పోలవరం వేగం పెరగాలి

25 Dec, 2018 04:02 IST|Sakshi
పోలవరం ప్రాజెక్ట్‌ క్రస్ట్‌ గేటుకు పూజలు చేస్తున్న సీఎం చంద్రబాబు

పోలవరం బాధ్యతలు దక్కించుకునే వరకూ తట్టెడు మట్టీ తొలగించలేదు.. ఆ తర్వాత పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు

అక్రమాలు, జాప్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు వరుసగా రియాలిటీ షోలు

అదే కోవలో తాజాగా గేట్ల పనులకు ప్రారంభోత్సవం

సీఎం పర్యటనలు, రివ్యూల ఖర్చు రూ.100 కోట్లు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగాలని సీఎం చంద్రబాబు సూచించారు. సోమవారం పోలవరంలో 41వ గేటు ఏర్పాటు పనులను ప్రారంభించిన చంద్రబాబు రైతులతో సమావేశం, అధికారులతో నిర్వహించిన సమీక్షలోనూ మాట్లాడారు. ఆర్నెళ్ల వ్యవధిలో కోటి క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం రికార్డును నెలకొల్పుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మట్టి తవ్వకంలోనూ ప్రపంచ రికార్డు దిశగా అడుగులు వేయాలన్నారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం పనులు 2019 మే నాటికి పూర్తి చేయాలని, స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులు 2019 ఏప్రిల్‌ నాటికల్లా పూర్తి చేయాలని పేర్కొన్నారు. మొత్తం మీద ప్రాజెక్టు  పనులు ఇప్పటి వరకు 62.86 శాతం పూర్తి చేయడంపై అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను అభినందిస్తున్నట్లు ప్రకటించారు. పనులు వేగంగా చేసేందుకు యంత్ర సామగ్రిని అదనంగా 125 శాతం సమకూర్చుకోవాలన్నారు. కాంక్రీట్‌ పనుల నిర్వహణలో త్రివేణి సంస్ధ పనితీరు తక్కువగా కనపడుతోందని,  ఇది మరింతగా పెరగాలని సూచించారు. ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి తమకు రావాల్సిన రూ.74 కోట్లు ఇప్పించాలని ఈ సందర్భంగా త్రివేణీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. కాంక్రీట్‌ పనులను వేగవంతం చేసుకునేందుకు బేకం కంపెనీతో నవయుగ, త్రివేణి సంస్ధలు సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు, స్పిల్‌ వే నిర్మాణం, లెఫ్ట్‌ ప్లాంక్‌ పైలెట్‌ చానల్, అప్రోచ్‌ ఛానల్, కాంక్రీట్‌ పనులు, తవ్వకం పనులు ఒకవైపు చేస్తూనే మరోవైపు 48 గేట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పైలెట్‌ ఛానల్‌ తవ్వకం, స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్‌ పనులు మార్చి నాటికి పూర్తి చేయాలన్నారు. డ్యాం డిజైన్లకు సంబంధించి   సీడబ్ల్యూసీ వద్ద 10, జలవనరుల శాఖ వద్ద 1, ఏజెన్సీల వద్ద 7 పెండింగ్‌లో ఉన్నాయని, ఇవి త్వరగా ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు.  ఆర్‌అండ్‌ఆర్‌ అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉభయ గోదావరి కలెక్టర్లకు సీఎం సూచించారు. 

మోదీ గుజరాత్‌కే ప్రధానా?
నరేంద్ర మోదీ కేవలం గుజరాత్‌కే ప్రధానమంత్రిలా వ్యవహరిస్తున్నారని, పోలవరం ప్రాజెక్టు పట్ల చిన్నచూపు చూస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును 2019లో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని చెప్పారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును కట్టిన సమయంలో ఇద్దరు ప్రధానమంత్రులు వచ్చి పరిశీలించారని, పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టు కడుతుంటే ప్రధాని ఒక్కసారి కూడా రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ సమావేశమై పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు చర్చలు జరపడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, జవహర్, ఎంపీ తోట సీతారామలక్ష్మి,  జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్,  ఇంజనీరు ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు కాటంనేని భాస్కర్, కార్తికేయ మిశ్రా, ఎస్పీ ఎం.రవిప్రకాష్, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు, పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఈ వి.శ్రీధర్, ప్రాజెక్టు కన్సల్టెంట్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు