ఎన్నాళ్లీ..అరకొర బోధనం..!

13 Mar, 2019 07:19 IST|Sakshi

చంద్రబాబు ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నీరుగారుస్తుండటంతో లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఇస్తున్న అరకొర రీయింబర్స్‌ సకాలంలో విడుదల చేయకపోవడంతో ఎంతో ఆవేదన చెందుతున్నారు. బకాయిలు కాలేజీలకు సకాలంలో జమకాకపోవడంతో.. యాజమాన్యాలు కోర్సు పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. దీంతో ఉన్నత విద్య, ఉద్యోగాకాశాలను కోల్పోతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువు పూర్తిచేసుకొని ఉద్యోగంలో చేరాలని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థులకు ప్రభుత్వ తీరు పిడుగుపాటుగా మారింది. ముఖ్యంగా ఇంజనీరింగ్‌ కాలేజీల విద్యార్థులు ఎక్కువగా నష్టపోతున్నారు.  

వైఎస్‌హయాంలోపూర్తిస్థాయిలో
దివంగత సీఎం వైఎస్సార్‌ ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదవాలనే గొప్ప ఆశయంతో 2004లో రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. వైఎస్‌ పాలనలో ప్రతి పేద విద్యార్థికి ప్రభుత్వమే పూర్తి ఫీజు చెల్లించేది. కాని ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగారుస్తోంది.  ఆయా కోర్సులకు గరిష్టంగా రూ.35 వేలు మాత్రమే ఫీజురీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తోంది. వాస్తవానికి సాంకేతిక విద్యాశాఖ కమిటీ సిఫార్లు మేరకు మరో రూ.30 వేలు అంటే.. మొత్తంగా ఏటా రూ.65 వేలు చెల్లించాలి. అయితే ప్రభుత్వం రూ.10వేలు మాత్రమే పెంచి గరిష్టంగా ఫీజురీయింబర్స్‌మెంట్‌ను రూ.45 వేలకు పరిమితం చేసింది. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పేద విద్యార్థుల ఫీజురీయింబర్స్‌ పెంపునకు సంబంధించి కమిటీ వేసి.. ఆ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా అమలు చేయాల్సిన ప్రభుత్వం వాటిని బుట్టదాఖలు చేస్తోంది.

భారీగా పెరుగుతున్న ఫీజులు
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన ఫీజులు భారీగా పెంచింది. 2016–17 నుంచి 2018–19 వరకు మూడేళ్లకు కనిష్టంగా రూ.35 వేలు, గరిష్టంగా రూ.1.25 లక్షలు వసూలు చేసేందుకు అవకాశం కల్పించింది. ఆయా కోర్సుల ఫీజులు పరిశీలిస్తే.. బీఫార్మసీలో కనిష్టంగా రూ.35వేలు, గరిష్టంగా రూ.90 వేలుగా ఉంది. అలాగే డీ ఫార్మసీలో కనిష్టంగా రూ.68 వేలు, గరిష్టంగా రూ.1.25 లక్షలు చెల్లించాలి. ఎంటెక్‌ కనిష్ట ఫీజును రూ.55 వేలుగా.. గరిష్ట ఫీజును రూ.1 లక్షగా నిర్ణయించారు. ఎంబీఏలో గరిష్ట ఫీజు రూ.68 వేలు, ఎంసీఏలో  రూ.65 వేలుగా పెంచారు. పాలిటెక్నిక్‌ కోర్స్‌లకు రూ.15 వేలు ఉన్న ఫీజు.. గతేడాది రూ.25 వేలకు ప్రభుత్వం పెంచింది. పలు కోర్సుల గరిష్ట ఫీజును రెట్టింపు చేసింది. కాని ఫీజురీయింబర్స్‌మెంట్‌ను మాత్రం పెంచలేదు.

సక్రమంగా చెల్లించని వైనం
ఆ ఇస్తున్న అరకొర ఫీజురీయింబర్స్‌ను కూడా చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు. దాంతో  కోర్సు పూర్తయిన తరువాత విద్యార్థులకు ఆవేదనే మిగులుతోంది. కోర్స్‌ పూర్తయిన తరువాత సర్టిఫికెట్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఎంతో మంది ఇంజనీరింగ్‌ తదితర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు చేతికి అందటం లేదు. ఎంబీఏ పూర్తి చేసి.. సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతూ కనిపిస్తున్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌ బకాయిలు చెల్లించకపోవడంతోసర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపివేశారని వాపోతున్నారు.  వాస్తవానికి ప్రస్తుతం ఓ విద్యార్థి ఇంజనీరింగ్‌ కోర్సు కోర్సు పూర్తిచేయాలంటే సంవత్సరానికి కనీసం లక్షకు పైగా ఖర్చు అవుతోంది. అలాగే ఎంబీబీఎస్, ఏజీబీఎస్, ఎంవీఎస్‌ వంటి కోర్సుల్లో సంవత్సరానికి కనీసం రెండు లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది.  

