పార్టీలతో కేంద్రం చర్చలు జరపాలి

11 Oct, 2013 03:06 IST|Sakshi
పార్టీలతో కేంద్రం చర్చలు జరపాలి

సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమ ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలతో విడివిడిగా లేదా సంయుక్తంగానైనా చర్చలు జరపాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఎన్నికల అవసరాల కోసం అవకాశవాదానికి పాల్పడవద్దని రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందానికి స్పష్టమైన సూచనలు చేయాలని కోరింది. రెండు రోజుల పాటు జరిగే సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం గురువారమిక్కడ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితిపై ఆమోదించిన తీర్మానాన్ని మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు చెబుతున్న ధర్మం, న్యాయం ఏమిటో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే విభజన బిల్లు పెట్టాలంటున్న వెంకయ్య నాయుడు ఇప్పటి దాకా ఆ మాట ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సీమాంధ్రకు ఏం కావాలో వెంకయ్య చెప్పాలని నిలదీశారు.
 
 అవకాశవాదాన్ని విడనాడాలని, అస్పష్టంగా మాట్లాడవద్దని హితవుపలికారు. సీమాంధ్ర ఉద్యమకారుల సమస్యను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. తనకు చేతకానప్పుడు ఉద్యమకారులను ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రప్రభుత్వం ముందుంచాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సంక్షోభానికి తమ పార్టీ సూచిస్తున్న పరిష్కారం.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమేనని చెప్పారు. తాము ఇప్పటికీ భాషాప్రాతిపదిక రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్రపతి పాలనను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చెప్పారు. విజయనగరంలో దాడులు, ఉద్రిక్త పరిస్థితులకు బొత్స, ఆయన కుటుంబ సభ్యుల అరాచకాలే కారణమని పార్టీ అభిప్రాయపడినట్టు వివరించారు. కర్ఫ్యూ అనంతరం అమాయకులు.. బొత్స అంటే గిట్టనివాళ్లపై కేసులు పెట్టి వేధించనున్నారని తెలిపారు. ఢిల్లీలో వైఎస్ విజయమ్మ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ నేతలు తమ పార్టీ నాయకుల్ని కలవడంలో ప్రత్యేకత ఏమీ లేదని, అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించినట్టే తమనూ కలిశారని రాఘవులు చెప్పారు.

మరిన్ని వార్తలు