రాజధాని అభివృద్ధి కమిటీ విధి విధానాలు ఖరారు 

10 Oct, 2019 03:27 IST|Sakshi

కన్వీనర్, సభ్యులకు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ హోదా 

ఎలాంటి సమాచారమైనా తెప్పించుకునే అధికారం 

6 వారాల్లో ప్రభుత్వానికి నివేదిక

సాక్షి, అమరావతి: రాజధానితో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాన, సమగ్రాభివృద్ధి కోసం ఇటీవల నియమించిన ఉన్నత స్థాయి కమిటీకి సంబంధించి ప్రభుత్వం విధివిధానాలు, అధికారాలను ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం మునిసిపల్‌ శాఖ కార్యదర్శి జె శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ రాష్ట్రంలో ఏ అధికారితోనైనా సంప్రదింపులు జరిపి చర్చించవచ్చు. అవసరమైన సమాచారాన్ని తెప్పించుకుని విశ్లేషించవచ్చు. క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించవచ్చు. రాష్ట్రంలో వివిధ వర్గాల వారితో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. ప్రజా ప్రతినిధుల నుంచి, వివిధ వర్గాల సాధారణ ప్రజల నుంచి, ఆన్‌లైన్‌ ద్వారా సమాచారం పొందవచ్చు.

రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం, డాక్యుమెంట్లనైనా తెప్పించుకుని విశ్లేషించేలా ఈ కమిటీకి ప్రభుత్వం అధికారాలను కల్పించింది. కమిటీ కన్వీనర్, సభ్యులకు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ హోదా ఇచ్చారు. వసతి, వాహన సౌకర్యం కల్పిస్తారు. కమిటీకి కార్యాలయం ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బంది కేటాయింపు బాధ్యతను సీఆర్‌డీఏకు అప్పగించారు. సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ విజయకృష్ణన్‌ ఈ కమిటీకి నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. కమిటీ జిల్లాల పర్యటన సందర్భంగా కలెక్టర్‌లు సమన్వయ బాధ్యత నిర్వహించాల్సి ఉంటుంది. కమిటీకి అవసరమైన నిధులు సీఆర్‌డీఏ నుంచి సర్దుబాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. మున్సిపల్‌ కార్యదర్శితో సంప్రదింపులు జరిపిన తేదీ నుంచి ఆరు వారాల్లోగా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి.   

మరిన్ని వార్తలు