‘వైఎస్‌ జగన్‌కు ఎలా అపాయింట్‌మెంట్‌ ఇస్తారు’

8 Apr, 2017 20:09 IST|Sakshi
‘వైఎస్‌ జగన్‌కు ఎలా అపాయింట్‌మెంట్‌ ఇస్తారు’

విశాఖ : పార్టీ ఫిరాయింపులపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డంగా సమర్థించుకున్నారు. ఫిరాయింపులు తనకోసం కాదని... రాష్ట్ర భవిష్యత్‌ కోసం అంటూ కొత్త భాష్యం చెప్పారు. పైపెచ్చు పార్టీ ఫిరాయింపులు కొత్తగా జరిగాయా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు.

అసలు వైఎస్‌ జగన్‌కు ఎలా అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని చంద్రబాబు ఢిల్లీ పెద్దలను ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో ఫిరాయింపులపై ఎలా ఫిర్యాదు చేస్తారని ఆయన ఎదురుదాడి చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. నరేంద్ర మోదీని చూసి చాలామంది యువత బీజేపీలో చేరారని, అలాగే ఇక్కడ తనను చూసి చాలామంది టీడీపీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇస్తూ...‘గవర్నర్‌ను వైఎస్‌ జగన్‌ కలిసిన తర్వాతనే ఆపార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. పార్టీని విభేదించిన వారంతా టీడీపీలోకి వచ్చారు. పార్టీ ఫిరాయింపులు కొత్తగా జరిగాయా?. ఎన్డీయేలో ఎన్ని పార్టీలు ఉన్నాయి?. రాజ్యాంగం ప్రకారం సీఎం ఎవర్ని కోరుకుంటే వారిని మంత్రిగా తీసుకోవచ్చు.

అనర్హత అనేది స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలి. గత చరిత్రలో వాళ్లు ఎన్నిసార్లు మనుషులను తీసుకోలేదు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి తీసుకోలేదా?. అప్పుడు మీకు ఆనందం, ఇప్పుడు విభేదిస్తే మీకు బాధా?. విలువలు, చట్టాలపై చర్చ చేద్దాం.’ అంటూ వ్యాఖ్యలు చేశారు. త్వరలో విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయానికి టెండర్లు పిలుస్తామని చంద్రబాబు తెలిపారు.

మరిన్ని వార్తలు