సోనియా గుడికి శంకుస్థాపన చేసిన శంకర్రావు

9 Dec, 2013 14:28 IST|Sakshi
సోనియా గుడికి శంకుస్థాపన చేసిన శంకర్రావు

మహబూబ్నగర్ : ఇందిరాగాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా పేరున్న మాజీమంత్రి, కంట్రోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు మరోసారి తన స్వామి భక్తిని చాటుకున్నారు. రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిపిన  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆలయం కట్టేందుకు ఆయన పూనుకున్నారు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం నందిగామలో శంకర్రావు సోమవారం  సోనియా గుడికి శంకుస్థాపన చేశారు. తన 9 ఎకరాల పొలంలో కొంతమేర సోనియాగాంధీ గుడి నిర్మాణానికి శంకరన్న సిద్ధం అయ్యారు.

ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్రులు చరిత్ర హీనులుగా మారుతారని మండిపడ్డారు. సీమాంధ్రులు రాజీవ్ విగ్రహాలు కూల్చడం దారుణమని ఆయన విమర్శించారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి స్థానిక నేతల వైఫల్యమే కారణమని రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్కు ఎలాంటి ఢోకా లేదని శంకర్రావు ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని....మంచి చేసిన వారికి సమాధులు కట్టే సంస్కృతి సీమాంధ్రులకు ఉంటే, గుడులు నిర్మించి సంస్కృతి తెలంగాణ ప్రజలదని ఆయన అన్నారు. సోనియాను ప్రతి ఒక్కరూ తెలంగాణ తల్లిగా కొలుస్తున్నారని, ఆమెకు గుడి కట్టించడం తమ లక్ష్యమన్నారు.

మరిన్ని వార్తలు