గొలుసంటే అలుసా

3 Nov, 2015 01:14 IST|Sakshi
గొలుసంటే అలుసా

చైన్‌స్నాచింగ్..పోలీసులకు సవాల్
 
గుంటూరు, విజయవాడల్లో   గొలుసు దొంగతనాలు జోరు
పట్టించుకోని పోలీసులు...    భయపడుతోన్న మహిళలు
రాజధాని బందోబస్తు, వీఐపీల   సేవలోనే తరిస్తున్న పోలీసులు
ఇప్పటివరకు ఏర్పాటుకాని   యాంటీ చైన్ స్నాచింగ్ బృందాలు

 
 సాక్షి, గుంటూరు :  రాజధాని అమరావతి పరిధిలోని గుంటూరు, విజయవాడ నగరాల్లో గొలుసు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. మహిళలు కనిపిస్తే చోరులు రెచ్చిపోతున్నారు. ఆభరణాలను ధరించిన వారిని చంపడానికి సైతం వెనుకాడడం లేదు. కొన్నినెలలుగా విజయవాడ,గుంటూరులో ఇటువంటి సంఘటనలు ఎక్కువవుతున్నాయి. అయినాసరే పోలీసులు మాత్రం వీటిపై దృష్టి సారించడం లేదు. రాజధానిని ప్రకటించినప్పటి నుంచి బందోబస్తు, వీవీఐపీల సేవలో తరిస్తున్న పోలీసులు ఈ చోరీలను  పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో అంతర్‌రాష్ట్ర దొంగలు ఇక్కడ మకాం పెడుతున్నారు.

 అదే పని..
 విజయవాడలో నెలకు 20 నుంచి 25 చైన్‌స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. గుంటూరులో వీటి సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు గొలుసు దొంగలపట్ల అప్రమత్తంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. సీసీఎస్, బ్లూకోట్స్ టీంలతోపాటు మఫ్టీల్లో నిఘా పెడుతున్నారు. అయినా గుంటూరులో నెలకు పది వరకు గొలుసు దొంగతనాలు జరుగుతున్నాయి. ఆరు నెలల కిందటైతే రోజుకు 3 నుంచి 4 చైన్ స్నాచింగ్ సంఘటనలు జరిగేవి. దీంతో ఆభరణాలు ధరించి బయటకు రావడానికి మహిళలు జంకే పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు పెరుగుతున్న నేరాలతో అర్బన్ జిల్లా పోలీస్‌లకు కునుకు ఉండడంలేదు. ప్రజల్లో పరువు పల్చబడుతుండడంతో ఏంచేయాలో తెలీయక తలలు పట్టుకుంటున్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో నూతన రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ మొదలు పెట్టినప్పటి నుంచి విజయవాడ, గుంటూరు నగరాల్లో వీవీఐపీల పర్యటనలు అధికమయ్యాయి. దీంతో పోలీసులు వీవీఐపీల భద్రత, సభలు, సమావేశాల సందర్భంగా బందోబస్తులు, వివిధ పార్టీల ఆందోళనల నేపథ్యంలో అదే పనిపై విధులు నిర్వహిస్తున్నారు. దీంతోబయట ప్రాంతాలనుంచి దొంగల ముఠాలు సులువుగా ఈ రెండు ప్రాంతాల్లోకి దిగుతున్నాయి.

 యాంటీ చైన్‌స్నాచింగ్ టీంలేవి?
  చైన్‌స్నాచింగ్‌లు అధికంగా జరుగుతున్నా యాంటీ చైన్‌స్నాచింగ్ టీంలను అధికారులు ఏర్పాటు చేయలేదు. గుంటూరులో కమిషనరేట్ ఏర్పాటైతే స్టేషన్‌లు పెరగడంతోపాటు, సిబ్బంది పెరిగే అవకాశం ఉంది. అయితే కమిషనరేట్ ఏర్పాటు ఏడాదిగా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఉన్న సిబ్బంది చాలక నేరాల నియంత్రణ సవాల్‌గా మారింది. రాజధాని అయ్యాక తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్ట ప్రాంతంలో సీఎం చంద్రబాబు నివసిస్తున్నారు. దీంతో అర్బన్ జిల్లా పరిధిలోని ఒక్కో స్టేషన్ సీఐ ఆయన ఇంటి వద్ద విధులు నిర్వర్తిస్తుండడంతో సిబ్బంది సమస్యలు మరింత పెరుగుతున్నాయి. ఆభరణాల చోరీల ముఠాలు విజయవాడ, గుంటూరు నగరాల్లో పెరగకుండా పోలీసులు  దృష్టిపెట్టాల్సి ఉంది.

మరిన్ని వార్తలు