల్మీకిపురం ప్రాంతాల్లో ఆరు నెలలుగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు డీఎస్పీ ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. వీరు ముఠా గుట్టును రట్టు చేశారు. దోచుకున్న నగలను బెంగళూరులో విక్రయిం చేందుకు వెళుతుండగా విజయ డెయిరీ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముఠాను పట్టుకున్న ఐడీ పార్టీ సిబ్బందిని డీఎస్పీ అభినందించి, రివార్డులు అందజేశారు.
 

మరిన్ని వార్తలు