పదివేలు పెంచడంపైఅభ్యంతరమెందుకు?!   
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.65 వేలు చెల్లించాలని సాంకేతిక విద్యాశాఖ కమిటీ అధ్యయనం చేసి ఇచ్చిన నివేదికలో సిఫార్సు చేసింది. అయినా   ప్రభుత్వం మాత్రం ఇటీవల కేవలం పదివేలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఓ వైపు కాలేజీలు భారీగా ఫీజులు పెంచుకునేందుకు అనుమతిస్తూ.. మరోవైపు అరకొరగా  ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడంపై విద్యార్థుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ఆ ఇస్తున్న కొద్ది మొత్తం కూడా సకాలంలో విడుదల చేయడం లేదు. దాంతో కోర్సు పూర్తయినా.. కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వక విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగాకాశాలు పోగోట్టుకుంటున్నారు.  
–జి.పి. వెంకటేశ్వర్లు, సాక్షి, అమరావతి

వైఎస్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రతి ఒక్క పేద విద్యార్థి ఉన్నత చదువులు చదివి డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలనే సదాశయంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టారు. 2004లో వైఎస్‌ అధికారంలోకి రాగానే ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలతోపాటు బీసీ, ఈబీసీలందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తిస్థాయిలో ఇచ్చారు. నాడు ఫీజు ఎంతుంటే అంతమొత్తం ప్రభుత్వమే చెల్లించేది. దాంతో విద్యార్థి ఒక్క పైసా కూడా ఫీజలు చెల్లించాల్సిన అవసరముండేది కాదు.    

జగన్‌ హామీ ఏమిటి
ప్రతి పేద విద్యార్థి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించారు. నవరత్నాల్లో ఫీజు రీయింబర్స్‌ పథకానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ... ప్రతి పేద విద్యార్థికి పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌తోపాటు వసతి, భోజనం కోసం రూ.20వేల వరకూ అందిస్తామని హామీ ఇచ్చారు. ఫలితంగా ప్రతి పేద విద్యార్థికి ఏటా రూ.1లక్ష నుంచి లక్షన్నర వరకూ ప్రయోజనం చేకూరుతుంది!!

అప్పులు చేసిమరీ ఫీజు కట్టాల్సి వచ్చింది
నేను ఆటో డైవర్‌ని. నా కుమార్తె డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. విద్యా సంవత్సరం ముగిసినా ఫీజు రీయింబర్స్‌ చేయకపోవడంతో కాలేజీవాళ్లు ఫీజు కోసంఒత్తిడి తెస్తున్నారు. అప్పులుచేసి ఫీజు కట్టి హాల్‌ టికెట్‌ తెచ్చుకున్నాం.  –జలసూత్రం శ్రీనివాసులు,ఆటోడ్రైవర్, ప్రకాశం జిల్లా  

 చదువు కొనసాగించడం కష్టంగా ఉంది..
మా నాన్న బేల్దారి మేస్త్రి.. అమ్మ కూలీ. నేను గూడూరులోని ఇంజినీరింగ్‌ కళాశాలలో డిప్లోమో సెకండియర్‌ చదువుతున్నాను. రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.15 వేలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో అప్పుచేసి ఫీజు చెల్లించాల్సి వస్తోంది. యాజమాన్యం తీవ్ర ఒత్తిడి తెస్తుండటంతో చదువు కొనసాగించడం కష్టంగా ఉంది.   – నార్ల కార్తీక్, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా

నానా అగచాట్లుపడుతున్నాం.. 
నేను తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్నాను. వేలాది రూపాయలు చెల్లించి కార్పొరేట్‌ కళాశాలల్లో చదివే స్థోమత లేకపోవడంతో టీటీడీ కళాశాలలో చదువుతున్నాను. అయినప్పటికీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌ చేయకపోవడంతో నాలాంటి పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక నానా అగచాట్లుపడుతున్నారు. మా కళాశాలలో నాతోపాటు చాలా మందికి ఇప్పటికీ ఫీజు రీయింబర్స్‌ కాలేదు. పేద విద్యార్థులకు ఈ ఫీజుల కష్టాలు తొలగిపోవాలంటే.. వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది.  – వై.శివకృష్ణయాదవ్, ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, తిరుపతి, చిత్తూరు జిల్లా

విద్యార్థులపై ఫీజుల పెను భారం ఇలా..

రాష్ట్రంలో ఫీజురీయింబర్స్‌మెంట్‌కుఅర్హులైన ఇంజనీరింగ్‌ విద్యార్థులు                   90,000

వాస్తవంగా ప్రభుత్వం వీరికి ఏటా చెల్లించాల్సిన మొత్తం (సగటున లక్ష అనుకుంటే) 900కోట్లు

ప్రభుత్వం ఇచ్చామంటున్న మొత్తం(ఇదీ సకాలంలో ఇవ్వడంలేదు)                   315కోట్లు

విద్యార్థులపై అదనంగాపడుతున్న భారం                                                     585కోట్లు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైనఇతర కోర్సుల విద్యార్థుల సంఖ్య                    15,10,054

వాస్తవంగా వీరికి ప్రభుత్వం ఏటాచెల్లించాల్సిన మొత్తం(సగటు ఫీజు రూ.40వేలు అనుకుంటే)6,040.22కోట్లు

ప్రభుత్వం ఇచ్చామంటున్న మొత్తం (ఇదీ సకాలంలో ఇవ్వడంలేదు)                  2,240కోట్లు

విద్యార్థులపై అదనంగాపడుతున్న భారం                                                     3,800.22కోట్లు

మొత్తంగా ఏటా విద్యార్థులపై పడుతున్న భారం                                              4,385.22 కోట్లు

మరిన్ని వార్తలు