అభిమాన రక్ష | Sakshi
Sakshi News home page

అభిమాన రక్ష

Published Sat, Oct 27 2018 2:05 PM

Guntur YSRCP Leaders Pray For YS Jagan Health - Sakshi

ప్రజాబాంధవుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కత్తితో హత్యాయత్నం.. భుజంపై నెత్తుటి మడుగు.. గురువారం టీవీలలో ఈ దృశ్యాలు చూసిన మరుక్షణం నుంచి రాష్ట్రంలోని ప్రతి గుండే కన్నీటి గాయంతో విలవిలలాడుతోంది. కాళ్లకు చక్రాలు కట్టుకుని వేల అడుగుల సంకల్పంతో సాగిపోతున్న బాటసారిపై అంతులేని కుట్రలకు నిలువెల్లా కంపించిపోతోంది. ఎందరో అభాగ్యుల ఆవేదనలను ఆలకించిన సంక్షేమ సారథి.. అమ్మా అంటూ కూలబడితే అంతులేని వేదనతో అల్లాడిపోతోంది. కుట్రల కత్తి చేసిన నెత్తుటి గాయం సలుపుతున్నా.. ఆ బాధను పంటి బిగువున భరిస్తూ ‘నేను క్షేమం.. అధైర్యపడొద్దు’ అంటూ ప్రజానీకాన్ని ఓదార్చిన ఆత్మ బంధువును తమ గుండె గుడిలో ఆరాధిస్తోంది. మడమ తిప్పని యోధుడి అడుగులకై ప్రతి పల్లే ఎదురు చూస్తోంది. అన్నా.. పాలకులకు జాడ తెలియని మా వాడల్లోకి.. నేనున్నానంటూ పాదయాత్రికుడివై వచ్చి ఆప్యాయంగా పలకరించావే.. ఇప్పుడు నీ ఆరోగ్యానికి మేము రక్షగా ఉంటామంటూ సంఘీభావ సంతకం చేస్తోంది. తమ ప్రేమాభిమానాలను వత్తిగా మార్చి నిండు దీవెనలను హారతి చేసి.. భగవంతుడా .. జనహృదయ నేతకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి మళ్లీ జనంలోకి పంపమంటూ రెండు చేతులూ జోడించి వేడుకుంటోంది.  

పట్నంబజారు(గుంటూరు): విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో గురువారం జరిగిన హత్యాయత్నంలో గాయపడిన వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జరిపారు. బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల పట్టణంలో ఎమ్మెల్యే కోన రఘుపతి ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కర్లపాలెంలోని పెద్దింటమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి వై.ఎస్‌.జగన్‌ ఆరోగ్యం కుదుటపడాలని వేడుకున్నారు. మాచర్ల పట్టణం శ్రీశైలం రోడ్డులో ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానంలో వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు 101 కొబ్బరికాయలు కొట్టారు. అలాగే బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాయుడు తిరుపతిరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో మైనార్టీ విభాగం గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు షేక్‌ జిలానీ ఆధ్వర్యంలో దువా (ప్రార్థన) చేపట్టగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం.డి.నసీర్‌ అహ్మద్, సంయుక్త కార్యదర్శి గులాం రసూల్‌ పాల్గొన్నారు.

అలాగే అరండల్‌పేటలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి) ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపారు. విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పుటూరి నర్సిరెడ్డి అమరావతి రోడ్డులోని ఆంజనేయస్వామి దేవస్థానంలో పూజలు జరుపగా, పార్లమెంటరీ అధ్యక్షుడు పానుగంటి చైతన్య నగరంపాలెంలోని మస్తానయ్య దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహిళా విభాగం నగర అధ్యక్షురాలు గనిక ఝాన్సీ, ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి విజయమాధవి ఆధ్వర్యంలో లాడ్జి సెంటర్‌లోని వెస్ట్‌ ప్యారీస్‌లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అనుబంధ విభాగాల ఆధ్యక్షులు, పార్టీ నేతలు అత్తోట జోసఫ్, మెట్టువెంకటప్పారెడ్డి, బండారు సాయిబాబు, ఆళ్ల పూర్ణచంద్రరావుతోపాటు ముఖ్య నేతలు కృష్ణనగర్‌లోని క్రిస్ట్‌బాప్తిస్టు చర్చిలో వై.ఎస్‌.జగన్‌ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థనలు చేపట్టారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో పట్టణ కన్వీనర్‌ బుర్రముక్క వేణుగోపాలసోమిరెడ్డి ఆధ్వర్యంలో సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు జరిపి చర్చి, మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. దుగ్గిరాల మండలంలోని జెండా చెట్టు సెంటర్‌లో ఉన్న మసీదులో మండల నేతల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను చర్చిలో స్థానిక ఎస్సీ విభాగం నేతలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండలంలోని శివాలయంలో యువజన విభాగం మండల కన్వీనర్‌ పెండ్యాల సురేష్‌ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపగా, వెనిగండ్లలో గ్రామ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి పట్టణంలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పోలేరమ్మ తల్లి ఆలయంలో అంబటి మురళి పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని నకరికల్లు, ముప్పాళ్ల, రాజుపాలెం, మండలాల్లో సర్వమత ప్రార్థనలు జరిపారు. సత్తెమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయా మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో కాట్టా సాంబయ్య, సయ్యద్‌ మాబు, షేక్‌ నాగూర్‌మీరాన్, సాంబశివరావు పాల్గొన్నారు. తాడికొండ నియోజకవర్గం తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో లూథరన్‌ చర్చిలో స్థానిక నేతలు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. అలాగే ఫిరంగిపురంలో మండల కన్వీనర్‌ షేక్‌ గఫూర్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. వేమూరు నియోజకవర్గంలోని వేమూరులోని వినాయకుని ఆలయం, కొల్లూరులోని భోగేశ్వరస్వామి ఆలయం, భట్టిప్రోలులోని పల్లెకోన లూథరన్‌ చర్చి, శివాలయం, అమర్తలూరులోని బాప్తిస్టు చర్చి, మోపర్రు, ఇంటూరులో లూథరన్‌ చర్చిలు, చుండూరు మండలంలో ఆంజనేయస్వామి దేవస్థానం, చర్చిలు, మసీదుల్లో ఆయా మండల స్థానిక నేతలు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.

Advertisement
Advertisement