ఆయనది యూజ్ అండ్ త్రో విధానం

19 May, 2017 19:37 IST|Sakshi


పట్టిసీమ ప్రాజెక్టు కింద పరిహారం రూపేణా నూజివీడులో ఎకరాకు రూ. 52లక్షలు ఇస్తే, వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు మాత్రం కేవలం లక్ష రూపాయలే ఇచ్చారని, వెనకబడిన శ్రీకాకుళం జిల్లాను మరింత వెనక్కి నెట్టేస్తున్నారని నిర్వాసితులు వాపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది యూజ్ అండ్ త్రో విధానమని మండిపడ్డారు. వంశధార నిర్వాసితులతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన ముఖాముఖిలో పలువురు తమ సమస్యలను వెల్లడించారు.

ఇళ్లు కూల్చేయాలని మంత్రి బెదిరిస్తున్నారు
2004లో వైఎస్ వచ్చాక వంశధార ప్రాజెక్టుతో జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్నారు. అప్పటి పరిస్థితులను బట్టి ఎకరాకు లక్ష చొప్పున నష్టపరిహారం ఇచ్చారు. ఆ తర్వాత పునరావాసం కల్పించాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలి. కొన్ని గ్రామాలకు వైఎస్ హయాంలో పునరావాసం కల్పించారు. మిగిలిన గ్రామాలకు కూడా అన్ని మౌలిక సదుపాయాలతో భూమి ఇస్తామన్నారు. టీడీపీ వచ్చిన తర్వాత ఇంతవరకు పునరావాసం లేదు.. ప్రాజెక్టు కట్టి నీళ్లు పెట్టేసి పని పూర్తి చేశామని చెప్పాలనుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు రేట్లు పెంచినపుడు రైతులకు ఎందుకు పెంచరు? అప్పుడు 53వేలతో ఇళ్లు కట్టారని, ఇప్పుడు కూడా అంతే ఇస్తామని చెబుతున్నారు.. ఇప్పుడు ఎవరైనా 53వేలతో ఇళ్లు కట్టగలరా? మేం ఇప్పటివరకు ఏ గ్రామం ఖాళీ చేయలేదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇస్తే తప్ప ఇక్కడినుంచి కదిలేది లేదు. ఇళ్లు కూల్చేయాలని, కరెంట్ కట్ చేయాలని మంత్రి అంటున్నారు.
శ్రీనివాస్, కురగాం

గ్రామసభలకు డీఎస్పీ అవసరమా?
మాకు ఎకరాకు లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు పట్టిసీమకు సంబంధించి నూజివీడులో ఎకరాకు 52 లక్షలు ఇచ్చారు. కేవలం శ్రీకాకుళం జిల్లా అని ఇలా వివక్ష చూపిస్తున్నారు. మేం కొనాలంటే ఇప్పుడు 15 లక్షలకు కూడా దొరకదు. ఇక్కడ ఉన్నవాళ్లంతా 2, 3 ఎకరాలున్న చిన్న, సన్నకారు రైతులే. రైతులంతా ఇప్పుడు కూలీలుగా మారిపోయారు. 2004 నుంచి ఇప్పటివరకు విడతల వారీగా ఇవ్వడంతో అవన్నీ ఖర్చయిపోయాయి తప్ప ఎవరిదగ్గరా పైసా లేదు. దాంతో అంతా బిచ్చమెత్తుకుంటున్నారు. భూముల ప్యాకేజిలు అయిపోయాయి, యూత్ ప్యాకేజి మాత్రమే ఇస్తామంటున్నారు. గ్రామసభల్లో పోలీసులను తీసుకొచ్చి డీఎస్పీని పెట్టి వాళ్లు చెప్పినవారికే ప్యాకేజిలు ఇస్తున్నారు. వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే ఎమ్మార్వోలు కూడా పోలీసులను పిలిపిస్తున్నారు. మేమేమైనా ఉగ్రవాదులమా, తీవ్రవాదులమా? కోరుకున్న చోట ఇళ్లస్థలం ఇస్తామని అప్పట్లో వైఎస్ చెప్పారు. కానీ ఇప్పుడు తాము ఇచ్చినచోటకు వెళ్లండి, లేకపోతే 4 లక్షలు తీసుకొమ్మంటున్నారు. 12 ఏళ్లుగా ఆ గ్రామాల్లోనే ఉంటున్నాం. కనీసం రోడ్లు వేయమంటే నిర్వాసితులు కాబట్టి ఎలా ఉన్నారో అలాగే బతకమంటున్నారు. పనులేవీ జరగవని చెబుతున్నారు.
-రవి, పాడలి నిర్వాసితుడు

బతకాలా.. చావాలా?
నాకు కంటిచూపు లేదు. నేను తల్లిదండ్రుల వద్ద ఉంటున్నానని నాకు ప్యాకేజి ఇవ్వమని చెబుతున్నారు. మా నాన్న వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మాకు ప్యాకేజి ఇవ్వట్లేదు. ఇక బతకాలో, చావాలో కూడా అర్థం కావట్లేదు
-చంద్రమ్మ


కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సిందే
మా పొలం, స్థలం అన్నీ తీసుకున్నారు. మా పక్క ఇల్లు కూడా తీసుకున్నారు గానీ మా ఇల్లు కొలత వేయలేదు. ఇప్పుడు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. మా నాన్నకు పెన్షన్ కూడా తీసేశారు. నడవగలరు, పనిచేయగలరని పెన్షన్ ఆపేశారు. కానీ ఆయన ప్రమాదంతో గాయపడటంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు.
-రాళ్ల పార్వతి, హిరమండలం

