ముగ్గురికి డౌటే..

28 Feb, 2014 00:56 IST|Sakshi
ముగ్గురికి డౌటే..
  • జిల్లా నుంచి ఇద్దరికే టికెట్ ఛాన్స్
  •      ముత్తంశెట్టి, చింతలపూడిలకువ్యతిరేకంగా నివేదిక
  •      చక్రం తిప్పిన గంటా
  •      కన్నబాబుకు లభించని హామీ
  •      బాబును కలిసిన గంటా బృందం
  •      3న దేశంలో చేరికకు ముహూర్తం?
  •  సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పదవే పరమావధిగా రాజకీయాలు చేస్తున్న  గంటా శ్రీనివాసరావు బృందంలో టికెట్ చిచ్చు రేగుతోంది. ప్రజారాజ్యం శాసనసభ్యులుగా ఎంపికై కాంగ్రెస్‌లో కొనసాగుతున్న గంటా బృందం రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకొన్న సంగతి తెలిసిందే. గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, ముత్తంశెట్టి శ్రీనివాస్‌లతో పాటు యలమంచిలి శాసనసభ్యుడు యూవీ రమణమూర్తి(కన్నబాబు) గు రువారం హైదరాబాద్‌లో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిశారు.

    అంతవరకూ బాగానే ఉన్నా గంటా రాజకీయం కారణంగా చంద్రబాబును కలసిన వారిలో ముగ్గురికి జిల్లానుంచి పోటీ చేసేందుకు హామీ లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు బాబులకు టికెట్ హామీ లభించగా, మిగిలిన ముగ్గురి భవితవ్యం గందరగోళంలో పడింది. ప్రతి ఎన్నికలోనూ సీటును మార్చే గంటా శ్రీనివాసరావు ఈ పర్యాయం భీమిలి లేదా గాజువాక  నుంచి పోటీ చేసే ఉద్దేశంతో పీఆర్‌పీ సహచరులైన ప్రస్తుత శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్,చింతలపూడి వెంకట్రామయ్యలకు వ్యతిరేకంగా నివేదికలు ఇప్పించారని తెలిసింది.

    తెలుగుదేశంలో కీలకభూమిక పోషిస్తున్న రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌ల ద్వారా గంటా ఈ వ్యవహారాన్ని నడిపించారని తెలుగుదేశం నేతలే ఆరోపిస్తున్నారు. మంత్రిగా పనిచేసిన గంటా కంటే ఎక్కువగా తమ  నియోజక వర్గాల్లో వందల కోట్లతో అభివృద్ది పనులు చేయించిన వెంకట్రామయ్య, శ్రీనివాస్‌లకు వారి నియోజక వర్గాల్లో వ్యతిరేకత వుందన్న నివేదికలు గంటా బృందంలో విబేధాలను పెంచుతున్నాయి. ఈ నివేదిక ఆధారంగా వెంకట్రామయ్య తెలుగుదేశంలో చేరినప్పటికీ టికెట్ వుండదని ప్రచారం జరుగుతోంది.

    ఇక ముత్తంశెట్టి శ్రీనివాస్ భీమిలి నుంచి గాక విజయనగరం జిల్లా నెల్లిమర్ల లేదా చీపురుపల్లి నియోజక వర్గాల నుంచి పోటీ చేయించాలని సూచించడం కూడా వివాదాస్పదంగా మారింది. వెంకట్రామయ్య, శ్రీనివాస్‌లకు వ్యతిరేకంగా ఇచ్చిన నివేదికలో అనకాపల్లినుంచి గంటా వ్యాపార భాగస్వామి అయిన పరుచూరి భాస్కరరావు అభ్యర్ధి అయితే బాగుంటుందని సూచించడం గంటా మార్కు రాజకీయానికి నిదర్శనంగా మారింది. దుందుడుకువైఖరి, వివాదాస్పద నిర్ణయాలతో అనకాపల్లివాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న భాస్కర్‌కు పెద్దపీట వేసి వెంకట్రామయ్య, శ్రీనివాస్‌లను తప్పించడం గంటా బృందంలో విబేధాలను పెంచుతోంది. పలు కుంభకోణాల్లో, కేసుల్లో చిక్కుకొన్న యలమంచలి శాసనభ్యుడు కన్నబాబు మరో గత్యంతరం లేక టికెట్ హామీతో సంబంధం లేకుండానే చంద్రబాబును కలిశారు. అవకాశం ఇస్తే అనకాపల్లి ఎంపీ సీటుకు సిద్ధమని కన్నబాబు చెబుతున్నా తెలుగుదేశం అధినేత నుంచి  స్పందన రాలేదు.
     
    గంటాతోపాటు నలుగురు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో మార్చి మూడో తేదీన చేరనున్నారు. ముందుగా పార్టీ విశాఖలో మహిళా గర్జన సదస్సు నిర్వహిస్తున్న ఎనిమిదిన చేరాలనుకొన్నా, ఆ సమావేశం మహిళలకు  ఉద్దేశించినదన్న కారణంగా ముహూర్తాన్ని ముందుకు జరిపారు. మూడవ తేదీన చంద్రబాబు విశాఖ వచ్చే అవకాశం లేకపోవడంతో వీరే హైదరాబాద్ వెళ్లి పార్టీలో చేరనున్నారు.
     

>
మరిన్ని వార్తలు