అవినీతిలోనూ, అభివృద్ధిలోనూ ఏపీ నం.1

21 Mar, 2017 02:32 IST|Sakshi
అవినీతిలోనూ, అభివృద్ధిలోనూ ఏపీ నం.1

తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టిస్తే హక్కుల తీర్మానం పెడతా: చంద్రబాబు

సాక్షి, అమరావతి: దేశంలో అవినీతిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్న అంశాన్ని శాసనసభ సాక్షిగా సీఎం చంద్రబాబునాయుడు సగర్వంగా ప్రకటించుకున్నారు. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం సోమవారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ... అవినీతిలోనూ, అభివృద్ధిలోనూ భారతదేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని చెప్పారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని.. అలాంటి నగరాన్ని విడిచి రావడం బాధగా ఉందని చెప్పారు. రాజధాని లేకుండా అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించినా... దేశంలో రెండంకెల వృద్ధి రేటు సాధించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపానని తెలిపారు.

రాష్ట్ర స్థూల ఉత్పత్తితో రాష్ట్రం 2014–15లో 8.55 శాతం వృద్ధి రేటు సాధిస్తే.. 2015–16లో 10.99 శాతం, 2016–17లో 11.61 శాతం అభివృద్ధి సాధించిందన్నారు. రాష్ట్రాభివృద్ధికి తాను కృషి చేస్తుంటే.. ప్రతిపక్షం తప్పుడు లెక్కలతో సభను తప్పుదోవ పట్టిస్తోందని.. సభా హక్కుల తీర్మానం పెట్టి చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, చంద్రబాబు తన మనవడు దేవాన్ష్‌ పుట్టిన రోజు సందర్భంగా టీటీడీ నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.25 లక్షలు విరాళం ఇచ్చినట్లు టీటీడీ తెలిపింది.

మరిన్ని వార్తలు