అమ్మఒడి.. చదువు చేమూత | Sakshi
Sakshi News home page

అమ్మఒడి.. చదువు చేమూత

Published Wed, Mar 13 2019 7:26 AM

To Get Out Of Poverty, Mahaneta YS Rajasekhara Reddy Always Wanted To Be Education - Sakshi

సాక్షి,కడప: ‘చదువు ఉంటే సమస్తం మన దగ్గరికే వస్తాయి. అక్కా చెల్లెళ్లలకు ఒక విషయం చెబుతున్నా. ఒక ఇంట్లో ఒక ఇంజినీరు, మరొక ఇంట్లో ఒక డాక్టరు, ఇంకొక ఇంట్లో ఉన్నతద్యోగి అయితే.. ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయట పడతాయని మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ అంటుండేవారు. నాన్నను స్ఫూర్తిగా తీసుకుని చెబుతున్నా..  పేదల కోసం ఆయన ఒకడుగు ముందుకు వేశారు. జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తాడని హామీ ఇస్తున్నా.. మీ పిల్లలను ఏ చదువులు చదివిస్తారో మీ ఇష్టం.

ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా నేను ఇస్తానని మాట ఇస్తున్నా. పిల్లలను ఉచితంగా చదివిస్తా. అంతే కాదు ఆ పిల్లలు హాస్టల్లో ఉండి చదవాలన్నా చదువుకోవచ్చు. పిల్లలను చదివించడమే కాకుండా హాస్టల్‌లో ఉన్న పిల్లలకు మెస్‌ చార్జీల కింద ఏడాదికి రూ.20 వేలు అందిస్తాం.  ప్రతి తల్లికి చెబుతున్నా మీరు చేయాల్సినదంతా మీ పిల్లలను బడులకు పంపడమే. బిడ్డను బడికి పంపిన వారికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తానని హామీ ఇస్తున్నా’ అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు ప్రకటించిన సందర్భంలో చెప్పారు. ఈ పథకం పేరు అమ్మబడి అని ఆయన ప్రకటించారు.

బద్వేలు : చదువుకున్న వ్యక్తి మహాశక్తి. ఇంటినే కాదు సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దగలడు. కానీ రాష్ట్రంలో 75 శాతం మంది విద్యార్థులు ఆర్థిక భారంతో ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. 2004లో సీఎం అయిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రతి ఇంటి నుంచి ఇంజినీర్లు, డాక్టర్లు తయారు కావాలని ఆశించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టారు. దీంతో పేద విద్యార్థులు సైతం ఉన్నత చదువులు చదివారు. కానీ ఆయన మరణానంతరం ఏర్పడిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేశాయి.

2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తిగా నిర్వీర్యం అయింది. చెల్లించే ఫీజులను తగ్గించారు. సవాలక్ష నిబంధనలు పెట్టారు. చాలా మంది చదువులు మానుకుంటున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో ఈ విషయాలను గమనించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి రాగానే.. కళాశాల ఫీజును మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని, చిన్నారిని బడికి పంపే ప్రతి తల్లికి రూ.15 వేలు, హాస్టల్‌లో ఉండి చదువుకునే విద్యార్థులకు రూ.20 వేలు అమ్మబడి కింద ఇస్తామని ప్రకటించారు. 

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతేడాది విజయవాడలో జరిగిన సభలో నవరత్నాల కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందులో చిన్నారుల భవితకు భద్రత, భవిష్యత్తుకు తోడ్పాటు అందించే అమ్మఒడి పథకం (పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు), ఉచిత విద్య, హాస్టల్‌ విద్యార్థులకు రూ.20 వేలు ఆర్థిక సాయమందిస్తామని ప్రకటించారు. దీంతో జిల్లాలో వేలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య అందడంతోపాటు.. వారి వసతికి ఇబ్బంది తప్పే పరిస్థితి రానుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ జగనన్న ప్రకటించిన అమ్మఒడి పథకం చిన్నారుల చదువు, భవిష్యత్తుకు అండగా మారనుందని వారు చెబుతున్నారు.

గొప్ప విషయం
బిడ్డలను బడికి పంపిన ప్రతి తల్లికీ రూ.15 వేలు ఇస్తామని జగనన్న ప్రకటించడం సంతోషం. సంపాదించేదంతా పిల్లల చదువులకే సరిపోవడం లేదు. అప్పులు చేయాల్సి వస్తోంది. ఇంట్లోని భార్య, భర్త ఇద్దరూ కష్టం చేసినా.. పిల్లలను పెద్ద చదువులు చదివించాలంటే ఆందోళన చెందాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన అమ్మఒడి ప్రతి కుటుంబానికి ఆసరాగా నిలుస్తుంది. చాలా వరకు ఇబ్బంది తీరుతుంది.
–విద్యార్థి సాయి కళ్యాణ్‌తో తల్లి లక్ష్మీదేవి, మడకలవారిపల్లె

కేజీ నుంచి పీజీ వరకు ఉచితమే
కేజీ నుంచి పీజీ వరకు మెరుగైన విద్యను ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇస్తామనడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. వైఎస్సార్‌ బాటలో నడుస్తూ పేదల అభివృద్ధికి అమ్మ ఒడి పథకం ప్రకటించారు. ఆయన చెప్పిన పతకాలను అమలు చేస్తారనే నమ్మకం ఉంది. మాలాంటి పేదలకు ఈ పథకం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. పిల్లల చదువు కోసం శ్రమించే తల్లిదండ్రుల భారాన్ని తగ్గిస్తుంది. జగనన్న సీఎం కావాలని ప్రతి మధ్య తరగతి మహిళ కోరుకుంటోంది.
– విద్యార్థి సాదిక్‌, తల్లి బీబీ, దూదేకుల వీధి, బద్వేలు


విద్యార్థులకు బంగారు భవిత
ప్రస్తుతం చదువు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న చదువులు చదవాలన్నా డబ్బుదే ప్రధాన పాత్రగా ఉంది. మాలాంటి పేదవారు పిల్లలను చదివించాలంటే కష్టంగా ఉంది. పిల్లల చదువులకు నేనున్నానంటూ జగనన్న భరోసా కల్పిస్తున్నారు.
– విద్యార్థి లోహిత్‌కుమార్‌రెడ్డితో తల్లి సరస్వతి, బద్వేలు 

Advertisement
Advertisement