ఎరక్కపోయి.. ఇరుక్కుపోయి

13 Sep, 2015 00:35 IST|Sakshi

 నరసాపురం అర్బన్ :పట్టణాల్లోని వీధి దీపాలకు ఎల్‌ఈడీ బల్బుల్ని అమర్చే విషయమై పురపాలకులు పునరాలోచనలో పడ్డారు. ఎల్‌ఈడీ బల్బుల్ని వాడటం వల్ల విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని, తద్వారా మునిసిపాలిటీలపై ఆర్థిక భారం బాగా తగ్గుతుందని భావించారు.  దీంతో జిల్లాలోని రెండు మునిసిపాలిటీలు మినహా మిగిలినవన్నీ ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఎల్‌ఈడీ బల్బుల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాక, ఒప్పందాన్ని కొనసాగించాలా లేక వదులుకోవాలా అనే మీమాంసలో పడ్డాయి. వీధుల్లో తగినంత కాంతులు వెదజల్లలేకపోతున్న  ఎల్‌ఈడీ ప్రాజెక్ట్ ఏర్పాటు కు ఎరక్కపోయి అంగీకరించామనే అభిప్రాయం పురపాలకుల్లో వ్యక్తమవుతోంది. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ఎలా ఉంటుందోనన్న ఆలోచనకు వస్తున్నారు. ఇందుకు పరిస్థితులు అనుకూలిస్తాయో లేదోననే ఆందోళన వారిని వెన్నాడుతోంది.
 
 ఒప్పందం ఇలా
 కేంద్ర ఇంధన వనరుల శాఖ యోచన మేరకు మునిసిపాలిటీల్లో ఇప్పుడున్న వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులు అమర్చాలని నిర్ణయించారు. ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్) ఇందుకు జిల్లాలోని మునిసిపాలిటీలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రస్తుతం మునిసిపాలిటీల్లో ఉన్న వీధి దీపాలు తొలగించి ఆ సంస్థ ఎల్‌ఈడీ లైట్లు అమర్చుతోంది.  మునిసిపాలిటీలకు వీధి దీపాల నిర్వహణకుగాను నెలవారీ వస్తున్న విద్యుత్ బిల్లులో సగంపైగా ఆదా చూపిస్తోంది. ఒప్పందం ప్రకారం మునిసిపాలిటీలకు ప్రస్తుతం వస్తున్న విద్యుత్ బిల్లులో సగం మాత్రమే ఈఈఎస్‌ఎల్‌కు చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఒప్పందం ఏడేళ్లు అమలులో ఉంటుంది. ఈ కాలంలో వీధి దీపాల నిర్వహణతో మునిసిపాలిటీకి సంబంధం లేకుండా ఆ కంపెనీయే చూస్తుంది. ఇదంతా బాగానే ఉన్నా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆశించిన ఫలితాలు రావడం లేదనేది పురపాలకుల భావన.
 
 భారం తగ్గుతుందనుకుంటే..
 జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం మినహా ఏలూరు కార్పొరేషన్‌తో సహా మిగిలిన మునిసిపాలిటీలు ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో లైట్లు ఏర్పాటు చేశారు. లైట్లు ఎక్కడా సవ్యంగా వెలగటం లేదు. గతంలో ఉన్న లైట్లతో పోలిస్తే వీటి కాంతి చాలా తక్కువగా ఉంది. తక్కువ లైటింగ్ సామర్థ్యం గల నాసిరకం బల్బులు వేయటమే దీనికి కారణమనే ఆరోపణలు వస్తున్నారుు. వెలుగుతున్న లైట్ల మీద వర్షం పడుతుంటే అవి పేలిపోతున్నాయి. నరసాపురం పట్టణంలో పుష్కరాల సమయంలో  2వేల 380 లైట్లు ఏర్పాటు చేయగా, ఇప్పటికే 270 బల్బులు పాడైపోయాయి. ఇతర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లాలోని ఏ మునిసిపాలిటీ ఇంతవరకూ ఈఈఎస్‌ఎల్‌కు మొదటి బిల్లు కూడా చెల్లించలేదు. ఇప్పుడు ఒప్పందం రద్దు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.
 
 పరిస్థితి మెరుగవుతుందా?
 ఇంకా పూర్తిస్థాయిలో లైట్లు ఏర్పాటు చేయలేదని, నిర్వహణ కూడా గాడిలో పడలేదని మునిసిపల్ అధికారులు చెబుతున్నారు. పురపాలనకు సంబంధించి వీధిదీపాల నిర్వహణ ముఖ్యమైన అంశాల్లో ఒకటి. ఇప్పటికే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై కౌన్సిల్ సమావేశాల్లో సభ్యులు మొదట్లోనే పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు కౌన్సిల్ సమావేశాల్లో అరుుతే పెద్ద చర్చే జరిగింది. కేంద్ర ప్రభుత్వం సలహా అంటూ అధికార పార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మునిసిపాలిటీల్లో వీధి దీపాల నిర్వహణకు కాంట్రాక్ట్ పద్ధతిపై వందలాది మంది పనిచేస్తున్నారు. వీరి పరిస్థితి ఏమిటి అనే దానిపై కూడా మునిసిపాలిటీలు ఆలోచనలో పడ్డాయి. నరసాపురం పట్టణంలో కొన్నిచోట్ల ఎల్‌ఈడీ బల్బుల స్థానంలో మామూలు లైట్లు బిగించేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు