అక్రమ ఆమోదంపై వేటు

17 Oct, 2019 09:06 IST|Sakshi
ఆమోద పబ్లికేషన్స్‌కు కేటాయించిన స్థలం

ఆమోద పబ్లికేషన్స్‌కు స్థల కేటాయింపులు రద్దు

ఆ స్థలాన్ని పేదలకు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం

టీడీపీ హయాంలో ఆంధ్రజ్యోతికి అడ్డగోలుగా ధారాదత్తం

రూ.కోట్ల విలువైన స్థలం రూ.50 లక్షలకే సమర్పణ

అందులోని గ్రావెల్‌ అమ్ముకొని ఇప్పటికే రూ.7 కోట్లు కొల్లగొట్టిన నిర్మాణ సంస్థ

ప్రతిగా ఉచితంగా కార్యాలయ భవనం నిర్మించాలని ఒప్పందం

తన తాబేదార్లకు, అంతేవాసులకు విశాఖను వడ్డించిన విస్తరిలా మార్చేసి.. భూములను అడ్డంగా వడ్డించేసిన గత టీడీపీ సర్కారు నిర్వాకం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. తాబేదార్లకే కాదు.. నిత్యం తనకు భజన చేసే తోక పత్రికలకు సైతం రూ.కోట్ల విలువైన భూములను నామమాత్రపు ధరలకు ధారాదత్తం చేసేసిన పచ్చ సర్కారు.. పచ్చి అక్రమాలకు.. తాజాగా అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది. అప్పనంగా అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకొని.. వాటిని అర్హులైన పేదలకు ఇచ్చే చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే నగర శివారు పరదేశిపాలెంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న అత్యంత విలువైన ఒకటిన్నర ఎకరాల భూమిని తన తోక పత్రికకు దఖలుపరుస్తూ.. 2017లో అప్పటి టీడీపీ సర్కారు జరిపిన కేటాయింపులపై ఇప్పటి ప్రభుత్వం వేటు వేసింది. ఆ భూమిని పేదలకు కేటాయించాలని బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో తీర్మానించింది.  కాగా అడ్డగోలుగా పొందిన ఆ భూమిని ఇప్పటికే తవ్వుకొని కంకర అమ్మకాల ద్వారా రూ.7 కోట్లకుపైగా అప్పనంగా వెనుకేసుకోవడం కొసమెరుపు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ శివారున పరదేశిపాలెంలో రూ.కోట్ల విలువైన 1.50 ఎకరాల స్థలాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్య సంస్థ అయిన ఆమోద పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేవలం రూ.50 లక్షల 5వేలకే ఇచ్చేస్తూ.. 2017 జూన్‌ 28న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి ముందు ఎప్పుడో.. 1986లో అప్పటి ఎన్టీఆర్‌ ప్రభుత్వం ఆంధ్రజ్యోతి ప్రెస్‌కు పరదేశిపాలెం గ్రామ పరిధి సర్వే నెం.191, 168లలో ఎకరా రూ.10వేల ధరకు 1.50ఎకరాల భూమి కేటాయించింది. అయితే కొన్నాళ్లకు జాతీయ రహదారి విస్తరణ కోసం ఇందులో ఎకరా భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మిగిలిన 50 సెంట్ల భూమి అప్పటి నుంచి ఆ సంస్థ అధీనంలోనే ఉంది. జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌–16) కోసం స్వాధీనం చేసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా వేరే భూమి ఇవ్వాలని, 1986లో తమకు కేటాయించిన ధరకే ఎకరా రూ.10వేల చొప్పున రేటు నిర్ణయించాలని ఆంధ్రజ్యోతి యాజమాన్యం 2016లో చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరింది. ఇలా సదరు పత్రిక కోరడమే ఆలస్యం.. ఆగమేఘాల మీద స్పందించిన బాబు సర్కారు అదే ప్రాంతంలో ఒకటిన్నర ఎకరాల భూమిని గుర్తించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.

