చెత్త కుప్పలో ‘చంద్రన్న బీమా’

27 Oct, 2018 14:03 IST|Sakshi
తెనాలిలో లభించిన చంద్రన్న బీమా కార్డులు

తెనాలిలో చెత్త కుప్పలో భారీగా బీమా కార్డుల లభ్యం

ఇప్పటికీ ప్రైవేటు వ్యక్తుల వద్ద వేలాది కార్డులు

పథకంపై ప్రభుత్వ ప్రచారార్భాటమేనంటూ ప్రజల పెదవి విరుపు

బాధ్యులపై కఠిన చర్యలు : మున్సిపల్‌ కమిషనర్‌

గుంటూరు, తెనాలి రూరల్‌: ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన చంద్రన్న బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెట్టగా, రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ‘చంద్రన్న’ పేరు జోడించి, పథకాన్ని తామే ప్రవేశపెట్టినట్టు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరూ గొప్పలు చెప్పుకున్నారు. అంత హడావిడి చేసిన ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు అందాల్సిన బీమా కార్డులు తెనాలి పట్టణంలో చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. స్థానికులు గుర్తించి 210 కార్డులను అధికారులకు అందించారు.

వందల కార్డులు
పట్టణ మారీసుపేట మఠం బజారులో మున్సిపల్‌ ఎలిమెంటరీ స్కూలు ముందు రోడ్డు వెంబడి గార్బేజ్‌ కలెక్షన్‌ పాయింట్‌ ఉంది. చెత్త కుండీ వద్ద కొందరు కార్డులను ఏరుకుంటుండడాన్ని ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గమనించి, 210 కార్డులను అధికారులకు అందజేశాడు. అప్పటికే కొన్ని వందల కార్డులు గుర్తు తెలియని వారు తీసుకెళ్లారు. చంద్రన్న బీమాకు రూ.15 ప్రీమియం చెల్లించి కార్డు తీసుకోవాలి. 18 నుంచి 50 ఏళ్లలోపు వారికి సహజ మరణమైతే రూ.2 లక్షలు, 51 నుంచి 60 ఏళ్ల లోపు వారికి రూ. 30 వేలు చెల్లిస్తారు. మరణించిన పాలసీ దారుడి కుటుంబానికి రూ.ఐదు వేలు తక్షణ సాయం కింద ఇస్తారు. ప్రమాదవశాత్తు మరణం, పూర్తి అంగవైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.2.50 లక్షలు చెల్లిస్తారు. కార్మికుల పిల్లలు 9, 10 తరగతులు, ఇంటర్, ఐటీఐ చదివే వారికి(ఇద్దరు పిల్లలకు)రూ. 1200 స్కాలర్‌షిప్‌ కింద ఇస్తారు. ఈ పథకానికి సంబంధించి ప్రజల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించింది. సాధికార సర్వే ఆధారంగా ప్రీమియంను రెండేళ్లు ప్రభుత్వమే చెల్లించింది. లబ్ధిదారుల నుంచి రూ.30 వసూలు చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. అయితే కార్డులు అంద జేసి డబ్బులు వసూలు చేయాలన్నారు. ఈ డబ్బు కట్టేందుకూ ప్రజలు ఆసక్తి కనబర్చకపోవడం, రెండేళ్లు పూర్తవడంతో మూడో ఏడాది ప్రభుత్వం ఉచితంగా అందరికీ ప్రీమియం చెల్లించింది.

నిర్లక్ష్యానికి నిదర్శనం
చంద్రన్న బీమా తమ పేరిట ఉందీ లేనిదీ ఇప్పటికీ తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. లబ్ధిదారులందరికీ కార్డులు పంపిణీ చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. పురపాలక సంఘంలో మెప్మా విభాగం ఆధ్వర్యంలో చంద్రన్న బీమా ప్రీమియం చెల్లింపులు(ప్రారంభంలో), కార్డుల అందజేత జరుగుతుంది. ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో మొక్కుబడిగా కొందరికి కార్డులను ప్రజాప్రతినిధులు చేత ఇప్పించి, మిగిలిన వాటి పంపిణీ బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. వారు కార్డులను అందజేయడంలో తాత్సారం చేయడం, పర్యవేక్షించుకోవాల్సిన మెప్మా సిబ్బంది పట్టనట్టు వ్యవహరించడంతో లబ్ధిదారులకు కార్డులు చేరలేదు. పట్టణంలో 90 శాతం మందికి కార్డులు అందలేదని తెలుస్తోంది. ఇప్పుడు చెత్త కుప్పలో కార్డులు దర్శనమివ్వడంపై ఆర్భాటంగా ప్రచారం చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఏం సమాధానం చెబుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

బాధ్యులపై కఠిన చర్యలు
బీమా కార్డులు లబ్ధిదారులకు తప్పనిసరిగా అందించాలి. చెత్తకుప్పలో పడేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం.  ఇందుకు సంబంధించిన బాధ్యులెవరో విచారించి కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు వ్యక్తుల వద్దకు ఎందుకు వెళ్లాయో విచారిస్తాం.కె.శకుంతల, మున్సిపల్‌ కమిషనర్‌

మరిన్ని వార్తలు