అన్ని ప్రాజెక్టులలాగే మాకూ ఇవ్వాలి
ప్రభుత్వం ఒక ప్రాజెక్టు కట్టేటపుడు ప్రజల బాధలు తీర్చాలి గానీ తీర్చడం లేదు. సమస్యలు చెప్పుకొనే అవకాశం కూడా ఇవ్వడం లేదు. వంశధార నిర్వాసితుల సమస్యపై 5 నెలల 11 రోజులు దీక్షలు చేశాం. ఏయే ప్రాజెక్టుకు ఎంత చొప్పున ఇస్తున్నారో మాకు కూడా అంతే ఇవ్వాలి. నాకు రెండెకరాల భూమి ఉండేది. పెళ్లయిపోయిన ఆడ పిల్లలకు యూత్ ప్యాకేజి ఇవ్వట్లేదు. వికలాంగుల జీవో అమలుచేస్తామని అన్నారు, 1500 పెన్షన్ ఇస్తామని చెప్పారు గానీ ఏమీ లేదు. వికలాంగుల వినతిపత్రాలు పట్టించుకోవడం లేదు. నాయకుల తరఫున వెళ్లినవారికే పనులు చేస్తున్నారు.
-గేదెల సింహాచలం, వికలాంగుడు, తులగాం

అమావాస్య నాడు అర్ధరూపాయి, పున్నమి నాడు పావలా
నాకు పదిహేడున్నర ఎకరాలు పోయింది. ప్రాజెక్టును మేం ఎవరమూ వ్యతిరేకించలేదు. సక్రమమైన పరిష్కారం ఇవ్వాలనే కోరుతున్నాం. ఎలా ఇచ్చినా నిర్వాసితులు ఊరుకుంటారన్న ఉద్దేశంతో ప్రభుత్వం బాధ్యతారహితంగా ఉంటోంది. ప్రతి విషయంలో మాకు అన్యాయం జరిగింది. 2006లో సామాజిక సర్వే జరిపిన తర్వాత 7వేల కుటుంబాలు ప్రభావితం అవుతాయన్నారు. కానీ అసలు ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. వలసలు వెళ్లడం వల్ల వాళ్లు సర్వేలో పాల్గొనలేదు. నేటికీ వాళ్లు ప్రతి గ్రామంలో అనామకులుగానే ఉన్నారు. ఆ కుటుంబ యజమానులతో పాటు ఆయా కుటుంబాల్లో పిల్లలకు కూడా ప్రయోజనాలు అందట్లేదు. కొంతమందికి మాత్రమే పునరావాసం కల్పించారు. అమావాస్య నాడు అర్ధరూపాయి, పున్నమినాడు పావలా చొప్పున ఇస్తున్నారు. డబ్బులు కాకుండా పునరావాసం స్థలం ఇచ్చి, ఇళ్లు కట్టిస్తే నిర్వాసితులకు సమస్యలు ఉండేవే కావు. రైతులందరూ బైతులయ్యారు తప్ప ఏ కుటుంబమూ గతంలో ఉన్నట్లు లేదు. ఒక బృహత్తర కార్యక్రమంలో మేమంతా సమిధలమయ్యాం. మా ఇంటికి డబ్బులు ఇవ్వాలంటే లోక్ అదాలత్‌కు రమ్మంటున్నారు. మా గుమ్మం దగ్గరకు వచ్చి ఇవ్వాలి. ప్రాజెక్టులో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా అర్హులే. అంతేతప్ప 18 ఏళ్లు నిండితేనే యూత్ ప్యాకేజి ఇస్తామనడం సరికాదు. వయసు, సర్టిఫికెట్లు చూడటానికి ఇవేమైనా ఉద్యోగాలా? ఇళ్ల కోసం యూత్ ప్యాకేజి కింద 5 సెంట్ల భూమి, 53వేలు ఇస్తామని తొలుత అన్నారు. భూమి ఇవ్వలేక 5 లక్షలు ఇస్తామన్నారు. తర్వాత దాన్ని కూడా సరిగా ఇవ్వలేదు. అందరికీ న్యాయం చేయాలి. ఏ సమస్యకూ పూర్తి పరిష్కారం చేయకుండానే వేరే సమస్య వైపు వెళ్లిపోతున్నారు. ఈ నియోజకవర్గంలోనే పక్కన వేరే ప్రాజెక్టులకు 2013 ప్యాకేజి ఇస్తున్నారు.. దానికి మేం కూడా అర్హులం.
-పోలినాయుడు, దుగ్గుపురం

చంద్రబాబుది యూజ్ అండ్ త్రో విధానం
మా భూమి అంతా వాళ్లకిచ్చి, భూములను సస్యశ్యామలం చేయమని మేం చెబితే ఇప్పుడు మమ్మల్ని సర్వనాశనం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు యూజ్ అండ్ త్రో విధానం పాటిస్తున్నారు. పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌లను వాడుకున్నారు. ఇప్పుడు లోకేష్‌ను మంత్రిగా చేశారు. అలాగే ఎన్నికల సమయంలో వికలాంగులకు ప్యాకేజి ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేశారు.
-బాలరాజు, వికలాంగుడు

మరిన్ని వార్తలు