కలెక్టర్‌ చెప్పిన రేటు కాదని..
అప్పటి జిల్లా కలెక్టర్‌ యువరాజ్‌ ఈ ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఉందని పేర్కొంటూ.. మార్కెట్‌ విలువ ఎకరా రూ.7.26 కోట్లుగా నిర్ధారిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపారు. 2016 ఆగస్టు 10న ఇచ్చిన ఈ నివేదికను అనుసరించి అదే ఏడాది అక్టోబర్‌ 4వ తేదీన అప్పటి జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ రివైజ్డ్‌ నివేదిక పంపించారు. ఆ నివేదికలో కూడా ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ఎకరా రూ.7.26 కోట్లకే కేటాయించాల్సిందిగా ఎలినేషన్‌ ప్రతిపాదనలు పంపారు. కానీ టీడీపీ సర్కారు జిల్లా అధికారుల సిఫార్సులను లెక్కలోకి తీసుకోలేదు. పరదేశిపాలెం సర్వేనంబర్‌ 191/10 నుంచి 191/14లో అందుబాటులో ఉన్న ఎకరా 50 సెంట్ల భూమిని ఆమోద పబ్లికేషన్స్‌కు కేటాయిస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కరికల వలవన్‌ 2017 జూన్‌ 28న జీవో ఎంఎస్‌. 25ను జారీ చేశారు. 0.50 సెంట్ల భూమిని పాత ధర కింద ఎకరా రూ.10వేల రేటుతో, ప్రత్యామ్నాయంగా ఇస్తున్న ఎకరా భూమిని ఎకరా రూ.50 లక్షల రేటుతో కేటాయించాలని సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మూడేళ్లలో భూమిని ఉపయోగించాలనీ, ఆ భూమిలో ఉన్న వాటర్‌ బాడీస్‌ (చెరువులు, గెడ్డలు)ను రూపు మార్చకూడదని స్పష్టం చేశారు. సంబంధిత అవసరాలకు మాత్రమే వినియోగించాలని, వివరాలను జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని అప్పటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి మార్చి 31వ తేదీకల్లా ఈ భూమి వినియోగంపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇక్కడ ఎకరా కోట్లలో పలుకుతుందనేది అందరికీ తెలిసిందే. అలాంటిది ఒకటిన్నర ఎకరాల భూమిని కేవలం రూ.50లక్షలకే  ధారాదత్తం చేయడం అప్పట్లోనే వివాదమైంది.

ఇప్పుడు బలహీనవర్గాలకు కేటాయించేలా...
పేదలకు చెందాల్సిన విలువైన భూమిని అధికారం అడ్డం పెట్టుకొని  ఆంధ్రజ్యోతికి అప్పనంగా ఇచ్చేసినట్లుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం గుర్తించింది. విలువైన ఈ స్థలంలో పదుల సంఖ్యలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంకల్పించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ భూమి కేటాయింపును రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఆ స్థలాన్ని బలహీనవర్గాలకు కేటాయించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు సూచించనున్నట్లు మంత్రి పేర్ని నాని ప్రకటించారు.

గ్రావెల్‌ తరలింపుతో రూ.కోట్లు కొల్లగొట్టారు
ఇక ఎకరాన్నర స్థలంలో ఉన్న కొండలను చదును చేసే పనిని టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఓ బడా నిర్మాణ సంస్థకు సదరు భూమి పొందిన ఆమోదా పబ్లికేషన్స్‌ అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ సంస్థ కొండను చదును చేసి రోజుకు సుమారు రూ. 2లక్షల విలువ చేసే గ్రావెల్‌ తరలిస్తోంది. ఏడాది నుంచి  ఈ వ్యవహారం సాగుతోంది. మొత్తంగా ఇప్పటివరకు రూ. 7కోట్ల విలువైన గ్రావెల్‌ను అడ్డగోలుగా తరలించినట్టు  చెబుతున్నారు. ఈ కొండను లెవెల్‌ చేసి గ్రావెల్‌ అమ్ముకున్నందుకు ప్రతిగా సదరు సంస్థ ఉచితంగా ఆమోదా పబ్లికేషన్స్‌కు కార్యాలయం నిర్మించి ఇవ్వాలన్నదే వారి మధ్య ఒప్పందంగా తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు