చంద్రబాబు వర్సెస్‌ ఐజయ్య

22 Jun, 2017 01:41 IST|Sakshi
ఎమ్మెల్యే ఐజయ్య ప్రసంగాన్ని అడ్డుకుంటున్న సీఎం

- జైన్‌ ఇరిగేషన్‌కు భూ కేటాయింపులపై ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య
- భూములను ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలని అడగటంపై సీఎం ఆగ్రహం


సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రప్రభుత్వం యథేచ్ఛగా చేస్తున్న భూ కేటాయింపులపై  ప్రశ్నించిన వారిపై ఉక్కుపాదం మోపుతోంది. విపక్ష ఎమ్మెల్యేల గళాలను నులిమే యత్నం చేస్తోంది! సర్కారు భూ పందారానికి అడ్డుపడ్డ నందికొట్కూరు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఐజయ్యపై కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా  సీఎం చంద్రబాబు మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నిండు సభలో ప్రజల సాక్షిగా దళిత ఎమ్మెల్యే ఐజయ్యను చంద్రబాబు అవమానించారు.

అభివృద్ధిపై ఎమ్మెల్యేకూ సమాచారం ఇవ్వరట
నందికొట్కూరు నియోజకవర్గం తంగెడంచ వద్ద జైన్‌ ఇరిగేషన్‌ ఫుడ్‌పార్కుకు సీఎం బుధవారం శంకుస్థాపన చేశారు. అయితే జైన్‌ ఇరిగేషన్‌కు అప్పగించిన భూముల్లో ఏం చేయబోతున్నారో శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని ఎమ్మెల్యే ఐజయ్య డిమాండ్‌ చేశారు. జైన్‌ ఇరిగేషన్‌ సంస్థలకు ప్రభుత్వం ఎంత భూమి కేటాయించిందో తనకే తెలియదని, ఇక ప్రజలకు ఏంతెలుస్తుందని అనటంపై సీఎం ఆగ్రహించారు. దీంతో చంద్ర బాబు ఎమ్మెల్యే ఐజయ్య ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని అసహనం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే నియోజకవర్గంలోని ముచ్చుమర్రి సభలోనూ ఐజయ్య మాట్లాడుతుండగా సీఎం  మైక్‌ కట్‌ చేయించడం గమనార్హం.